రాజు గారి ఉక్రోషం కూడా వారి మీదనే ?

ఆయన కార్మిక నాయకుడు. హఠాత్తుగా రాజకీయాల్లోకి రావడం, వెంటనే ఎమ్మెల్యే టికెట్ దక్కడం పొత్తుల లాభంతో ఏకంగా నెగ్గేసి అసెంబ్లీలో బీజేపీ శాసనసభా పక్ష నేత అయిపోయారు. [more]

Update: 2020-05-07 03:30 GMT

ఆయన కార్మిక నాయకుడు. హఠాత్తుగా రాజకీయాల్లోకి రావడం, వెంటనే ఎమ్మెల్యే టికెట్ దక్కడం పొత్తుల లాభంతో ఏకంగా నెగ్గేసి అసెంబ్లీలో బీజేపీ శాసనసభా పక్ష నేత అయిపోయారు. అయిదేళ్ల చంద్రబాబు పాలనలో మూడేళ్ళు జగన్ విపక్ష నేతగా ఉంటే చివరి రెండేళ్ళు అనుకోని వరంగా విష‌్ణుకుమార్ రాజు గారే మొత్తం అసెంబ్లీకి ప్రతిపక్ష నేతగా వెలిగారు. ఓ విధంగా అతి తక్కువ టైంలో ఇటు ఏపీలోనూ, అటు బీజేపీలోనూ ఆయన కీలకనేతగా మారారు. ఈ ఇమేజ్ తో రెండవసారి సులువుగా గెలవవ‌చ్చు అనుకున్నారు. అయితే విశాఖ ఉత్తరంలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పోటీ చేయడంతో విష‌్ణుకుమార్ రాజు మూడవ ప్లేస్ లోకి వచ్చి మరీ ఓడిపోయారు. అయినా మిగిలిన వారి మాదిరిగా కాకుండా డిపాజిట్లు దక్కించుకున్నారు.

అసహనం…..

ఇదిలా ఉండగా గత ఏడాదిగా ఆయన బీజేపీలో నాయకుడిగా ఉంటున్నారు కానీ మునుపటి జోష్ లేదు, తాజాగా కరోనా వేళ తన నియోజకవర్గం ప్రజలకు కొద్దో గొప్పో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే విష‌్ణుకుమార్ రాజు మాత్రం ఇదేదీ రాజకీయం అనుకోకండని తన మీద తానే సెటైర్లు వేసుకుంటున్నారు. అయినా ఇపుడు ఏదో సేవ చేస్తే పొంగిపోయి జనాలు ఎన్నికల్లో ఓట్లు వేస్తారనుకోవడం భ్రమ అని కూడా ఆయన అంటున్నారు. ప్రజలు కూడా మారిపోయారని అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఓటుకు నోటుట……

అయిదేళ్ళు ఎక్కడ ఉన్నా ఫరవాలేదు, ఆ టైం కి ఒక చేతిలో టికెట్ పట్టుకుని మరో చేత్తో డబ్బు మూటలతో దిగిపోయిన వారే గెలుపు గుర్రాలు అని విష‌్ణుకుమార్ రాజు అంటున్నారు. ఓటుకు నోటు ఇస్తే చాలు అయిదేళ్ళూ ప్రజలకు ఏం చేయకపోయినా ఫరవాలేదు అని కూడా రాజకీయ వేదాంతం చెప్పేస్తున్నారు. ఆ విధంగానే గెలిచిన నాయకులు ఇపుడు పత్తా లేకుండా పోయారని పరోక్షంగా ఆయన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మీద హాట్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రజలకు అయిదేళ్ళూ తాను కనిపెట్టుకుని ఉన్నా ఎన్నికల్లో ఓడించారని వాపోతున్నారు.

ప్రజలు మారాలట :

నిజమే ఓడిన వారంతా ప్రజలే మారాలి అంటారు. పైసలు చేతికిస్తే వద్దని ఓటరు ఉంటాడా. నాయకులు అంతా కలసి ఎన్నికల్లో పైసా ఇవ్వమని ఒట్టేసుకుని నిలబడితే జనం తమకు అందులో నచ్చిన వాడినే ఎన్నుకుంటారు కదా. ప్రజలకు తాయిలాలు ఓ చేత్తో ఇస్తూ మరో వైపు తీసుకోవద్దని చెప్పడం వల్ల ఉపయోగం ఏంటన్న మాట కూడా వినిపిస్తోంది. నిజానికి విష్ణుకుమార్ రాజు ప్రజలకు చేతనైన సేవ చేశారు. కానీ ఆయన పార్టీకి బేస్ లేకపోవడం, నాలుగేళ్ళు టీడీపీతో పొత్తు వంటివి వ్యతిరేకంగా మారి ఓడించేశాయి. ఓడిపోతే జనాలను నిందించే నాయకులు గెలిస్తే మాత్రం తమ ప్రతిభ అని చెప్పుకోవడం కూడా పరిపాటిగా మారింది. పైసా పంచలేదు అందుకే ఓడిపోయాను అని నిన్న పవన్ కళ్యాణ్ అంటే నేడు విష‌్ణుకుమార్ రాజు అదే మాట అంటున్నారు. మొత్తానికి తప్పు జనాల మీదకు తోస్తున్నారు తప్ప, తమ పార్టీని జనంలో ఎంతవరకూ ఉంచామని బేరీజు వేసుకోలేకపోతున్నారు. ఏది ఏమైనా రాజుగారిలో ఓడిన ఏడాది తరువాత వైరాగ్యం రావడం వింతే మరి.

Tags:    

Similar News