రగిలిపోతున్న వైసీపీ శిబిరం

ముఖ్యమంత్రి జగన్ ఓ విధానం పెట్టుకున్నారు. తన పార్టీలోకి ఎవరైనా వస్తే వారు టీడీపీ ఇచ్చిన పదవులకు రాజీనామా చేసి తీరాలని. వారికి అక్కడ ఇచ్చిన పదవులను [more]

Update: 2019-08-10 09:30 GMT

ముఖ్యమంత్రి జగన్ ఓ విధానం పెట్టుకున్నారు. తన పార్టీలోకి ఎవరైనా వస్తే వారు టీడీపీ ఇచ్చిన పదవులకు రాజీనామా చేసి తీరాలని. వారికి అక్కడ ఇచ్చిన పదవులను అక్కడే వదిలేసి రావాలని కూడా అచ్చ తెలుగులో చెప్పారు. చెప్పడమే కాదు చేసి చూపిస్తున్నారు కూడా. మరి ఆ పార్టీ నాయకులు మాత్రం పదవులతో వచ్చిన తమ్ముళ్ళను అక్కున చేర్చుకుని పార్టీ కండువాలు కప్పేస్తున్నారు. దీంతో ఈ రకమైన చేరికలు అధినాయకత్వం నిబంధనలకు విరుధ్ధమని వైసీపీలో ఉన్న పలువురు నాయకులు నిరసన తెలియచేస్తున్నారు. విశాఖలో ప్రసిధ్ధి చెందిన శ్రీ కనకమహాలక్ష్మి ఆలయం బోర్డ్ చైర్మన్ జెర్రిపోతున ప్రసాద్ నామినేటెడ్ పదవితో సైతం వదలకుండా వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు. ఆయన్ని నేరుగా తీసుకువచ్చి పార్టీ పెద్ద విజయసాయిరెడ్డి సమక్షంలో చేర్పించేశారు. దీంతో వైసీపీలో కొత్త ముసలం బయల్దేరింది.

కాచుకున్న వారికి షాక్….

నామినేటెడ్ పదవుల కోసం కళ్ళు కాయలు కాచేలా వైసీపీ నేతలు ఎదురుచూస్తున్నారు. జగన్ అధికారంలోకి రావాలని గడచిన పదేళ్ళుగా వారు పోరాటం చేస్తూ వచ్చారు. ఇపుడు తమకు ఏదైనా పదవి దక్కుతుందని ఆశపడ్డ వారికి ఝలక్ ఇచ్చేలా జెర్రిపోతుల చేరిక ఉందని అంటున్నారు. జెర్రిపోతుల తెలివిగా తన నామినేటెడ్ పదవిని కాపాడుకునేందుకు పార్టీలో చేరారని వైసీపీ నేతలు అంటున్నారు. ఆయన వెనకాల బడా వైసీపీ నేతలు ఉండడంతో పదవితో పాటుగా పార్టీలోకి ఫిరాయించేశారని పేర్కొంటున్నారు. నిజానికి జెర్రిపోతుల ప్రసాద్ ని టీడీపీ సర్కార్ నియమించింది. నైతిక విలువలు పాటిస్తే ఆయన టీడీపీ ఓడిపోగానే రాజీనామా చేసి తీరాలి. కానీ గత మూడు నెలలుగా ఆ పదవి అనుభవిస్తూ కుర్చీ దిగకుండా వ్యవహరించారు. ఇపుడు సమయం సందర్భం చూసుకుని మరీ వైసీపీలోకి జంప్ చేశారని ఆ పార్టీ నేతలు అంటున్నారు. ఇది అన్యాయమని ఫ్యాన్ పార్టీ నేతలు ఆక్రోసిస్తున్నారు.

అసలైన నాయకులకు న్యాయం….

ఇదిలా ఉండగా అసలైన వైసీపీ నాయకులకు న్యాయం చేయాలన్న డిమాండ్ ఇపుడు విశాఖ అర్బన్ జిలాలో గట్టిగా వినిపిస్తోంది. నామినేటెడ్ పదవుల్లో ఉన్న టీడీపీ నేతలు రాజీనామా చేయకపోతే వారిని తప్పించి మరీ తమకు అవకాశం ఇవ్వాలని, అలాగే టీడీపీ నుంచి ఎవరైనా పార్టీలో చేరితే వారు అనుభవిస్తున్న పదవులు కూడా వదులుకోవాలని కూడా కోరుతున్నారు. తొందరలో రాబోతున్న కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా పార్టీకి మొదటి నుంచి సేవ చేస్తున్న వారిని, కష్టపడిన వారిని గుర్తించాలని, వారికే టికెట్లు ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే నిన్నటి నుంచి అధికారంలో ఉన్న టీడీపీలోని వారే ఇపుడు వైసీపీలోనూ వైభోగాలు అనుభవిస్తారని అంటున్నారు. ఇక టీడీపీ హయాంలో నామినేటెడ్ పదవుల్లో నియామకం అయిన వారిలో విశాఖ నుంచి వెలమ కార్పొరేషన్ చైర్మన్ గా గండి బాబ్జీ ఉన్నారు. అలాగే గవర కార్పొరేషన్ చైర్మన్ గా మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ తమ్ముడు శ్రీనివాసరావు ఉన్నారు. వీరెవరూ ఇప్పటికైతే రాజీనామాలు చేయలేదు. మరో వైపు కొందరు వైసీపీ వైపు చూస్తున్నారు. దీంతో వైసీపీ శిబిరం రగిలిపోతోంది. మరి వైసీపీలో మొదలైన ఈ ఆందోళనను పార్టీ పెద్దలు ఎలా తీరుస్తారో చూడాలి.

Tags:    

Similar News