ఇది కూడా ఇంటి దొంగల పనేనా….?

వైఎస్సార్ సతీమణి విజయమ్మ రాసిన నాలో…నాతో వైఎస్సార్ పుస్తకం ఈ నెల 8న సీఎం జగన్ ఆవిష్కరించారు. వైఎస్సార్ తో 37 ఏళ్ల జీవన సహచర్యం గురించి [more]

Update: 2020-07-12 08:00 GMT

వైఎస్సార్ సతీమణి విజయమ్మ రాసిన నాలో…నాతో వైఎస్సార్ పుస్తకం ఈ నెల 8న సీఎం జగన్ ఆవిష్కరించారు. వైఎస్సార్ తో 37 ఏళ్ల జీవన సహచర్యం గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఇందులో ఉన్నాయి. వైఎస్సార్ కి సంబంధించిన అరుదైన ఫోటోలు, ఆయన కుటుంబం, రాజారెడ్డి తనయుల కుటుంబాలకు సంబంధించిన వివరాలు, కేవలం వారికి మాత్రమే అందుబాటులో ఉండే ఫోటోలు ఎన్నో ఈ పుస్తకంలో చోటు దక్కించుకున్నాయి. దాదాపు ఐదు వేల కాపీలతో పుస్తకాన్ని రిలీజ్ చేశారు. శనివారం ఉదయం ఈ పుస్తకం పిడిఎఫ్ కాపీ సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయ్యింది. నిజానికి పుస్తకాన్ని 400 రూపాయలకు కొందామనుకున్నా వెంటనే లభించడం లేదు. ఆన్ లైన్ లో మరో పదిహేను రోజులు కానీ డెలివరీ అయ్యే అవకాశం లేక చాలామంది నిరాశకు గురయ్యారు.

పీడీఎఫ్ కాపీ……

ఇలాంటి పరిస్థితుల్లో పుస్తకం డిజిటల్ కాపీ బయటకు వచ్చేసి ప్రపంచం మొత్తం చుట్టేయడంతో పబ్లిషర్లు అవాక్కయ్యే పరిస్థితి. శనివారం మధ్యాహ్నానికి టీటీడీ ఛైర్మన్ వైవి పేరుతో ఓ ఖండన విడుదల అయ్యింది. సామాజిక మాధ్యమాల్లో తిరుగుతోన్న పుస్తకానికి విజయమ్మ రాసిన పుస్తకానికి సంబంధం లేదని, ఎమెస్కో వారిదే అసలు పుస్తకం అని, పిడిఎఫ్ ఫైల్ లో తిరుగుతున్న అంశాలు వేరుగా ఉన్నాయని ఆయన ప్రకటించారు. సోషల్ మీడియాలో తిరుగుతున్న కాపీ పైరసీ అయ్యుండొచ్చు. కానీ అది అసలు పుస్తకం కాదనడమే సందేహాలకు తావిస్తోంది. నిజానికి ఎమెస్కో ప్రచురించిన పుస్తకం ముద్రణ వ్యయం కంటే తక్కువ ధరకు విక్రయిస్తోంది. సాధారణంగా మల్టీ కలర్ లో 350 పేజీలలో ముద్రించిన కాఫీ టేబుల్ బుక్ ఖరీదు రూ.600కి పైనే ఉంటుంది. విజయమ్మ రాసిన పుస్తకం కావడం, వైఎస్సార్ జీవితానికి సంబంధించిన పుస్తకం కావడంతో ముద్రణ వ్యయంతో పని లేకుండా తక్కువ ధరకే విక్రయించారు.

హాట్ కేకుల్లా అమ్ముడవ్వడంతో…

అయితే పాఠకుల ఆదరణ ఉహించక పోవడంతో మొదటి ముద్రణ హాట్ కేకుల అమ్ముడైంది. దీంతో పైరసీ బయటకు వచ్చింది. గంటల వ్యవధిలో ఊరంతా చుట్టేసింది. సరే కాసేపు ఈ పుస్తకం నకిలీదే అనుకుందాం. టీటీడీ చైర్మన్ చెప్పినట్టు అభ్యంతర విషయలేవి అందులో కనిపించలేదు. విజయమ్మ నిజాయితీగా తన కుటుంబం గురించి రాసుకున్న విషయాలే అందులో ఉన్నాయి. ఎవరి గురించి అనుచిత రాతలు లేనేలేవు. ఆమె రాతలో ధైర్యం పాఠకుల్ని మెప్పించింది. కాకుంటే పిడిఎఫ్ బయటకు రావడంతో ప్రచురణ సంస్థకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉంటుంది. 400ఖరీదుతో 5వేల కాపీలకు 20లక్షలు వస్తాయి. కాపీలు ఎంత ఎక్కువ అమ్ముడైతే ఆ సంస్థకు నష్టం అంత తగ్గుతుంది.

ఇంతకీ ఆ కాపీ బయటకు ఎలా వచ్చింది….?

పిడిఎఫ్ కాపీ క్వాలిటీ చూస్తే అదేదో మాన్యువల్ గా స్కాన్ చేసింది కాదని అర్థం అవుతుంది. ప్రూఫ్ రీడింగ్ చేసే సమయంలో బయటకు వచ్చింది అయ్యుండొచ్చు. ప్రచురణ సంస్థ పేర్లు, చిరునామా, కాపీల వివరాలు ఏవి అందులో లేవు. అంటే ఎడిటింగ్ పూర్తయ్యాక అత్యంత సన్నిహితులకు మాత్రమే అందుబాటులో ఉండే డిజిటల్ కాపీ. ప్రింట్ ఎడిషన్ కాకుండా ప్రచురణకు ముందు మార్పులు, చేర్పులు, దిద్దుబాట్లు కోసం సిద్ధం చేసిన కాపీ అయ్యుండాలి. ఆ పని ఎవరు చేశారో వారి నుంచి బయటకు వచ్చి ఉండాలి. గతంలో ముందు వెనుక ఆలోచించకుండా సీఎం నివాసంలో విజయ సాయి రెడ్డి జగన్ కార్ దిగిపోయిన విజువల్ బయటకు వచ్చినపుడు జరిగిన పొరపాటే మళ్ళీ జరిగింది. ఈ పొరపాటు ఉద్దేశపూర్వకమో, యాదృచ్ఛికమో, తెలియక చేసిందో అయ్యుండొచ్చు. అత్యుత్సాహంతో తమ మిత్రులకు పుస్తకాన్ని చేరవేసే ప్రయత్నం కాస్త వికటించి ఉండొచ్చు. లేదా ఇతరత్రా కారణాలతో ప్రచురణ సంస్థకు నష్టం వాటిల్లేలా చేసే ఉద్దేశం కావొచ్చు. ఏది ఏమైనా విజయమ్మ పుస్తకం మాత్రం పైరసీ మాత్రమే అయ్యుండొచ్చు. వైవి చెప్పినట్టు రెండు వేర్వేరు అయ్యే అవకాశాలు తక్కువ. కొన్ని అంశాలను ప్రచురణలో తొలగించి ఉండొచ్చు.

కొసమెరుపు ఏమిటంటే పుస్తకం నకిలీ అంటూ ఖండన ఇచ్చిన నాయకుడి వ్యక్తిగత సిబ్బందే ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టి మరి ఆ పుస్తకాన్ని మిత్రులకు పంచి పెట్టారు. కావాల్సిన వారికి కాపీలు ఇస్తామని….. అభిమానులు ఈ విషయం కూడా గమనించారు.

Tags:    

Similar News