పుతిన్.. ఇలా నలిపేస్తే…ఎలా?

ప్రాంతం, రాష్ర్టం,దేశం … ఏదైనా కావచ్చు. కొన్నిచోట్ల ప్రజాస్వామ్య, మరికొన్ని చోట్ల నియంతృత్వ, ఇంకొన్ని చోట్ల కుటుంబ, సైనిక పాలనలు కొనసాగుతుండవచ్చు. కానీ రాజకీయం ఎక్కడైనా రాజకీయమే. [more]

Update: 2021-02-21 16:30 GMT

ప్రాంతం, రాష్ర్టం,దేశం … ఏదైనా కావచ్చు. కొన్నిచోట్ల ప్రజాస్వామ్య, మరికొన్ని చోట్ల నియంతృత్వ, ఇంకొన్ని చోట్ల కుటుంబ, సైనిక పాలనలు కొనసాగుతుండవచ్చు. కానీ రాజకీయం ఎక్కడైనా రాజకీయమే. రాజకీయాలు పైకి కనపడినంత స్వచ్ఛంగా ఉండవు. పాలకుల మాటలు, చేతల్లో చెప్పుకున్నంత నిజాయతీ కనపడదు. రాజకీయ ప్రత్యర్థులను ఏదోరకంగా అణచివేతకు ప్రయత్నిస్తుంటారు. అరెస్టులు, కోర్టులు, కేసుల పేరుతో వేధిస్తుంటారు. సైనిక పాలనల్లో అయితే ఏకంగా హతమార్చేందుకు కూడా వెనకాడరు. రాచరికాల్లో ఊచకోతలే జరుగుతుంటాయి. ఇటీవల అమెరికా అధ్యక్ష ఎన్నికలు, తదతనంతర పరిణామాలు యావత్ ప్రపంచాన్నే ఆశ్చర్య పరిచాయి. సామ్యవాదం జపం చేసే కమ్యూనిస్టు దేశాల్లో పరిస్థితి మరింత దారుణం. అక్కడ అసమ్మతి గళమే వినిపించదు. నిరసన స్వరాన్ని నులిమేస్తారు. పొరుగున ఉన్న చైనా ఇందుకు నిలువెత్తు నిదర్శనం.

రాజకీయ ప్రత్యర్థులను….

ఒకప్పటి అగ్రరాజ్యమైన సోవియట్ యూనియన్ దేశమైన ప్రస్తుత రష్యాలో ఇప్పుడు ఇలాంటి పరిస్థితే నెలకొంది. రెండు దశాబ్దాల నుంచి రష్యాను ఏకచ్ఛాద్రిపత్యంగా పాలిస్తున్న వ్లాదిమర్ పుతిన్ రాజకీయ ప్రత్యర్థులను ఉక్కుపాదంతో అణచివేస్తున్నారు. రకరకాల కేసులతో వేధిస్తున్నారు. రాజకీయ ప్రత్యర్థి అలెక్సీ నావల్నీని వెంటాడుతున్నారు. తాజాగా జర్మనీ నుంచి జనవరి 17న స్వదేశానికి వచ్చిన ఆయనను మాస్కో విమానాశ్రయంలోనే పోలీసులు అరెస్టు చేయడం ఇందుకు నిదర్శనం. అలెక్సీకి 30 రోజుల పాటు రిమాండ్ విధించారు. పెరోల్ నిబంధనలను ఉల్లంఘించారన్నది ఆయనపై పోలీసుల అభియోగం. నావల్నీ రష్యా ప్రతిపక్ష నేత. రష్యా ఆఫ్ ది ఫ్యూచర్ పార్టీ అధినేత. ప్రముఖ న్యాయవాది, మానవ హక్కుల కార్యరక్త. అవినీతిని వెలికితీయడంలో, అక్రమాలను అడ్డుకోవడంలో ముందుంటారు. 44 సంవత్సరాల నావల్నీ 2013లో మాస్కో నగర మేయర్ ఎన్నికల్లో పోటీచేసి రెండో స్థానంలో నిలిచారు. 27 శాతం ఓట్లు సాధించి అధ్యక్షుడు పుతిన్ పార్టీకి ముచ్చెమటలు పట్టించారు.

అప్పుడు అనర్హత వేటు వేసి…..

2018 అధ్యక్ష ఎన్నికల్లో పుతిన్ పైపోటీకి దిగగా ఎన్నికల సంఘం నావల్నీపై అనర్హత వేటేసింది. సుప్రీంకోర్టులో కూడా ఆయనకు న్యాయం లభించలేదు. దీంతో పుతిన్ కు అడ్డే లేకుండా పోయింది. ఈ ఏడాది జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నావల్నీ రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇందులో భాగంగానే స్వదేశానికి వచ్చారు. అలక్సీ అసలు కథ తెలుసుకుంటే ఆశ్ఛర్యం కలుగుతుంది. కొన్ని నెలల క్రితం ఆయన అనుమానాస్పద స్థితిలో విషప్రయోగనికి గురయ్యారు. దీంతో అయిదు నెలలుగా జర్మనీలో చికిత్స తీసుకుంటున్నారు. ఇప్పుడు అక్కడి నుంచే ఆయన మాస్కోకు వచ్చారు. గత ఏడాది ఆగస్టులో ప్రభుత్వమే తనపై
విష ప్రయోగానికి పాల్పడిందన్నది నావల్నీ ఆరోపణ. దీనికి ప్రభుత్వం నుంచి మౌనమే సమాధానమైంది.

రాజ్యాంగ సవరణకు కూడా….?

చికిత్స పొందుతున్నప్పటికీ గత కొంత కాలంగా ఆయన పుతిన్ పైన, ప్రభుత్వంపైనా విమర్శలు గుప్పిస్తున్నారు. 2036 వరకు తానే అధికారంలో ఉండేలా 2020 జులైలో పుతిన్ రాజ్యాంగాన్ని సవరించినప్పుడు దానిని నావల్నీ నిరసించారు. ఒక వ్యక్తికి అపరిమిత అధికారం ఉండటం దేశానికి మంచిది కాదని హితవు పలికారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నిసార్లు అయినా ఎన్నిక కావచ్చని సూచించారు. ఇలాంటి సహేతుక విమర్శలే ఆయనను జైలుకు పంపాయి. నావల్నీ అరెస్టును ఐరాస మానవ హక్కుల మండలి, అమెరికాతో సహా అనేక ప్రపంచ దేశాలు నిరసించినా పుతిన్ లో చలనం లేదు. ఇందులో ఆశ్ఛర్యపోవలసింది కూడా ఏమీ లేదు. అధికారంలో ఉన్న వారి తీరు అంతే ఉంటుంది మరి.

 

-ఎడిటోరయల్ డెస్క్

Tags:    

Similar News