తొడకొడుతున్నా లాభం లేదే

ఏదో పార్టీ బాగోగులు చూసిపోదామని, నాలుగు మంచి మాటలు చెబుదామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విశాఖ పర్యటనకు వస్తే ఆయన ముందే తమ్ముళ్ళు [more]

Update: 2019-09-06 05:00 GMT

ఏదో పార్టీ బాగోగులు చూసిపోదామని, నాలుగు మంచి మాటలు చెబుదామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విశాఖ పర్యటనకు వస్తే ఆయన ముందే తమ్ముళ్ళు తగవులతో తొడలు కొడుతున్నారు. మరో వైపు పొలిటి బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు తమ్ముడే సైకిల్ దిగి ఎంచక్కా వెళ్ళిపోయారు. ఇంకో వైపు అర్బన్ జిల్లాలో పార్టీ నాయకుల వర్గ పోరు, గొడవలు చాలా సీరియస్ గా ఉన్నాయి. దీంతో సైకిల్ కి ఎన్ని పంక్చర్లు పడ్డాయో చినబాబుకే అర్ధం కాని స్థితి, ఇంకా ఎన్ని పడాల్సివుందో కూడా తెలియని వాతావరణం ఏర్పడింది. విశాఖ రూరల్ జిల్లాలో వరసగా నేతలు, సీనియర్లు పార్టీకి గుడ్ బై కొట్టేస్తున్నారు. ఇదేంటో తెలుసుకుందామని వస్తే చినబాబు నారా లోకేష్ ఎదుటే మరిన్ని రాజీనామాలు క్యూ కట్టాయి.

పట్టు జారిందా…?

బింకానికి అయ్యన్నపాత్రుడు మాట్లాడుతున్నారు కానీ ఆయన సొంత నియోజకవర్గంలో పట్టు ఎపుడో జారిపోయిందన్నది నిజమంటున్నారు. అన్నను దశాబ్దాల పాటు కొమ్ము కాసి గెలిపించిన కుడి భుజం సన్యాసిపాత్రుడు సైకిల్ దిగడం అంటే టీడీపీ ఎంతటి దారుణమైన పరిస్థితిలో ఉందో అర్ధమవుతోంది. పార్టీలో తనకు, తన అనుచరులకు కనీస గౌరవం విలువ లేదని చెప్పి మరీ సన్యాసిపాత్రుడు రాజీనామా ఇచ్చేశారు. ఆయనకుకు ఇపుడు సొంత అన్నయ్యతోనే లడాయి వచ్చింది. గట్టి పట్టున్న సన్యాసిపాత్రుడు నేడో రేపో వైసీపీ తీర్ధం పుచ్చుకుంటారని టాక్ నడుస్తోంది. నర్శీపట్నం మునిసిపాలిటీలో పట్టున్న సన్యాసిపాత్రుడు వెళ్ళిపోవడం లోకల్ బాడీ ఎన్నికల్లో టీడీపీకి గట్టి దెబ్బగా భావించాలి. ఈ పరిణామాలు చూసి నారా లోకేష్ సగానికి సగమై కుంగిపోవాల్సివ‌చ్చింది.

అర్బన్ జిల్లాలో గ్రూపుల గోల….

నారా లోకేష్ ఇలా విశాఖలో కాలు పెట్టారో లేదో అర్బన్ జిల్లా టీడీపీ ప్రెసిడెంట్ ఎస్ ఏ రహమాన్ మాజీ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే అయిన వాసుపల్లి గణేష్ కుమార్ మీద గట్టిగా ఫిర్యాదు చేశారు. ఆయన తనని అసలు గౌరవించడంలేదని, పార్టీ ఆఫీసుకే రావడం మానేశారని రహమాన్ గోడు వెళ్లబోసుకున్నారు. తాను ప్రెసిడెంట్ గా ఉన్నంతవరకూ పార్టీ ముఖం చూడనని వాసుపల్లి శపధం చేయడాన్ని కూడా గుర్తు చేశారు. దీని మీద నారా లోకేష్ ఏం మాట్లాడకపోవడంతో నేరుగా ఇపుడు రహమాన్ యుధ్ధానికి రెడీ అయిపోతున్నారు. ఇక్కడ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు చెందిన వర్గంలో రహమాన్ ఉన్నారు. మరో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు వర్గంలో వాసుపల్లి ఉన్నారు. ఎవరికి చెబితే ఎవరికి కోపం వస్తుందోనని నారా లోకేష్ మౌనం పాటించారని అంటున్నారు. దీంతో పార్టీలో లొల్లి మరింతగా పెరిగిపోతోంది. మొత్తానికి విశాఖలో పార్టీ తీరుతెన్నులు కళ్లారా చూసిన నారా లోకేష్ కు తమ్ముళ్ళా మజాకా అనిపించేశారట.

Tags:    

Similar News