అమెరికాలో కొత్త రాష్ట్రం.. ఉద్యమాల తర్వాత?

ఏ దేశంలో అయినా ఒక కొత్త రాష్ర్టం ఏర్పాటు అంత తేలికైన విషయం కాదు. ఆషామాషీ అంశం కానేకాదు. ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు, చర్చలు, రాజకీయ ఎత్తులు, [more]

Update: 2021-05-24 16:30 GMT

ఏ దేశంలో అయినా ఒక కొత్త రాష్ర్టం ఏర్పాటు అంత తేలికైన విషయం కాదు. ఆషామాషీ అంశం కానేకాదు. ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు, చర్చలు, రాజకీయ ఎత్తులు, పైఎత్తులు తప్పవు. మద్రాసు నుంచి ఆంధ్ర ఏర్పాటు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సందర్భంగా జరిగిన ఉద్యమాలు, పోరాటాలు తెలిసినవే. మద్రాసు నుంచి విభజన, కర్నూలు రాజధానిగా 1953 అక్టోబరు 1న ఆంధ్ర రాష్ర్ట ఏర్పాటు సందర్భంగా నాటి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ పాత్ర తదితర అంశాల గురించి తొలితరం వారికి విదితమే. 2014లో తెలంగాణ ఏర్పాటు సందర్భంగా ఉభయ రాష్రాల్లో చోటుచేసుకున్న పరిణామాలు తెలిసినవే. ఇతర అంశాలు ఎలా ఉన్నప్పటికీ కొత్త రాష్ర్ట ఏర్పాటుకు కావలసింది బలమైన రాజకీయ సంకల్పం.

ఎన్నికల హామీల్లో భాగంగా…?

అగ్రరాజ్యమైన అమెరికాలో 51వ కొత్త రాష్ర్టం ఏర్పాటు సందర్భంగా జరుగుతున్న పరిణామాలు తెలుగు రాష్రాల ఉదంతాలను గుర్తుకు తెస్తున్నాయి. తాజాగా రాజధాని నగరమైన వాషింగ్టన్ డీసీని కొత్త రాష్ర్టంగా ఏర్పాటు చేసేందుకు అధ్యక్షుడు జో బైడెన్ నిర్ణయం తీసుకున్నారు. చాలాకాలంగా అమెరికా 50 రాష్రాలతో కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ అంశం ప్రజల మనసుల్లో బాగా ముద్రపడిపోయింది. కొత్త రాష్ర్ట ఏర్పాటు అన్నది డెమొక్రట్ల ఎన్నికల హామీ. ఇప్పుడు ఆ హామీ అమలు దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు ఆ పార్టీ నేతలు. సహజంగా డెమొక్రట్లను వ్యతిరేకించే రిపబ్లికన్లు కొత్త రాష్ర్ట ఏర్పాటుకు మోకాలడ్డుతున్నారు. చట్టసభల్లో ఉన్న బలాబలాల ఆధారంగా చూస్తే కొత్త రాష్రం ఆవిర్భవించడం అనివార్యం. ఇప్పటికే దీనికి సంబంధించిన బిల్లును ప్రతినిధుల సభ (మన లోక్ సభ వంటిది) 216-208 మెజార్టీతో ఆమోదించింది. ఇక మిగిలింది సెనెట్ (మన రాజ్యసభ వంటిది ) ఆమోదం మాత్రమే. ఇక్కడ అధికార డెమొక్రట్లు, విపక్ష రిపబ్లికన్లకు సమాన బలం ఉంది. అయితే సభకు అధ్యక్షత వహించే ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ డెమొక్రటిక్ పార్టీకి చెందిన వారే కావడం కలసివచ్చే విషయం. ఆమె వేసే కాస్టింగ్ ఓటుతో కొత్త రాష్ర్ట బిల్లు గట్టెక్కడం ఖాయం.

డెమొక్రాట్లకు పట్టున్న…..

సుమారు 66 చదరపు మైళ్ల విస్తీర్ణంలో ఉండే వాషింగ్టన్ డీసీ రాజధాని నగరం. దేశ తొలి అధ్యక్షుడు జార్జి వాషింగ్టన్ పేరుతో ఈ నగరం ఆవిర్భవించింది. దీని జనాభా ఏడు లక్షల లోపే. ప్రస్తుతం ఇది కొలంబియా రాష్ర్ట పరిధిలో ఉంది. ఇక్కడ మొదటి నుంచీ డెమొక్రట్ల ఆధిపత్యమే ఎక్కువ. ఈ పార్టీకి చెందిన వారే చట్టసభలకు అత్యధికంగా ఎన్నికవుతుంటారు. డెమొక్రటిక్ పార్టీకి చెందిన మాజీ అధ్యక్షులు బిల్ క్లింటన్, బరాక్ ఒబామా కొత్త రాష్ర్ట ఏర్పాటుకు మొదటినుంచీ సుముఖంగానే ఉన్నారు. ప్రత్యేక రాష్ర్ట ఏర్పాటు ఉద్యమం ఈనాటిది కాదు. 1950 నుంచి ఉద్యమాలు జరుగుతున్నాయి. రిపబ్లికన్లు అధికారంలో ఉన్నంత కాలం ఏదో ఒక పేరుతో ఈ డిమాండును తొక్కిపెడుతూ వచ్చారు. డెమొక్రట్లు అధికారంలో ఉన్నప్పుడు చట్టసభల్లో తగినంత బలం లేక ముందుకు వెళ్లలేకపోతున్నారు. ఇప్పుడు పరిస్థితులు సానుకూలంగా ఉండటంతో తమ చిరకాల వాంఛను కార్యరూపంలోకి తెచ్చేందుకు అడుగులు వేస్తున్నారు.

ప్రత్యేక రాష్ట్రంతోనే…?

వాషింగ్టన్ డీసీ రాజకీయంగా అత్యంతప్రభావితమైన ప్రాంతం. ఇక్కడ డ్రగ్స్ నేరాలు అధికం. ఇక్కడ జరిగే వైట్ కాలర్ నేరాలు, ఇతర నేరాలను ప్రత్యేక రాష్ర్టంతో కట్టడి చేయవచ్చన్నది అధికార పార్టీ భావన. కొత్త రాష్ర్ట ఏర్పాటుతో ఇక్కడి నుంచి హౌస్ ఆఫ్ కామన్స్ లో ప్రాతినిధ్యం లభిస్తుంది. సెనెట్ కు ఇద్దరు ఎన్నికవుతారు. అమెరికా రాజ్యాంగం జనాభాతో సంబంధం లేకుండా ప్రకారం ప్రతి రాష్రం నుంచి సెనెట్ కు ఇద్దరు ప్రాతినిధ్యం వహిస్తారు. కొత్త రాష్ర్ట ఏర్పాటులో భాగంగా కొలంబియా రాష్రాన్ని కుదించే, విభజించే చట్టపరమైన ప్రక్రియ కూడా పూర్తయింది. దీంతో డెమొక్రట్లఎన్నికల హామీ త్వరలోనే కార్యరూపం దాల్చనుంది. అమెరికా రాజకీయ చిత్రపటంలో కొత్త రాష్ర్టం పేరు కనపడనుంది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News