రాజుల కోటలో రచ్చ…రచ్చ ?

విజయనగరం జిల్లాలో పూసపాటి రాజులకు ఎంతో చరిత్ర ఉంది. సంస్థానాధీశులుగా ప్రభువులుగా వారు రాజ్యాలు ఏలారు. వారి పేరు మీద అణువణువు విజయనగరంలో ఉంది. వారి ఆస్తులే [more]

Update: 2020-06-19 12:30 GMT

విజయనగరం జిల్లాలో పూసపాటి రాజులకు ఎంతో చరిత్ర ఉంది. సంస్థానాధీశులుగా ప్రభువులుగా వారు రాజ్యాలు ఏలారు. వారి పేరు మీద అణువణువు విజయనగరంలో ఉంది. వారి ఆస్తులే చాలా వరకూ ప్రజలకు దారాదత్తం చేసి అభివృధ్ధిలో భాగమయ్యారు. పూసపాటి రాజులను రాజకీయంగా ఎవరైనా విమర్శ చేయ‌వచ్చు కానీ వారి వంశాన్ని వంకపెట్టి ఒక్క మాట కూడా అనలేరు. వారు దానధర్మాలను, త్యాగ నిరతిని, సేవాభావాన్ని సైతం ప్రత్యర్దులు అయినా కూడా ఎవరూ మెచ్చుకోకుండా ఉండలేరు. అటువంటి రాజులు ప్రజాస్వామ్యంలో ఎంత సామాన్యులుగా ఉన్నా కూడా మరీ ఇలా ఆస్తుల కోసం గొడవలు పడడాన్ని సగటు ప్రజానీకం తట్టుకోలేకపోతున్నారు.

చిచ్చు అలా….

మూడు నెలల క్రిత్రం వరకూ అంతా బాగానే ఉంది. పూసపాటి రాజుల మొత్తం కుటుంబానికి పెద్దాయనగా కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు ఉంటూ వచ్చారు. ఆయనే పూసపాటి వారి మాన్సాస్ ట్రస్ట్, సింహాచలం దేవస్థానం ట్రస్ట్ చైర్మన్ గా వ్యవహారాలన్నీ చూస్తూ పెద్ద దిక్కుగా ఉండేవారు. అటువంటిది పూసపాటి రాజుల కోటలో సెగలు పొగలు రగుతున్నాయి. పగలు పెరిగిపోతున్నాయి. ఆనందగజపతిరాజు మొదటి భార్య కుమార్తెగా ఉన్న సంచయిత గజపతిరాజును తీసుకువచ్చి రాష్ట్ర ప్రభుత్వం మాన్సాస్ ట్రస్ట్, సింహాచలం దేవస్థానం చైర్ పర్సన్ పదవులు అప్పగించింది. దాంతో పెద్దాయన తల్లడిల్లారు, కోర్టుకు వెళ్ళి న్యాయపోరాటం చేస్తున్నారు.

సీన్ లోకి వారు….

ఇక ఇపుడు మరో ఇద్దరు సీన్ లోకి వచ్చారు. వారే ఆనందగజపతిరాజు రెండవ భార్య సుధాగజపతిరాజు, కుమార్తె ఊర్మిళా గజపతిరాజు. ఆనంద్ ఆస్తిలోనూ, పూసపాటి వారి వారసత్వంలోనూ తమకే హక్కులు పూర్తిగా ఉన్నాయని అంటున్నారు. ఈ విషయంలో సంచయిత గజపతిరాజుకు ఏ విధమైన అధికారాలు లేవని కూడా స్పష్టం చేస్తున్నారు. తమ ఆస్తుల కోసం, హక్కుల కోసం న్యాయ పోరాటం చేస్తామని కూడా అంటున్నారు. మొత్తానికి చూస్తే ఇపుడు మూడవ పార్టీ గా తల్లీకూతుళ్ళు లండన్ నుంచి వచ్చి మరీ పోరాటానికి రెడీ అంటున్నారు.

మూడు ముక్కలాటే….?

నిజానికి పూసపాటి రాజుల్లో చొదటి తరంలో పీవీజీ రాజుకు ఇద్దరు భార్యలు ఉన్నారు. మొదటి భార్య పిల్లలుగా ఆనంద్, అశోక్ వెలుగులోకి వచ్చారు. తండ్రి రాజకీయ వారసత్వాన్ని కూడా కొనసాగించారు. ఇక పీవీజీ రాజు రెండవ భార్యకు కూడా పిల్లలు ఉన్నారు, వారిలో మగ సంతానం కూడా ఉంది. అంటే ఆనంద్, అశోక్ లకు సోదరులు అన్నమాట. అలాగే అప్ప చెల్లెళ్ళు కూడా ఉన్నారు. ఇక మూడ తరంలో అందరికీ సంతానం ఉన్నారు. అందులో చాలా మంది ఇపుడు ఏమీ కాకుండా ఉన్నారు. ఇపుడు మూడు వైపుల నుంచి పూసపాటి వారి ఆస్తుల కోసం పోరాటం మొదలైంది. దాన్ని ప్రేరణగా తీసుకుని మరింతమంది వారసులు కోర్టుకి ఎక్కితే అపుడు పూసపాటి వారి వంశం,పేరు ప్రతిష్ట కూడా ఇబ్బందుల్లో పడతాయని అంటున్నారు. మరి ఇంతవరకూ పెద్దాయనగా ఉంటూ వచ్చిన అశోక్ ఆస్తుల విషయంలో తానూ ఒక పార్టీగా మారిపోవడంతో పెద్ద దిక్కుగా అందరినీ కలిపి ఉంచేవారు లేరా అన్న సందేహాలు వస్తున్నాయి. ఏది ఏమైనా రాజుల కోటలో ఇది అతి పెద్ద చిచ్చుగా, రచ్చగా భావించాలి.

Tags:    

Similar News