`కాకా`- ప‌రువు గంగలో కలుపుతారా‌..!

Update: 2018-10-25 00:30 GMT

కాకాగా గుర్తింపు పొందిన సీనియ‌ర్ రాజ‌కీయ దిగ్గ‌జం, దివంగ‌త గ‌ెడ్డం వెంక‌ట‌స్వామి.. కుమారుల రాజ‌కీయాలు రోజుకోరకంగా మారుతున్నాయి. ఆయ‌న ఇద్ద‌రు కుమారులు.. వినోద్‌, వివేక్‌లు రాజ‌కీయాల్లోనే ఉన్నారు. అయితే, తండ్రికి త‌గిన కొడుకులుగా మాత్రం వారు పేరు సాధించ‌లేక‌పోతుండ‌డం గ‌మ‌నార్హం. ఆది నుంచి ఈ కుటుంబం కాంగ్రెస్‌లోనే ఉంది. ముఖ్యంగా ఇందిరా గాంధీతో సంబంధాల‌ను పెంచుకున్న నాయ‌క‌గ‌ణం కూడా ఈ కుటుంబానికి సొంతం. అలాంటి ఈ రాజ‌కీయ కుటుంబంలో కాకా త‌ర్వాత అంత కీల‌క స్థానాన్ని, కేంద్రంలో చ‌క్రం తిప్ప‌గ‌ల పొజిష‌న్‌ను ఎవ‌రు అందుకుంటారు? అనే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మైన‌ప్పుడు.. ప్ర‌శ్న‌లు తప్ప స‌మాధానం రాబ‌ట్టడం క‌ష్టంగానే ఉంది.

వివేక్ నిర్ణయం కోసమే......

పెద్దపల్లి నుంచి గ‌తంలో ఎంపీగా విజ‌యం సాధించిన గడ్డం వినోద్ ప్ర‌స్తుతం కేసీఆర్ చెంత‌నే ఉన్నారు. అయితే, ఆయ‌న ఇప్పుడు మ‌ళ్లీ కాంగ్రెస్‌లోకి వెళ్లిపోవాల‌ని నిర్ణ‌యించుకున్నారు. వినోద్‌తో పాటు ఆయన సోదరుడు మాజీ ఎంపీ, ప్రభుత్వ సలహాదారు జి.వివేక్‌ సైతం కాంగ్రెస్‌లో చేరతారా... లేదా..? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వినోద్‌ ఒక్కరే కాంగ్రెస్‌ పార్టీలో చేరుతారనే ప్రచారం జరుగుతున్నప్పటికీ, రాజకీయంగా కలిసే నిర్ణయాలు తీసుకునే ‘బ్రదర్స్‌’ ఒక్కొక్కరు ఒక్కో పార్టీలో కొనసాగే అవకాశం లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వివేక్‌ నిర్ణయం కోసమే వినోద్‌ వేచిచూస్తున్నట్లు తెలుస్తోంది.

గత ఎన్నికల్లో ఇద్దరూ ఓడి......

తెలంగాణ రాష్ట్ర ఉద్యమం పతాక స్థాయికి చేరిన సమయంలో కాంగ్రెస్‌ నుంచి వినోద్, వివేక్‌ బ్రదర్స్‌ తొలుత 2013 జూన్‌ 2న టీఆర్‌ఎస్‌లో చేరారు. తన తండ్రి వెంకటస్వామి చిరకాల వాంఛ తెలంగాణ రాష్ట్రం కేసీఆర్‌ ద్వారానే సాధ్యమని భావించి పార్టీలో చేరినట్లు అప్పట్లో ప్రకటించారు. తెలంగాణ బిల్లు ఆమోదించిన తరువాత 2014 ఏప్రిల్‌ ఎన్నికలకు 15 రోజుల ముందు మార్చి 31న బ్రదర్స్‌ ఇద్దరూ తిరిగి కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్‌ నుంచి పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా వివేక్, చెన్నూరు అసెంబ్లీకి వినోద్‌ పోటీచేసి ఓడిపోయారు. తెలంగాణ సిద్ధించిన తరువాత పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తానన్న కేసీఆర్‌ మాట మార్చి ఎన్నికలకు వెళ్తున్నారని ఆరోపించారు.

సీటు కేటాయించకపోవడంతో......

తెలంగాణలో రాజకీయ పునరేకీకరణ పేరుతో టీఆర్‌ఎస్‌ చేపట్టిన ఆపరేషన్‌లో 2016లో మరోసారి వీరిద్దరు టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు. కేసీఆర్‌తో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ వచ్చారు. వివేక్‌కు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హోదా లభించింది. వచ్చే ఎన్నికల్లో పాత స్థానాల నుంచే తాము పోటీ చేయడం ఖాయమని భావించారు. సెప్టెంబర్‌ 6న పార్టీ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో చెన్నూరు నుంచి ఎంపీ బాల్క సుమన్‌కు అవకాశం దక్కింది. వివేక్‌ కోసమే ఎంపీగా ఉన్న సుమన్‌ను చెన్నూరు సీటుకు ఎంపిక చేసినట్లు చెపుతుండగా, మాజీ మంత్రినైన తనకు అవకాశం కల్పించకపోవడాన్ని వినోద్‌ సీరియస్‌గా తీసుకున్నారు. ఈ ప‌రిణామాల‌తో మ‌రోసారి కాకా వార‌సులు ర‌గిలిపోతున్నారు. ఏది ఏమైనా కాకాలో ఉన్న నేర్పు.. ఓర్పు.. వ్యూహం.. వీరిలో లోపించాయ‌నే వాద‌న నానాటికీ బ‌ల‌ప‌డుతుండ‌డం గ‌మ‌నార్హం.

Similar News