రాజు గారు హర్ట్ అయ్యారు జగన్… ?

అదేంటో జగన్ కి రాజుల నుంచే కొంత ఇబ్బంది వస్తోంది. సొంత పార్టీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు చెవిలో జోరిగ మాదిరిగా మారి చేయాల్సిన డ్యామేజిని [more]

Update: 2021-06-01 03:30 GMT

అదేంటో జగన్ కి రాజుల నుంచే కొంత ఇబ్బంది వస్తోంది. సొంత పార్టీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు చెవిలో జోరిగ మాదిరిగా మారి చేయాల్సిన డ్యామేజిని అటు పార్టీకి ఇటు ప్రభుత్వానికి చేసేస్తున్నారు. ఆయన విషయం అలా ఉంటే ఇపుడు విశాఖకు చెందిన బీజేపీ నేత విష్ణు కుమార్ రాజు కూడా జగన్ మీద ఘాటుగానే విమర్శలు చేస్తున్నారు. జగన్ ని ఒక నియంత అంటూ నిందిస్తున్నారు. ఆయనను వింత ముఖ్యమంత్రి అని కూడా కొత్త పేరు పెట్టేశారు. ఏపీలో జగన్ అనుకున్నదే జరగాలా అంటూ నిలదీస్తున్నారు.

ఆనాటి చెలిమి…

2014 ఎన్నికల తరువాత ఏపీకి జగన్ విపక్ష నేతగా ఉన్నపుడు బీజేపీ తరఫున శాసన సభా పక్ష నేతగా విష్ణు కుమార్ రాజు ఉండేవారు. అప్పట్లో సభలో విపక్షాలను కోఆర్డినేట్ చేసుకునే ప్రాసెస్ లో జగన్ కి ఆయన సన్నిహితం అయ్యారు. రాజు అటు చంద్రబాబుకూ ఇటు జగన్ కి కూడా చెడ్డకాకుండా మంచి మిత్రుడిగా మధ్యవర్తిగా వ్యవహరించేవారు. అలాంటి చనువు పెంచుకున్న విష్ణు కుమార్ రాజుకు అటు వైసీపీలో కానీ ఇటు టీడీపీలో కానీ సీటు ఖాయమని అంతా అనుకున్నారు. దానికి తగినట్లుగా రాజు కూడా రెండు పార్టీలను పొగుడుతూ వచ్చారు. గత ఎన్నికల్లో టికెట్ కోసం ప్రయత్నం చేశారని అయినా రాలేదనీ చెబుతారు.

అదే బాధట ….?

ఇక జగన్ సీఎం అయిన కొత్తలో ఆయన పాలనను విష్ణు కుమార్ రాజు బాగా మెచ్చుకునేవారు. ఇంగ్లీష్ మీడియం విద్యా బోధన మీద ఆయన గట్టి మద్దతు ఇచ్చారు. పార్టీ స్టాండ్ కి భిన్నంగా కూడా చాలా సార్లు జగన్ని పొగిడేవారు. ఈ చనువుతో ఆయన జగన్ని వ్యక్తిగతంగా కలవాలని చాలా సార్లు ట్రై చేశారుట. ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ మాత్రం ఆయనకు దొరకలేదుట. మరి పొరపాటు ఎక్కడ జరిగిందో కానీ జగన్ ని నేరుగా కలసి ప్రజా సమస్యలు ప్రస్థావనకు తెద్దామని చూసిన విష్ణు కుమార్ రాజుకు నో అపాయింట్మెంట్ అని జగన్ పేషీ నుంచి ఆన్సర్ వచ్చిందట. దాంతో మండుకుపోయిన రాజు జగన్ మీద విమర్శలకు తెర తీశారు అంటారు. ఒక మాజీ ఎమ్మెల్యేగా, మాజీ ఫ్లోర్ లీడర్ గా జగన్ని కలుద్దామనుకుంటే తనకే అవకాశం లేదని చెబుతూ ఈ రోజుకూ విష్ణు కుమార్ రాజు హర్ట్ అవుతూనే ఉన్నారు.

మారిన రూటు ….

ఇక ఇదే నేపధ్యంలో ఏపీలో రాజకీయ పరిణామాలు కూడా వేగంగా మారిపోయాయి. యాంటీ జగన్ స్టాండ్ తో బలపడాలని బీజేపీ చూడడంతో పాటు వైసీపీ సర్కార్ మీద గట్టిగా విరుచుకుపడాల్సిందే అంటూ ఆదేశాలు జారీ చేయడంతో దాన్ని అందిపుచ్చుకుని జగన్ మీద ఒంటి కాలు మీదే విష్ణు కుమార్ రాజు చెలరేగుతున్నారు. జగన్ ఏలుబడిలో వ్యవస్థలు అన్నీ కూడా కుప్ప కూలాయి అంటున్నారు. ఏపీలో ప్రజా ప్రతినిధులకే న్యాయం జరగకపోతే సామాన్యుల సంగతేంటి అంటూ కూడా విష్ణు కుమార్ రాజు ప్రశ్నిస్తున్నారు. జగన్ ది వింత విచిత్ర ప్రభుత్వమని, విపక్షాల గొంతు నొక్కే సర్కార్ అంటూ రాజు గారు ఫైర్ అవుతున్నారు. మరి బీజేపీ నేత సోము వీర్రాజుకు జగన్ అపాయింట్మెంట్ ఇచ్చారు. సీపీఎం నేతకూ ఇచ్చారు. విష్ణు కుమార్ రాజుకి కూడా అలాగే అపాయింట్మెంట్ ఇచ్చి ఉంటే ఆయన రాజకీయ విమర్శల సంగతి పక్కన పెడితే ఇలా హర్ట్ అయిన బాధ నుంచి కాస్తా రిలీఫ్ లభిస్తుంది కదా అంటున్న వారూ ఉన్నారు.

Tags:    

Similar News