గీతం అంతలా గీత దాటినా?

విశాఖలో టీడీపీకి దివంగత నేత ఎంవీవీఎస్ మూర్తి మూలవిరాట్టుగా చెప్పాలి. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మూర్తి విశాఖకు వ్యాపార నిమిత్తం కొన్ని దశాబ్దాల నాడు వచ్చారు. ఆ [more]

Update: 2020-10-25 05:00 GMT

విశాఖలో టీడీపీకి దివంగత నేత ఎంవీవీఎస్ మూర్తి మూలవిరాట్టుగా చెప్పాలి. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మూర్తి విశాఖకు వ్యాపార నిమిత్తం కొన్ని దశాబ్దాల నాడు వచ్చారు. ఆ సమయంలో ఆయనకు విశాఖలో విద్యాసంస్థలు పెట్టాలన్న కోరిక పుట్టింది. అలా రూపుదిద్దుకున్నవే గీతం విద్యా సంస్థలు. అయితే అప్పట్లో విశాఖ సాగర తీరాన అభిముఖంగా చిన్నపాటి భూమిలో మొదలైన గీతం విద్యా సంస్థల ప్రయాణం కాలగమనంలో డీమ్డ్ యూనివర్శిటీ స్థాయికి చేరుకుంది. వందలాది ఎకరాల‌లో గీతం క్యాంపస్ ఉంది. ఇందులో ప్రభుత్వ భూములు కూడా ఆక్రమించుకున్నారని చాలా ఏళ్ళుగా ఆరోపణలు ఉన్నాయి.

టీడీపీ కంటే ముందే….?

విశాఖకు ఎంవీవీఎస్ మూర్తి బాట్లింగ్ కంపెనీ యజమానిగా వచ్చారు. ఇది డెబ్బై దశకం చివరలో. ఆ వ్యాపారం బాగానే సాగుతున్న టైంలో 1980లో గీతం పేరిట విద్యా సంస్థలను ఆయన మొదలెట్టారు. అలా విశాఖకు వచ్చి ఆయన స్థిరపడిన తరువాత 1982లో తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ ప్రారంభించారు. అందులో మూర్తి విశాఖ నుంచి తొలిగా వచ్చి చేరారు. అలా ఆయన టీడీపీ అధికారంలోకి రావడంలో జనాలకు కూడా మెల్లగా పరిచయం అయ్యారు. మూర్తి మొదట ఉడా చైర్మన్ గా పనిచేశారు. ఆ తరువాత ఆయన 1989లో ఎంపీగా టీడీపీ తరఫున పోటీ చేసి ఓడినా 1991లో తిరిగి గెలిచారు. అలా రెండు సార్లు ఎంపీగా, అలాగే ఎమ్మెల్సీగా పనిచేసిన మూర్తి విశాఖ టీడీపీకి మూలపురుషుడుగా మారి చక్రం తిప్పారు.

బాబుతోనే…

ఎన్టీయార్ నుంచి టీడీపీని లాక్కున్నపుడు మూర్తి చంద్రబాబు వెనకనే ఉన్నారు. అలా బాబుకు అత్యంత సన్నిహితుడిగా ఆయన ఉంటూ వచ్చారు. విశాఖ జిల్లాలో ఎంత పెద్ద నాయకులు ఉన్నా, మంత్రులు సామంతులు ఉన్నా కూడా బాబుతో ఏకాంతంగా మాట్లాడే చనువు చొరవ మూర్తి సొంతం. ఆయన 2018లో అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలు అయ్యారు. అప్పటిదాకా ఆయన విశాఖ టీడీపీలో మకుటం లేని మహారాజుగా వెలుగొందారు. ఆయన పెద్ద కుమారుడు రామారావు రెండవ కుమారుడే శ్రీ భరత్. ఆయన తాత మూర్తి విద్యా రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. 2019 ఎన్నికల్లో విశాఖ నుంచి ఎంపీగా టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఆయన ఇపుడు గీతం సంస్థల చైర్మన్ గా ఉంటున్నారు. బాబుకు బంధువులుగా, టీడీపీ కీలకనేతలుగా మూర్తి కుటుంబ సభ్యులను చూడాలి.

అక్షరాలా 800 కోట్లే…..

ఇదిలా ఉంటే విశాఖలో గీతం విద్యా సంస్థలను విస్తరించే క్రమంలో ప్రభుత్వం నామమాత్రంపు ధరలకు భూములు ఇచ్చిందని చెబుతారు. అది చాలదన్నట్లుగా అక్షరాల 800 కోట్ల రూపాయల విలువ చేసే 40 ఎకరాల విలువైన భూములను ఎండాడ, రుషికొండ తదితర ప్రాంతాల్లో ఆక్రమించి మరీ గీతం సంస్థ పెద్దలు హద్దులు దాటారని ఆరోపణలు ఉన్నాయి. దీని మీద రెవిన్యూ అధికారులు విచారణ చేసి నిగ్గు తేల్చి మరీ స్వాధీనం చేసుకునే పని మొదలెట్టారు. ఇది నిజంగా విశాఖ రాజకీయాల్లో సంచలనం రేకేత్తించే అంశమే. మూర్తి వంటి దిగ్గజ నేత కుటుంబాన్ని టచ్ చేసే సాహసం మధ్యలో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడా చేయలేకపోయాయి. ఆనాడు కాంగ్రెస్ ఎంపీగా, కేంద్ర మంత్రిగా ఉన్న పురంధేశ్వరి పట్టించుకోలేదని కూడా చెబుతారు. మొత్తానికి ఏళ్ళ కోలది ఆక్రమణలకు గురి అయిన ప్రభుత్వ భూములు వెనక్కి తీసుకురావడానికి అధికారులు ప్రయత్నం చేయడం పట్ల విశాఖలోని సామాన్య జనంలో హర్షం వ్యక్తం అవుతోంది. మరో వైపు చూసుకుంటే టీడీపీ నేతలకు కూడా ఇది గట్టి హెచ్చరికగా ఉంది.

Tags:    

Similar News