ఒక పథకం ప్రకారం డ్యామేజ్ చేస్తున్నారా?

విశాఖ అందమైన నగరం. ప్రశాంత నగరం, సిటీ ఆఫ్ డెసిటినీ. కూల్ సిటీ. ఇలాంటి పేర్లు ఇంతకాలం విన్నాం. ఇపుడు మాత్రం విశాఖను విలన్ గా చేస్తున్నారు. [more]

Update: 2020-09-05 14:30 GMT

విశాఖ అందమైన నగరం. ప్రశాంత నగరం, సిటీ ఆఫ్ డెసిటినీ. కూల్ సిటీ. ఇలాంటి పేర్లు ఇంతకాలం విన్నాం. ఇపుడు మాత్రం విశాఖను విలన్ గా చేస్తున్నారు. ఒక పధకం ప్రకారం ఇమేజ్ ని డ్యామేజ్ చేస్తున్నారు. ఏపీలో జరుగుతున్న నేరాలూ ఘోరాల్లో విశాఖ అగ్ర స్థానంలో ఉందిట. ఇది ప్రభుత్వం చెప్పే గణాంకాలు కావు. టీడీపీ అనుకూల మీడియా వండి వారుస్తున్న కధనాలు. విశాఖ నేరాల అడ్డాగా మారిపోయిందట. విశాఖవాసులు బెంబేలెత్తుతున్నారుట. ఇదీ విశాఖ గురించి చెబుతున్న కాకమ్మ కబుర్లు. కక్కూర్తి వార్తలు.

విష ప్రచారం….

విశాఖను ఒకనాడు సునామీ నగరం అన్నారు, అంతేనా ఏకంగా సముద్రమే రెండుగా చీలిపోయి విశాఖ నగరాన్ని పొట్టన పెట్టుకుంటుందని భయానకమైన ప్రచారం కూడా చేశారు. విశాఖ చుట్టూ ఉన్న ప్రమాదకర రసాయన పరిశ్రమల వల్ల భస్మీపటలం అవుతుందని కూడా చెప్పి వణికించారు. టీడీపీ అధినేత చంద్రబాబు అయితే కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినట్లు, విశాఖను తాను ఇపుడే కొత్తగా చూస్తున్నట్లుగా అమ్మోనియం నైట్రేట్ నిల్వలు విశాఖ నిండా ఉన్నాయని సరికొత్త విషయం కనిపెట్టి మరీ జనాల్లో ఆందోళన పెంచారు. ఇలా విశాఖ పేరు చెప్పి మరీ చల్లాల్సిన బురద అంతా చల్లేస్తున్నారు, విషం చిమ్మేస్తున్నారు.

అత్యాచారాల నిలయమా…?

ఇది నిజంగా దారుణమైన ఆరోపణే. ఈ దేశంలో ఆ మాటకు వస్తే ప్రపంచంలో చాలా చోట్ల అత్యాచారాలు జరుగుతున్నాయి. నేరాలు కూడా ఉన్నాయి. కానీ ఒక్క విశాఖలోనే అత్యాచారాలు జరుగుతున్నాయట. అది కూడా దాదాపుగా ప్రతీ రోజూ ఎక్కడో ఒక చోట జరుగుతున్నాయట. మహిళా భద్రత అన్నది విశాఖలో ప్రశ్నార్ధకమట. విశాఖ ఈ తరహా నేరాల్లో ఏపీలోనే అగ్ర స్థానంలో ఉందిట. నిజంగా వినేవారుంటే చెప్పేవారు ఇలాగే ఉంటారని విశాఖ మీద అవాకులూ చవాకులూ మాట్లాడుతూనే ఉన్నారు.

నులిమేస్తున్నారే ….

విశాఖ ఏపీకి ఆశాకిరణం. పార్టీలు, రాజకీయాలు పక్కన పెడితే విశాఖ ఏకైన అతి పెద్ద సిటీ. దీన్ని చూపించే నాడు చంద్రబాబు కూడా పెట్టుబడులను ఆకర్షించాలనుకున్నారు. ఇపుడు జగన్ అయితే పాలనారాజధాని చేద్దామనుకుంటున్నారు. మరి విశాఖను రాజధాని కాకుండా ఏ విధంగా అడ్డుకోవాలి అన్న ఒకే ఒక ఆరాటంతో బురద జల్లుడు కార్యక్రమం మొదలెడుతున్నారు. రాజకీయాల వల్ల విశాఖ ప్రగతిని నులిమేస్తున్నారు. సరే ఇవాళ జగన్ ఉంటారు, రేపు మరొకరు అధికారంలోకి రావచ్చు. కానీ విశాఖ మీద జల్లిన బురదను కడిగేదెవరు, మాయని మచ్చగా నగరం మీద జల్లిన విషపు చారలు కలకాలం ఉంటాయిగా. మరి విశాఖ అభివ్రుధ్ధి చెందకపోతే రేపటి రోజున ఇదే నిజం అని నమ్మి ఎవరూ పెట్టుబడులు పెట్టడానికి రాకపోతే నష్టపోయేది ఎవరు.

వర్గ పోరాటమేనా…?

అయిదు కోట్ల ప్రజానీకంతో చెలగాటం ఆడే అధికారం ఎవరిచ్చారు. ఇవన్నీ మేధావుల నుంచి వస్తున్న ప్రశ్నలు. ప్రజాస్వామ్యయుతంగా అమరావతి రాజధాని కోసం పోరాడడంతో తప్పు లేదు కానీ విశాఖను కించపరచి కళంకితను చేసి ఆ మైనస్ నుంచి అమరావతిని ప్లస్ చేద్దామనుకునే కుటిల యత్నం కనుక చేస్తే నష్టపోయేది అక్షరాలా మొత్తం ఆంధ్రులే కదా. రాజకీయాలు స్థాయి బాగా తగ్గి వర్గ, కుల పోరాటాలు మారిన తరువాత విశాల ప్రయోజనాల గురించి ఎవరైనా ఆలోచిస్తారనుకుంటే కూడా పొరపాటేనేమో. మొత్తానికి రాజధాని సంగతేమో కానీ విశాఖ విధి వంచిత అవుతోందిగా.

Tags:    

Similar News