కొండమీద అమ్మవారు…కొండ కింద కమ్మవారు

పాలకులకు ఉండే భిన్నాభిప్రాయాలతో విజయవాడ ఆదినుండి నిర్లక్ష్యానికి గురవుతోంది. ఎందుకో తెలియదు, ఏ పాలకుడూ విజయవాడను కేంద్రంగా చేసుకోలేదు. అటు అమరావతి, ఇటు కొండపల్లి రాజధానులుగా ఉన్నాయి [more]

Update: 2020-01-14 15:30 GMT

పాలకులకు ఉండే భిన్నాభిప్రాయాలతో విజయవాడ ఆదినుండి నిర్లక్ష్యానికి గురవుతోంది. ఎందుకో తెలియదు, ఏ పాలకుడూ విజయవాడను కేంద్రంగా చేసుకోలేదు. అటు అమరావతి, ఇటు కొండపల్లి రాజధానులుగా ఉన్నాయి కానీ, విజయవాడ అప్పుడూ, ఇప్పుడూ పాలనా కేంద్రంగా చూడబడలేదు (నేను చరిత్రకారుణ్ణి కాదు. పెద్దగా చరిత్ర లోతుల్లోకి వెళ్ళి చూడలేదు. ఈ అంశంలో తేడా ఉంటే ‘సరిదిద్దుకోడానికి నేనెప్పుడూ సిద్దమే). గుంటూరు నగర పరిస్థితి కూడా ఇంచుమించు ఇలాంటిదే. కొండవీడు రాజధాని కానీ గుంటూరు కాదు. మద్రాసు నుండి 1953లో విడిపోయినప్పుడు కానీ, తెలంగాణనుండి 2014లో విడిపోయినప్పుడు కానీ పాలనా కేంద్రంగా విజయవాడ గుర్తించబడలేదు.

మద్రాసు నుంచి విడిపోయినప్పుడు…..

మద్రాసు రాష్ట్రం నుండి విడిపోయినప్పుడు రాజధాని నగరంగా విజయవాడను గుర్తించలేదు. ఉత్తరాంధ్ర ప్రాంతం వారికి దూరమైనా రాజధానిగా కర్నూలునే నిర్ణయించారు. హై కోర్టు గుంటూరులో ఏర్పాటు చేశారు. తర్వాత 1956లో ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడినప్పుడు కనీసం హై కోర్టు అయినా ఇక్కడే కొనసాగాలని ఎవరూ అడగలేదు. గుంటూరు, విజయవాడ నగరాలను అలా వదిలేశారు. ఇప్పుడు 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు కూడా రాజధాని నగరంగా విజయవాడను గుర్తించలేదు. విజయవాడ పరిసర ప్రాంతాలు అన్నారు. ఆ తర్వాత 2014 డిసెంబర్లో కృష్ణా నది అంచున తుళ్ళూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల్లోని 29 గ్రామాలను రాజధానిగా ఎంపిక చేశారు కానీ విజయవాడను గుర్తించలేదు. పెట్టుబడుల సదస్సులు కూడా విజయవాడ వేదికగా నిర్వహించలేదు. కేవలం అమరావతికి వెళ్ళే విడిదిగా మాత్రమే విజయవాడను వాడుకున్నారు. అటు గుంటూరు నగరం పరిస్థితి కూడా అంతే. పరిపాలనకు ఈ రెండు నగరాలూ పనికిరాలేదు. భవిష్యత్తులో ఈ రెండు నగరాలూ పరిపాలనా కేంద్రాలుగా పనికొస్తాయన్న నమ్మకం లేదు.

అందుకోసమేనా?

వ్యాపార, వాణిజ్య, సాంస్కృతిక కేంద్రంగా మాత్రమే విజయవాడ పనికొస్తోంది. ఈ దేశానికి జెండా అందించిన నగరం జెండా వందనానికి తాత్కాలికంగా మాత్రమే పనికిరావడం ఎందుకో ఆలోచించా ల్సి ఉంది. అప్పట్లో కమ్యూనిస్టుల స్థావరం అనే నెపంతో విజయవాడను పాలకులు నిర్లక్ష్యం చేశారు అని చెపుతారు. ఈ వాదనలో ఎంత నిజం ఉందో తెలియదు. నిజం తెలిసినవారెవరూ ఇప్పుడు చెప్పేందుకు లేరు. ఉన్నా చెప్పేందుకు సిద్ధంగా లేరు.

దిక్కులు మారుతున్నాయి….

ఇప్పుడు రాజధాని కనీసం విజయవాడ పరిసరాలనుండి తరలిపోతోంది. అప్పట్లో దక్షిణాన కర్నూలులో, ఇప్పుడు ఉత్తరాన విశాఖలో. దిక్కులు మారుతున్నాయి కానీ విజయవాడ దశ మారడం లేదు. రాజకీయ రాజధాని అనడమే కానీ రాజకీయంగా ఈ నగరం రాజధానిగా అందరి అంగీకారం పొందడం లేదు. విజయవాడకు రాజధాని గురించి గట్టిగా పోరాటం చేసేవాళ్ళు కూడా లేరు. ఇప్పుడే కాదు అప్పట్లో కూడా అలాంటి నేతలు లేరు. ఉంటే రాజధాని మద్రాసు నుండి కర్నూలు వరకూ వచ్చి ఆగేదికాదు. ఒకవేళ అప్పట్లో జాతీయస్థాయి నాయకులు ఉన్నా ఎందుకో విజయవాడ రాజధాని వద్దులే అంటే మౌనంగా ఉండిపోయారు. ఇప్పుడు కూడా విజయవాడ మౌనంగానే ఉంది. అప్పుడు కమ్యూనిస్టులపై వ్యతిరేకత. ఇప్పుడు కమ్మ సామాజిక వర్గంపై వ్యతిరేకత.

