మరో సమరానికి సై !!

విశాఖపట్నం ఏపీలో అతి పెద్ద నగరం. ఇక్కడ పాగా వేయాలన్నది ప్రతీ రాజకీయ పార్టీ కోరికగా ఉంటుంది. ఇపుడు ఏపీలో అధికారంలో వైసీపీ ఉంది, ప్రతిపక్షంలో టీడీపీ [more]

Update: 2019-07-15 14:30 GMT

విశాఖపట్నం ఏపీలో అతి పెద్ద నగరం. ఇక్కడ పాగా వేయాలన్నది ప్రతీ రాజకీయ పార్టీ కోరికగా ఉంటుంది. ఇపుడు ఏపీలో అధికారంలో వైసీపీ ఉంది, ప్రతిపక్షంలో టీడీపీ ఉంది. రెండు పార్టీల కన్ను విశాఖ మేయర్ పదవిపై ఉంది. విశాఖను గెలుచుకోవడం ద్వారా తన పట్టును నిరూపించుకోవలని వైసీపీ ఆరాటపడుతోంది. ఈ నేపధ్యంలో జీవీఎంసీ ఎన్నికలు మరో రెండు నెలల్లో నిర్వహిస్తారని అధికార వర్గాల సమాచారం. ఇప్పటికే వార్డుల విభజన పూర్తి అయింది దానిని సంబంధించిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి పంపారు. మార్పులు, చేర్పుల అనంతరం తుది నివేదికను రెడీ చేస్తారు. అన్నీ అనుకూలిస్తే రెండు నెలల్లో ఎన్నికలు జరిపిస్తామని కమిషనర్ స్రుజన అంటున్నారు.

పెరిగిన వార్డులు….

విశాఖ కార్పోరేషన్ని 81 వార్డులతో ఏర్పాటు చేస్తున్నారు. 2012 తరువాత ఎన్నికలు జరగలేదు. గత ఏడేళ్ళుగా పాలకవర్గం అంటూ లేకుండా పోయింది. ఈ మధ్యలో భీమునిపట్నం, అనకాపల్లి మునిసిపాలిటీలను కూడా జీవీఎంసీలో చేర్చారు. అయితే తాజాగా కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తారన్న సమాచారంతో అనకాపల్లిని జీవీఎంసీ నుంచి పక్కన పెట్టారు. గతంలో 72 వార్డులు వున్న జీవీఎంసీకి భీమిలీతో కలుపుకుంటే 81 వార్డులు అవుతాయి. దీని మీద ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఇక వార్డులలో జనాభా ప్రతిపదికన రిజర్వేషన్లు పూర్తి చేసి ఓ కొలిక్కి తెస్తారు. అపుడు ఎన్నికలకు రెడీ అయినట్లే.

టీడీపీది చిరకాల కోరిక….

ఇదిలా ఉండగా విశాఖ మేయర్ పీఠం టీడీపీ చిరకాల కోరిక. ఆ పార్టీ ఆవిర్భావం తరువాత 1987లో మొదటిసారి విశాఖ మేయర్ పదవిని గెలుచుకుంది. అంతకు ముందు 1981లో బీజేపీ గెలిచింది. ఆ తరువాత మాత్రం వరసగా కాంగ్రెస్ గెలుస్తూ వస్తోంది. అర్బన్ జిల్లాలో టీడీపీకి పట్టు లేకపోవడమే అందుకు కారణం. ఇపుడు నాలుగు ఎమ్మెల్యే పదవులు ఆ పార్టీకి ఉన్నాయి. దాంతో జీవీఎంసీని టీడీపీ పక్కాగా గెలుచుకుంటుందని గట్టి ధీమాతో పసుపు పార్టీ ఉంది.

సై అంటున్న వైసీపీ…..

ఇక విశాఖలో ఎలాగైనా పాగా వేయాలన్నది వైసీపీ లక్ష్యం. ఆ పార్టీకి అర్బన్ జిల్లాలో ఎంపీ ఉన్నారు. మంత్రి అవంతి శ్రీనివాసరావుకు కూడా గట్టి పట్టు ఉంది. ఇక ఎటూ అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి అర్ధబలం, అంగబలానికి లోటు లేదు. దాంతో సరైన సమయంలో ఎన్నికలు జరిపించుకుంటే గెలుపు ఖాయమన్న అభిప్రాయంతో వైసీపీ నేతలు ఉన్నారు. బలమైన సామాజిక వర్గాలను గుర్తించి జీవీఎంసీ ఎన్నికల్లో దింపాలని వైసీపీ పధక రచన చేస్తోంది. ఈలోగా కొన్ని నామినేటెడ్ పదవులు కూడా లోకల్ గా ఉన్న నాయకులకు ఇవ్వడం ద్వారా పార్టీని పటిష్టపరచుకుంటే మేయర్ పీఠం తమదేనని వైసీపీ భావిస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Tags:    

Similar News