మెట్రో కూతతో జీవిఎంసీకి బాట…

విశాఖ మహానగరం నవ్యాంధ్రలో అతి పెద్ద నగరం అన్నది తెలిసిందే. ఓ విధంగా రాజధానిగా ఉండాల్సిన ప్రాంత్రం. అయితే ఒక మూలకు విసిరేసినట్లుగా  ఉండడం వల్ల విశాఖ [more]

Update: 2019-12-01 15:00 GMT

విశాఖ మహానగరం నవ్యాంధ్రలో అతి పెద్ద నగరం అన్నది తెలిసిందే. ఓ విధంగా రాజధానిగా ఉండాల్సిన ప్రాంత్రం. అయితే ఒక మూలకు విసిరేసినట్లుగా ఉండడం వల్ల విశాఖ ఆ అవకాశాన్ని కోల్పోయింది. దాంతో పాటు నేతల నుంచి రాజకీయంగా వత్తిడి లేకపోవడం మరో కారణంగా చెబుతారు. ఏది ఏమైనా విశాఖను ఒక్క రాజధాని తప్ప మిగిలినవి అన్నీ చేస్తామని నాడు చంద్రబాబు చాలానే చెప్పారు. అయితే అయిదేళ్ళ టీడీపీ పాలనలో ఏమీ జరగలేదు. ఐటీ రాజధాని అన్నా కూడా ఏ మాత్రం అడుగు ముందుకు పడలేదు, విభజన తరువాత సినిమా పరిశ్రమ విశాఖకు తరలివస్తుందని కూడా చెప్పుకొచ్చారు కానీ అలాంటివన్ని వట్టి భ్రమలేని కాలం తేల్చేసింది. మొత్తానికి విశాఖ అలాగే ఉండిపోయింది.

పడుతూ లేస్తూ మెట్రో :

వైఎస్సార్ సమయంలో విశాఖ నగరంలో మెట్రో ప్రాజెక్ట్ ప్రతిపాదనలు మొదలయ్యాయి. అంటే ఇప్పటికి అచ్చం పుష్కర కాలం క్రితం మెట్రో రైలు విశాఖకు అంటూ వూరించారు. వైఎస్సార్ తరువాత వచ్చిన రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ఈ ప్రతిపాదనను ముందుకు తీసుకుపోవడంలో ఏ మాత్రం శ్రద్ధ చూపించలేదని విమర్శలు ఉన్నాయి. ఇక చంద్రబాబు విభజన ఏపీకి తొలి ముఖ్యమంత్రి అయ్యాక విశాఖ మెట్రోని పక్కన పెట్టి విజయవాడకు అర్జంట్ గా మెట్రో రైలు తీసుకురావాలనుకున్నారు. అయితే అదీ జరగలేదు, ఇదీ ఆగిపోయింది. మొత్తం మీద ఇప్పటివరకూ విశాఖకు మెట్రో అంటూ నేతలు వూరించడమే కానీ కార్యరూపం దాల్చలేదు. ఇపుడు వైసీపీ సర్కార్ వచ్చి ఆరు నెలల కాలం అయింది. దాంతో వైసీపీ మళ్ళీ మెట్రో రైలు అంటూ కూత పెడుతోంది. విశాఖ వాసుల కలను నెరవేరుస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో అనుకున్న కాల పరిమితిలో మెట్రో రైలు విశాఖలో పట్టాలెక్కేలా చూస్తామని ఆయన గట్టి భరోసా ఇస్తున్నారు.

ఎన్నికల వరమా :

తొందరలో జీవీఎంసీ ఎన్నికలు ఉన్నాయి. విశాఖ నగరం ప్రగతి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది. దాంతో వైసీపీ సర్కార్ మెట్రో రైలు ప్రాజెక్ట్ ప్రతిపాదనను అర్జంటుగా బూజు దులిపి ముందుకు తెస్తోందని విపక్షాలు అంటున్నాయి. మెట్రో ప్రాజెక్ట్ అంటే కేంద్ర సాయం కూడా ఉండాలి, ఇక ఏపీ లోటు బడ్జెట్లో ఉందని, గతంలో వేసిన అంచనా ప్రకారం చూసినా పన్నెండు వేల కోట్లకు పై దాటి ఉందని, ఇపుడు అది రెట్టింపు అయినా ఆశ్చర్యం లేదని కూడా అంటున్నారు. మరి ఇంత మొత్తం ఖర్చు పెట్టడానికైనా లేక కేంద్రం నుంచి తేవడానికైనా అవకాశం ఉందా అన్ని అంటున్నారు. పబ్లిక్, ప్రైవేట్ ప్రాజెక్ట్ గా చేపట్టాలనుకున్నా కూడా విశాఖలో మెట్రో రైల్ వల్ల పెద్దగా లాభం లేదని అప్పట్లో వచ్చిన కొన్ని సంస్థలు తప్పుకున్నాయని అంటున్నారు. మరి ఏ విధంగా చూసినా మెట్రో రైలు అని వూరించడమే తప్ప ఇది ఆచరణలో ఇప్పట్లో సాధ్యం కాదని చెబుతున్నారు. అయితే విశాఖ నగరంలో పర్యటించిన మంత్రి బొత్స సత్యనారాయణ మాత్రం చాలా తొందరలో విశాఖ వాసుల కొరిక నెరవేరబోతోందని అంటున్నారు. తమ ప్రభుత్వం చేతల సర్కార్ అని ఆయన చెబుతున్నారు. అయితే జీవీఎంసీ ఎన్నికల్లో వైసీపీ వరంగా ఒక అందమైన నినాదంగా విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు ఉండబోతోందని అర్ధమవుతోంది. మరి దీన్ని జనం ఎంతవరకూ నమ్ముతారో చూడాలి అంటున్నారు.

Tags:    

Similar News