మమత స్ట్రోక్ జగన్ కి తగిలేనా… ?

రాజకీయాల్లో ఉన్న వారికి పదవులు కావాలి. అక్షయ పాత్ర చేతిలో పెట్టినా కూడా వారికి కరవు తీరదు. అలాంటి పరిస్థితుల్లో పెద్దల సభ ఎక్కడ ఉన్నా కూడా [more]

Update: 2021-06-03 00:30 GMT

రాజకీయాల్లో ఉన్న వారికి పదవులు కావాలి. అక్షయ పాత్ర చేతిలో పెట్టినా కూడా వారికి కరవు తీరదు. అలాంటి పరిస్థితుల్లో పెద్దల సభ ఎక్కడ ఉన్నా కూడా అధికార పక్షాలకు చాలా బాగా కలసి వస్తుంది. తమకు కావాల్సిన వారికి పదవులు ఇచ్చుకోవచ్చు. ప్రజలతో సంబంధం లేకుండా హ్యాపీగా అధికారాన్ని చలాయించవచ్చు. ఎమ్మెల్సీగా ఉంటూనే బీహార్ సీఎం నితిష్ కుమార్ అనేక టెర్ములుగా రాజ్యం చేస్తున్నారు. ఇపుడు పశ్చిమ బెంగాల్ సీఎం మమతకు కూడా అలాంటి కోరికే పుడుతోందిట.

ఎమ్మెల్సీగానే ..?

మమత తాజా ఎన్నికల్లో తాను ఎమ్మెల్యేగా ఓడి ముఖ్యమంత్రి అయ్యారు. తన సొంత సీటుని వదులుకుని మరీ నందిగ్రాం కి వెళ్ళి ఒకనాటి కుడిభుజం సువేదు అధికారి మీద సమరం చేశారు. కానీ రిజల్ట్ తేడా కొట్టింది. ఆమె ఇపుడు సీఎం గా నెగ్గినా ఆరునెలలలోగా ఎమ్మెల్యేగా గెలిచి తీరాలి. ఇపుడు మమత చూపు శాసన మండలి మీద ఉందని వార్తలు వస్తున్నాయి. ఆమె ఎమ్మెల్సీగా తాను నామినేట్ అయితే ఈ ఎన్నికల గొడవ ఉండదు కదా అనుకుంటున్నారుట. అయితే పశ్చిమ బెంగాల్ లో చూస్తే మండలి రద్దు అయి యాభై ఏళ్ళు అయింది. దాంతో మళ్ళీ దాన్ని పునరుద్ధరించడానికి ఆమె ప్రభుత్వం ఒక తీర్మానం ఆమోదించి కేంద్రానికి పంపుతుందిట.

కంప్లీట్ రివర్స్…?

ఇక ఏపీలో చూస్తే గత ఏడాది జనవరిలో వైసీపీ సర్కార్ శాసన మండలిని రద్దు చేయమంటూ ఏకంగా అత్యవసరంగా శాసనసభను పిలిచి మరీ ఒక తీర్మానం చేశారు. దాన్ని కేంద్రానికి పంపించారు. కానీ ఇప్పటిదాకా అతీ గతీ ఏంటో తెలియడంలేదు. దాంతో ఏపీలో శాసన మండలి కంటిన్యూ అవుతోంది. జగన్ తన పార్టీ వారిని ఎమ్మెల్సీలుగా నామినేట్ చేస్తున్నారు. ఒక విధంగా మండలిలో వైసీపీకి మెజారిటీ వచ్చేసినట్లే. మరి ఈ టైమ్ లో వైసీపీ సర్కార్ చట్టబద్ధంగా అసెంబ్లీలో చేసిన తీర్మానం సంగతేంటి అన్నదే ఒక చర్చగా ఉంది.

ఉంచుతారా ..?

ఇక అప్పట్లో జగన్ నోట ఒక మాట వచ్చింది. మండలి ఎందుకు దండుగ అని. దేశంలో అయిదారు రాష్ట్రాలలో తప్ప మిగిలిన చోట్ల ఎక్కడా మండలి లేదు. దాంతో ఈ విషయం మీద జాతీయ విధానం ఉండాలని బీజేపీ ఆలోచిస్తోందని అంటున్నారు. అదే కనుక జరిగితే జగన్ నో అన్నా, మమత బెనర్జీ కావాలన్నా కూడా మోడీ సర్కార్ నిర్ణయమే ఫైనల్ అవుతుంది తప్ప మరేమీ కాదు. ఇక్కడ మరో విషయం కూడా చెప్పుకోవాలి. మమతా బెనర్జీని ముఖ్యమంత్రిగా కూర్చోనివ్వమని శపధం చేసిన బీజేపీ పెద్దలు ఆమె మండలి కావాలి అంటే ఒప్పుకుంటారా అన్నదే చూడాలి. ఆమె ఈజీగా ఎమ్మెల్సీ అయిపోయి మరింత శక్తిమంతంగా మారి బెంగాల్ లో ఉభయ సభల్లో బలాన్ని చూపితే చూస్తూ ఊరుకోవడనికి బీజేపీ రెడీగా ఉండదు అంటున్నారు. మొత్తానికి జగన్ వద్దన్న మండలి విషయంలో భారీ కుదుపు తీసుకురావడానికి మమత కొత్త ఆలోచనలు ఏమైనా ఉపయోగపడతాయా అన్నదే చూడాలి. సుబ్బి పెళ్ళి ఎంకి చావు కు వచ్చింది అన్నట్లుగా పెద్దల సభ మీద మమత మోజు పడితే ఏకంగా దేశంలోని అన్ని శాసన మండళ్ళకు మంగళం పాడేందుకు బీజేపీ రెడీ అవుతోందని టాక్.

Tags:    

Similar News