విశాఖ ది బెస్ట్ అంటున్నారే

ఆంధ్రప్రదేశ్ లో రాజధాని అర్హతలు పూర్తిగా వున్న నగరం విశాఖపట్నం అన్నది నిపుణులు నిర్ధారిస్తున్న సంగతి. వాతావరణం ప్రకారం చూసినా అమరావతి కన్నా సాగర తీరమే ది [more]

Update: 2019-12-24 13:30 GMT

ఆంధ్రప్రదేశ్ లో రాజధాని అర్హతలు పూర్తిగా వున్న నగరం విశాఖపట్నం అన్నది నిపుణులు నిర్ధారిస్తున్న సంగతి. వాతావరణం ప్రకారం చూసినా అమరావతి కన్నా సాగర తీరమే ది బెస్ట్ అంటున్నారు. వేసవి, వానాకాలం, శీతాకాలాల్లో కూడా విశాఖ వాతావరణం సమశీతోష్ణ స్థితిలో ఉంటుందని చెబుతున్నారు. వరదలు, తుఫాన్ లు వంటివి కూడా పరిగణలోనికి తీసుకునే నిపుణుల కమిటీ ఈ సూచనలు చేసిందని విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా అందాల సాగరతీరం అందరిని ఆకట్టుకుంటుందని జగన్ సర్కార్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు.

శరవేగంగా విశాఖ తీర అభివృద్ధి …

విశాఖ నగరం దేశానికి వ్యూహాత్మక నౌక దళ రక్షణ కేంద్రం. ఇక్కడ వున్న హార్బర్ ద్వారా వేలకోట్ల రూపాయల ఎగుమతులు దిగుమతులు సాగుతూ ఉంటాయి. పోర్టు అభివృద్ధి తప్పనిసరిగా జరుగుతూనే ఉంటుంది. దీనికి తోడు విశాఖ స్టీల్ ప్లాంట్ అతి భారీ పరిశ్రమ. దీనికి అనుబంధంగా అనేక పరిశ్రమలు విస్తరిస్తూ వస్తున్నాయి. పోర్టు కారణంగా పెట్రోలియం, గ్యాస్ పరిశ్రమలు విశాఖ అంతా వ్యాపించాయి. దీనికి తోడు పలు పరిశ్రమ సెజ్ లు వున్నాయి. వీటికి తోడు పర్యాటక రంగం విశాఖ లో దిన దిన ప్రవర్ధమానం అవుతూ వస్తుంది. అరకు, భీమిలి సహజసిద్ధమైన సౌందర్యలతో అలరారుతూ దేశ విదేశాల్లోని పర్యాటకులను ఆకర్షిస్తూ వస్తుంది. రాజధాని విశాఖలో ఏర్పాటైతే మరింత ఈ రంగం అభివృద్ధి చెందుతుంది.

సినీ పరిశ్రమ తరలివచ్చే ఛాన్స్ …

దేశంలోని మెట్రో సిటీ లతో పోటీ పడే అభివృద్ధి విశాఖ సొంతం. దీనితోపాటు ఈ ప్రాంతంలో తీసిన సినిమాలు తెలుగు సినీ రంగంలో సూపర్ హిట్స్ నే అందుకున్నాయి. డి రామానాయుడు వంటివారు గతంలోనే ఇక్కడ స్థూడియోలు నిర్మించినా ప్రభుత్వం నుంచి సహకారం లేక పెద్దగా రాణించలేదు. తాజాగా వైసిపి సర్కార్ క్యాపిటల్ నిర్ణయం తో విశాఖలో మరిన్ని స్టూడియోల నిర్మాణం జరిగే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. పైసా ఖర్చు లేకుండా వుండే సుందరమైన సాగరతీరాన సినిమాలు రూపుదిద్దుకుంటే నిర్మాణ వ్యయం సైతం చాలావరకు తగ్గే అవకాశం వుంది. ఇప్పటికే అనేకమంది సినీ ప్రముఖులకు విశాఖలో గెస్ట్ హౌస్ లు స్థలాలు పొలాలు వున్నాయి.

ఫార్మా రంగం కూడా…..

వీరంతా నెమ్మదిగా హైదరాబాద్ నుంచి తరచూ రావడం సినిమాలు తీయడం మొదలు పెడితే ఈ రంగంలో కూడా ఉపాధి అవకాశాలు మరింత పెరగనుంది. హైదరాబాద్ తరువాత ఫార్మా రంగం విశాఖ వైపే చూస్తుంది. ఇప్పటికే పలు ఫార్మా కంపెనీలు విశాఖలో పెట్టుబడులు పెట్టేశాయి. అలాగే ఐటి రంగం విజయవాడ వాతావరణ పరిస్థితులకు అస్సలు సరిపోదు. విశాఖనే వారు వేదిక చేసుకునేందుకు ముందుకు వస్తున్నారు. అమరావతిలో జీరో నుంచి 100 కు చేరుకోవాలిసి ఉండగా విశాఖలో అయితే 50 నుంచి 100 కు చేరుకునే నగరంగా నిపుణులు అభివృద్ధి విషయం లో ఉదహరిస్తున్నారు. ఏ రకంగా చూసినా విశాఖ ఏపీ రాజధానిగా అన్ని అర్హతలు వున్న ప్రాంతమని రాజకీయాలతో ప్రమేయం లేని వారు ప్రస్తావించడం గమనార్హం.

Tags:    

Similar News