రాజు గారి బాధ జగన్ తీరుస్తారా?

విశాఖ అర్బన్ జిల్లా ఉత్తరం నియోజకవర్గం నుంచి తొలిసారి గెలవడమే కాదు, అసెంబ్లీలో అయిదేళ్ల పాటు బీజేపీ పక్ష నాయకుడిగా పెన్మత్స విష్ణుకుమార్ రాజు వ్యవహరించారు. దాంతో [more]

Update: 2019-09-15 03:30 GMT

విశాఖ అర్బన్ జిల్లా ఉత్తరం నియోజకవర్గం నుంచి తొలిసారి గెలవడమే కాదు, అసెంబ్లీలో అయిదేళ్ల పాటు బీజేపీ పక్ష నాయకుడిగా పెన్మత్స విష్ణుకుమార్ రాజు వ్యవహరించారు. దాంతో ఆయన ఒక్కసారిగా రాష్ట్ర స్థాయి నాయకుడు అయిపోయారు. విపక్షంలో ఉన్నా నాలుగేళ్ళ పాటు టీడీపీతో మిత్రత్వం పుణ్యమాని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుతోనూ సాన్నిహిత్యం బాగానే నెరిపారు. అదే సమయంలో విపక్ష నేత జగన్ తోనూ చనువుగా ఉండేవారు. ఇక ఏపీలోని సీనియర్ బీజేపీ నేతల్లో ఒకరుగా విష్ణుకుమార్ రాజు చురుకైన పాత్ర పార్టీలోనూ పోషిస్తూ వచ్చారు. తాజా ఎన్నికల్లో ఆయన ఓటమి పాలు కావడంతో ఇపుడు ఆయన తెగ బాధపడిపోతున్నారు. రాజకీయ గుర్తింపు కోసం విష్ణుకుమార్ రాజు పడుతున్న ఆవేదన తోటి నాయకులకు ఒక్కోసారి వినోదాన్ని పంచుతోంది. ఇంతకీ రాజుగారి బాధలేంటంటే చాలానే ఉన్నాయి.

జగన్ అపాయింట్మెంట్ కోసం…

విష్ణుకుమార్ రాజుకి ముఖ్యమంత్రి జగన్ మీద పెద్దగా ఫిర్యాదులు లేవు. మిగిలిన నాయకుల మాదిరిగా ఆయన జగన్ ని తుగ్లక్ అని మరోటి అని విమర్శించడంలేదు. అయితే ఆయన బాధ అంతా జగన్ తనని పట్టించుకోవడంలేదని, మాజీ ఎమ్మెల్యేగా ఉన్న తనని జగన్ కనీసం అపాయిట్మెంట్ ఇవ్వకపోవడమేంటని విష్ణుకుమార్ రాజు తీవ్రంగా మధన పడుతున్నారు. అది మనసులో ఎక్కడా దాచుకోవడంలేదు, ప్రతి వేదిక మీద చెప్పేసుకుంటున్నారు. జగన్ ని కలవాలని మూడు నెలలుగా గట్టిగా ప్రయత్నం చేస్తున్నానని, మాజీ ఎమ్మెల్యేగా ఉన్న తనకే దర్శన భాగ్యం లేకపోతే ఇక సామాన్యుల గతేంటి అంటున్నారు విష్ణుకుమార్ రాజు. జగన్ ని కలసి ప్రజా సమస్యలు వివరిస్తానని కూడా ఆయన చెబుతున్నారు. తన నియోజకవర్గంలో ఎన్నో సమస్యలు ఉన్నాయని, వాటిని గెలిచిన ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కానీ ఓడిన వైసీపీ అభ్యర్ధి కేకే రాజు గానీ పట్టించుకోవడంలేదని విష్ణుకుమార్ రాజు అంటున్నారు. అందువల్ల వాటిని జగన్ దృష్టిలో పెట్టి పరిష్కారం కోరుతానని అంటున్నారు.

టీడీపీతో నెయ్యం….

జగన్ అపాయింట్మెంట్ ఇవ్వలేదన్న కోపమో మరేమో కానీ విష్ణుకుమార్ రాజు ఇపుడు టీడీపీ శిబిరంలో చురుకుగా కనిపిస్తున్నారు. ఆ పార్టీ నేతల ఆందోళనల్లో ఆయన నేరుగా పాలుపంచుకుటున్నారు. అన్నా క్యాంటీన్లు తెరవాలంటూ టీడీపీ విశాఖ నగరంలో ఆందోళన‌ చేస్తే అందులో రాజు గారు కనిపించి సొంత పార్టీ నేతలకే షాక్ ఇచ్చేశారు. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు పక్కన చేరి మరీ విష్ణుకుమార్ రాజు టీడీపీ విధానాలను మెచ్చుకుంటున్నారు. రాజుగారు ఇదేంటి ఇలా అని కమలనాధులు కలవరపడుతున్నా రాజకీయ స్నేహం మధ్యలోనే పోదు కదా అంటూ గట్టి జవాబే చెబుతున్నారు. టీడీపీ ఆందోళనలు ప్రజల కోసం అయినపుడు పాల్గొంటే తప్పేంటి అంటున్న విష్ణుకుమార్ రాజు పనిలో పనిగా చంద్రబాబు మంచి పాలనాదక్షుడు అని కీర్తిస్తున్నారు. ఏపీలో బీజేపీకి, టీడీపీకి స్నేహం చెడినా కూడా రాజుగారు కంటిన్యూ చేయడమే అసలైన విశేషం. ఇక టీడీపీ గూటిలో చేరాక జగన్ అపాయింటెమెంట్ రాజు గారికి ఎలా దొరుకుతుందని వైసీపీ నేతలు అంటున్నారంటే రాజు గారి రూట్ ఎటో అర్ధం చేసుకోవాలేమో.

Tags:    

Similar News