రాజు గారిది కరెక్ట్ రూటేనా..?

అదేంటో ఏపీ బీజేపీకి కొత్త అధ్యక్షుడు మారి కూడా నెలలు గడచిపోయాయి. తెల్లారిలేస్తే సోము వీర్రాజు చంద్రబాబు మీద ఎంతలా విరుచుకుపడతారో అందరికీ తెలిసిందే ఆయన బాబు [more]

Update: 2020-12-07 02:00 GMT

అదేంటో ఏపీ బీజేపీకి కొత్త అధ్యక్షుడు మారి కూడా నెలలు గడచిపోయాయి. తెల్లారిలేస్తే సోము వీర్రాజు చంద్రబాబు మీద ఎంతలా విరుచుకుపడతారో అందరికీ తెలిసిందే ఆయన బాబు అయిదేళ్ళ పాలనను పూర్తిగా ఎండగడతారు, పెద్ద ఎత్తున సవాళ్ళు చేస్తారు, అవినీతి పాలనతో ఏపీ కొంప ముంచారంటూ గొంతెత్తి చాటుతారు. మరి ఆయన తనలాగే ఉండాలని టీమ్ ని ఎంపిక చేసుకున్నారు. మరి వారు అలా ఉంటున్నారా అంటే కొందరు ఇంకా పాత వాసనలతో, అదే మూసలో కొనసాగుతున్నారు అని అంటున్నారు. విశాఖకు చెందిన మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజుని ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడిగా సోము వీర్రాజు చేశారు. అయితే ఆయన ఇంకా సోము వేడిని వాడిని వంటబట్టించుకోలేదని టాక్.

సాఫ్ట్ కార్నర్ అలా….

ఆయనకు చంద్రబాబు అంటే చాలా ఇష్టం. ఆ విషయం మనసులో ఎక్కడా దాచుకోలేదు, గత అయిదేళ్ళ కాలంలో ఏపీ బీజేపీ శాసనసభా పక్ష నేతగా విష్ణు కుమార్ రాజు ఉండేవారు. నాడు ఆయన అసెంబ్లీలో చంద్రబాబును అలనాటి అందాల నటుడు శోభన్ బాబు తో పోల్చారు. బాబుని పాలనాదక్షుడంటూ కితాబు ఇచ్చారు. బీజేపీతో చంద్రబాబు కటీఫ్ చేసుకున్నా కూడా అదే సాఫ్ట్ కార్నర్ తో ఆయన అసెంబ్లీ బయటా లోపలా వ్యవహరించారు. దానికి కొన్ని కారణాలు ఉన్నాయని అంటారు. చంద్రబాబు విశాఖ ఉత్తరం సీటు ఇస్తే తాను పార్టీ మారి సైకిల్ ఎక్కి అయినా తిరిగి ఎమ్మెల్యే కావాలని రాజు భావించారని కూడా అంటారు.

అన్యాయమైపోతున్నారా…?

విశాఖ నిండా అక్రమాలు, కబ్జాలు, నిబంధలను విరుధ్ధంగా లీజుల గలీజుల కధలు ఎన్నో ఉన్నాయి. గత కొన్ని నెలలుగా వైసీపీ సర్కార్ వీకెండ్స్ లో వీటి మీద దాడులు చేస్తూ కూల్చుడు ఆపరేషన్ పెద్ద ఎత్తున చేపడుతోంది. దీని వల్ల కోర్టులకు వెళ్ళేందుకు కూడా వెంటనే వీలు కావడంలేదని అక్రమార్కులు విలవిలలాడుతున్నారు. ఇక ఆక్రమణలు జరిగిన వాటిలో మెజారిటీ వాటా టీడీపీ నేతలదే. దాంతో వారు కకావికలు అవుతున్నారు. వారి తరఫున వకాల్తా పుచ్చుకున్నట్లుగా విష్ణు కుమార్ రాజు హై కోర్టు బెంచిని వీకెండ్స్ లో తెరచి అయినా బాధితులకు న్యాయం చేయమంటున్నారు. అంటే సోమవారం వరకూ వెయిట్ చేయకుండా అక్రమార్కులు కోర్టు మెట్లు ఎక్కేలా శని, ఆది వారాలలో హై కోర్టు బెంచ్ నడిచేలా చర్యలు కోరుతున్నారు.

ఇంతకీ ఎవరి పక్షం…?

ఇప్పటికి చాలా సార్లు విష్ణు కుమార్ రాజు ఇలా మాట్లాడారు. నిజంగా ఆక్రమణలకు గురి అయిన భూములు ప్రభుత్వానికి చెందినవి. మరి ప్రభుత్వ భూములు కబ్జా చేసిన వారికి సత్వర న్యాయం దక్కడం లేదని బాధపడుతున్న విష్ణు కుమార్ రాజు ప్రభుత్వ భూముల దురాక్రమణల మీద ఎందుకు మాట్లాడడంలేదని వైసీపీ నేతలు అంటున్నారు. గతంలో ఎమ్మెల్యేగా ఉన్నపుడు రాజు గారు విశాఖలో భూములు కబ్జా అవుతున్నాయని గట్టిగా గర్జించారు. మరి ఆ భూములను వైసీపీ సర్కార్ వెనక్కి తెస్తూంటే రాజు గారికి ఎందుకు అంత బాధ అని కూడా అంటున్నారు. ఆయనకు టీడీపీ నేతల మీద ప్రేమ ఇంకా తగ్గలేదా అని కూడా సెటైర్లు పడుతున్నాయి. మరో వైపు బీజేపీ పెద్ద సోము వీర్రాజు ఒంటి కాలి మీద టీడీపీ మీద లేస్తూంటే విష్ణు కుమార్ రాజు మాత్రం వెళ్తున్న రూటు ఇపుడు కరెక్టేనా అని ఒకసారి చెక్ చేసుకోమంటున్నారు. మొత్తానికి విష్ణు కుమార్ రాజు తన పాత మిత్రుడు టీడీపీ మీద మోజు వీడలేకపోతున్నారని విమర్శలు వస్తున్నాయి మరి.

Tags:    

Similar News