అవును యుద్ధమే

యుద్ధంలో ఎప్పుడు ప్రత్యర్థి ఓటమినే ఎవరైనా కోరుకుంటారు. గెలుపు ధీమాతో ఎదుటి వాళ్ళు వేసే తప్పటడుగులు మీదే గంపెడు ఆశలు పెట్టుకుని యుద్ధం చేయాల్సి ఉంటుంది. ఆంధ్రజ్యోతి [more]

Update: 2019-09-20 06:30 GMT

యుద్ధంలో ఎప్పుడు ప్రత్యర్థి ఓటమినే ఎవరైనా కోరుకుంటారు. గెలుపు ధీమాతో ఎదుటి వాళ్ళు వేసే తప్పటడుగులు మీదే గంపెడు ఆశలు పెట్టుకుని యుద్ధం చేయాల్సి ఉంటుంది. ఆంధ్రజ్యోతి కథనం అలాంటి గెలుపే. 100 రోజుల వైఎస్ జగన్ పాలన ఉత్సాహం మీద ఆంధ్రజ్యోతి చప్పున నీళ్లు చల్లింది. సమాధానం చెప్పుకోవాల్సిన స్థితిలోకి సర్కారును నెట్టింది. దాదాపు 20లక్షల మంది పరీక్షలు రాస్తే రెండు లక్షల మంది అర్హత సాధిస్తే, త్వరలో లక్షన్నర ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామని ధీమాగా చెప్పుకోలేని పరిస్థితి ఎదురైంది. పరీక్షా పత్రాల లీక్ అంటూ వచ్చిన కథనం ఎదో రాజకీయ విమర్శ కాదు. పద్దతిగా, పక్కాగా పేర్లతో సహా ఉటంకించిన వార్త.

సహేతుకమైనవే….

ఇందులో తర్క విరుద్ధ అంశాలు ఏమి లేవు. ఆంధ్రజ్యోతి ఆరోపణలు కూడా సహేతుకమైనవే. ఏపీపీఎస్సీ బాధ్యుల మీదే రకరకాల విమర్శలు, ఆరోపణలు ఎదురవుతున్న వేళ ఓ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని నిర్లక్ష్యంగా నిర్వహించిన తీరు బయట పడింది. ఇందులో బాధ్యులు, లబ్ధిదారుల సంఖ్య చాలా తక్కువే కావొచ్చు. లక్షలాది మంది ఉద్యోగార్డుల్లో వారి శాతం నామ మాత్రం కావొచ్చు. కానీ మొత్తం పరీక్షల విశ్వసనీయత మీద ఉద్యోగాలు రాని అభ్యర్థులకు అనుమానం వచ్చేస్తుంది. అది ఎప్పటికీ అలా ఉండిపోతుంది.

ఉద్యోగాల దందా….

లక్షల మంది ఏళ్ళ తరబడి ప్రభుత్వ ఉద్యోగాలే ఆశగా శ్రమిస్తే కొంతమంది ఇలా సునాయాసంగా కొలువులోకి వచ్చేస్తే ., ప్రభుత్వం ఆశించిన మేలు కంటే చెడే ఎక్కువ జరుగుతుంది. గ్రామ సచివాలయలు అంటే ఓ చులకన భావం ఏర్పడుతుంది. పరీక్షలు నిర్వహించే సంస్థలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకే టాప్ స్కోర్ రావడం, వారి బంధువులు, మిత్రులు ఇలా ఎంత మంది లబ్ది పొందారు అనేది చర్చగా మారుతుంది. ఇప్పటికే ప్రకాశం జిల్లాలో ఈ దందా నడిచిందనే వార్తలు కూడా వస్తున్నాయి.

ఆఫ్ లైన్ లో ఎందుకు….?

జాతీయ స్థాయి పరీక్షలు మొత్తం ఆన్ లైన్ లో నిర్వహిస్తుంటే ఇక్కడ మాత్రం ఆఫ్ లైన్ లో నిర్వహించడం, ప్రశ్న పత్రాల తయారీ కూడా వారికే వదిలేశారు. ఇప్పుడు జరిగిన పరిణామాలతో ప్రభుత్వం వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి. యూనివర్సిటీలలో సెట్ లను పకడ్బందీగా నిర్వహిస్తుంటే ఏపీపీఎస్సీ మాత్రం ఇటీవలి కాలంలో ఎప్పుడూ పిల్లి మొగ్గలు వేస్తూనే ఉంది. ఈ వ్యవహారంలో ప్రభుత్వం దాటవేత వైఖరి ప్రదర్శిస్తే జరిగే మేలు కంటే నష్టమే ఎక్కువ. చివరగా ప్రభుత్వం మీద బురద చల్లడానికే ఆంధ్రజ్యోతిలో ఈ కథనం వచ్చిందని, చంద్రబాబు ఇదే స్థాయిలో ఉద్యోగాలు భర్తీ చేస్తే ఇలాగే రాస్తారా అని ఎదురు ప్రశ్నలు కూడా రావొచ్చు. నిజమే అప్పుడు ఆంధ్రజ్యోతి లో ఆ కథనం రాదు. ఆ పని చేయాల్సిన బాధ్యత సాక్షిది అవుతుంది. పత్రికల బాధ్యత ప్రతిపక్ష పాత్రే కదా….? సొంత పత్రికలు రాయనపుడు ప్రతిపక్ష పత్రికల్లో నే కదా రాయాల్సింది.

Tags:    

Similar News