గడ గడ లాడించేస్తున్నారుగా …?

వెస్ట్ ఇండీస్ ఈ పేరు వినపడితే చాలు క్రికెట్ టీంలన్ని గడగడలాడేవి. అలాంటి టీం క్రమేణా తన వైభవాన్ని కోల్పోయి ఒక అనామక జట్టుగా మిగిలిపోయింది. ఒకప్పుడు [more]

Update: 2019-06-02 02:30 GMT

వెస్ట్ ఇండీస్ ఈ పేరు వినపడితే చాలు క్రికెట్ టీంలన్ని గడగడలాడేవి. అలాంటి టీం క్రమేణా తన వైభవాన్ని కోల్పోయి ఒక అనామక జట్టుగా మిగిలిపోయింది. ఒకప్పుడు క్లెయివ్ లాయిడ్ సారధ్యంలోని పవర్ ఫుల్ విండీస్ టీం వివియన్ రిచర్డ్స్, గార్డెన్ గ్రీనిడ్జ్, రిచీ రీచర్డ్సన్, బ్రెయిన్ లారా వరకు ఒక వెలుగు వెలిగింది. వెస్ట్ ఇండీస్ లో ఒక నాటి దిగ్గజాలు మైఖేల్ హోల్డింగ్, జోయల్ గార్నర్ మాల్కం మార్షల్, కర్ట్లీ అంబ్రోస్ పేర్లు వినపడితే బ్యాట్ పట్టుకుని వెళ్ళే వారు హెల్మెట్ తడుముకుంటూ తడబడుతూ క్రీజ్ చేరుకునే వారు. ఇక లాయిడ్, రిచర్డ్స్, గ్రీనిడ్జ్, రిచర్డ్ సన్, లారా వీరిలో ఒక్కరు క్రీజ్ లో వున్నా మ్యాచ్ ప్రత్యర్థి చేతిలోనుంచి జారి పోయినట్లే. వీరందరూ మ్యాచ్ విన్నర్లే కాదు ఎక్కువ మంది ఆల్ రౌండర్ లు కావడం చరిత్ర గా లిఖించబడింది.

లారా నిష్క్రమణ తరువాత …

ప్రపంచ క్రికెట్ చరిత్రలో గాలివాటం టీం ఏదన్నా వుంది అంటే అది వెస్ట్ ఇండీస్ టీం అన్నది అందరికి తెలిసిందే. రెండుసార్లు 1975, 1979 లలో ప్రపంచ కప్ ను రెండుసార్లు ముద్దాడి రెండు దశాబ్దాలపాటు టెస్ట్, వన్డే క్రికెట్ రారాజులా ఏలింది విండీస్. 1983 లో హర్యానా హరికేన్ కపిల్ నేతృత్వంలోని సేన విండీస్ ను చిత్తు చేసి ఇండియా సగర్వంగా ప్రపంచ కప్ ను తెచ్చుకుంది. ఆ తరువాత కూడా విండీస్ కుదేలయింది లేదు. వివ్ రిచర్డ్స్ , రిచర్డ్ సన్ వంటి వారి సారధ్యం వరకు పోరాట పటిమను కోల్పోలేదు వెస్ట్ ఇండీస్. ప్రపంచ అత్యుత్తమ బ్యాట్స్ మెన్ బ్రియాన్ లారా నిష్క్రమణ వరకు ఆ టీం అంటే భయభక్తులు ప్రత్యర్థి టీం లకు విండీస్ అంటే ఉండేవి. అయితే విండీస్ క్రికెట్ బోర్డు నిర్వాకాల మూలంగా ప్రపంచ క్రికెట్ లో విండీస్ అనే జట్టు ఉందా అనే పరిస్థితికి దిగజారింది.

మళ్ళీ పుంజుకుంటుందా ….?

తాజా ప్రపంచ కప్ లో తొలి మ్యాచ్ లోనే వెస్ట్ ఇండీస్ పాకిస్తాన్ ను మట్టికరిపించిన తీరు అటు బౌలింగ్ ఇటు బ్యాటింగ్ లో ఆ టీం చూపించిన పరిపక్వత క్రికెట్ ప్రేమికుల్లో చర్చకు దారితీసింది. దేశాలకు అతీతంగా వెస్ట్ ఇండీస్ టీం ను అంతా అభిమానిస్తారు. అది ఒకప్పటి మాట, కారణం ఆ జట్టులో గతంలో వుండే బ్యాట్స్ మెన్ కానీ, బౌలర్ ల అత్యున్నత ప్రతిభ అలాటింది మరి. ఇప్పుడు విండీస్ టీం లో ఇద్దరి పేర్లే వినిపిస్తాయి. వారిలో ఒకరు విధ్వంసకర వీరుడు క్రిస్ గెయిల్, పోలార్డ్. మిగిలిన 9 మంది అనామకులు అనే చెప్పొచ్చు. అయితే ఇప్పుడు యువరక్తం తో కూడిన విండీస్ టీం. భిన్నమైన తమ టీం సవాల్ ను స్వీకరించాలని చెప్పకనే చెప్పింది. ఇంగ్లాండ్ వేదికగా విండీస్ చేసిన ఈ సింహనాదం వచ్చే మ్యాచుల్లో కూడా వినిపిస్తే మాత్రం ప్రపంచ కప్ రంజుగా మారి క్రికెట్ ప్రేమికులను అలరిస్తుందనడంలో సందేహం లేదు.

Tags:    

Similar News