వాళ్లు సరిచేసుకోలేక….

తమపై వచ్చిన వ్యతిరేకతను అప్పట్లో కమ్యూనిస్టులు సరిచేసుకోలేకపోయారు. పాలకుల నిర్ణయాలను మౌనంగా అంగీకరించారు. ఇప్పుడు తమపై వచ్చిన వ్యతిరేకతను కమ్మ సామాజిక వర్గం తిరస్కరిస్తోంది కానీ “వ్యతిరేకత తప్పు” అని గట్టిగా చెప్పలేకపోతోంది. కారణం ఒక్కటే… అవకాశ వాదులు ఇప్పుడు ఆ సామాజిక వర్గానికి ప్రతినిధులుగా చలామణి అవుతున్నారు. రాజకీయాలను, అధికారగణాన్ని అవకాశంగా ఉపయోగించుకొని లబ్దిపొందిన కొద్దిమంది మాత్రమే మొత్తం సామాజిక వర్గానికి ప్రతినిధులుగా చలామణి అవుతున్నారు. మిగిలినవారంతా మౌనంగా భరిస్తున్నారు. లేదా అలాంటిదేమీ లేదంటూ ఆ కొద్దిమంది నాయకత్వాన్నే బలపరుస్తున్నారు. ఆ కొద్దిమంది ప్రభావం (influence) నుండి బయటపడితే తప్ప ఆ సామాజిక వర్గం ఈ వ్యతిరేకతను వదిలించుకోలేదు. కొద్దిమంది చేతలకు, రాతలకు మొత్తం సామాజిక వర్గం బాధ్యత ఎందుకు మోస్తోందో ఆసామాజిక వర్గ ప్రతినిధులే నిర్ణయించుకోవాలి. లేకపోతే రాజధానిగా కర్నూలుకు విశాఖపట్నం ఎంతదూరమో చెప్పినవారికి విశాఖపట్నానికి 1953లో కర్నూలు ఎంతదూరమో తెలియదా? లేక అమరావతికి విశాఖపట్నం ఎంతదూరమో, విశాఖపట్నానికి అమరావతి కూడా అంతే దూరం అని తెలియదా? విషయం దూరం, దగ్గర కాదు. సమస్య వ్యతిరేకత. అప్పట్లో కమ్యూనిస్టులపై వ్యతిరేకత. ఇప్పుడు కమ్మ సామాజికవర్గంపై వ్యతిరేకత.

ఒకప్పుడు బ్రాహ్మణులపై…

ఒకప్పుడు బ్రాహ్మణులపై వచ్చిన వ్యతిరేకత నెమ్మదిగా ఆ సామాజిక వర్గం పరిధి దాటి “బ్రాహ్మణ వాదం”గా నిలబడింది. బ్రాహ్మణుల్లో ప్రోగ్రెసివ్ శక్తులు ముందుకొచ్చి సమాజానికి బ్రాహ్మణులపై వ్యతిరేకతను సృష్టించిన కులవ్యవస్థను, వివక్షను ఖండించి కులాల మధ్య అంతరాలు తగ్గించే ప్రయత్నం చేశారు. ఫలితంగా బ్రాహ్మణులపై ఉండే కోపం, వ్యతిరేకత తగ్గింది. వివక్ష చూపటాన్ని “బ్రాహ్మణవాదం” పరిగణించి సమాజం బ్రాహ్మణ కులంపై ఉన్న వ్యతిరేకతను తగ్గించింది. ఇప్పుడు బ్రాహ్మణులను వ్యతిరేకించేవారు లేరు. బ్రాహ్మణ వాదాన్ని వ్యతిరేకిస్తున్నారు, విమర్శిస్తున్నారు. సరిగ్గా ఇప్పుడు అలాంటి వ్యతిరేకతే కమ్మ కులంపై వచ్చింది. ఇప్పుడు కమ్మ సామాజిక వర్గంనుండి ప్రోగ్రెసివ్ శక్తులు ముందుకు రావాలి. ఈ ప్రోగ్రెసివ్ శక్తులు తమలో కొద్దిమంది చేస్తున్న రాజకీయాలు, రాతలు, చేతల వల్ల వచ్చిన ఈ వ్యతిరేకతనుండి తమ సామాజిక వర్గాన్ని బయట పడేయాలి.

విజయవాడ అంటే….

విజయవాడ అంటే (కొండ) పైన అమ్మవారు, (కొండ) కింద కమ్మవారు అనే స్థాయికి వెళ్ళిందంటే ఆ సామాజిక వర్గాన్ని మిగతా కులాలు ఎలా చూస్తున్నాయో అక్కడి ప్రోగ్రెసివ్ శక్తులు ఆలోచించాలి. ఈ వ్యతిరేకత నుండి వారు బయటపడి, విజయవాడను బయట పడేస్తేనే ఈ నగరానికి రావలసిన ఒక రూపం, దక్కాల్సిన అభివృద్ధి సాధ్యం. లేకపోతే 20 లక్షల జనాభాతో ఉన్న గ్రామంగానే మిగులుతుంది. ఇంకో రెండుమూడు దశాబ్దాల తర్వాత కూడా విజయవాడ 50లక్షల జనాభా ఉన్న “పల్లెటూరు”గానే మిగులుతుంది.

– దారా గోపి, సీనియర్ జర్నలిస్ట్

Tags:    

Similar News