కెప్టెన్ చూపు ఎటువైపు…??

డీఎండీకే (దేశీయ ముర్పోక్కు ద్రావిడ కళగం) పార్టీ అధినేత కెప్టెన్ విజయ్ కాంత్ దారి ఎటు? అందరి చూపు ఇప్పుడు ఆయన వైపే ఉంది. సినీనటుడిగా తమిళనాడులో [more]

Update: 2019-02-25 18:29 GMT

డీఎండీకే (దేశీయ ముర్పోక్కు ద్రావిడ కళగం) పార్టీ అధినేత కెప్టెన్ విజయ్ కాంత్ దారి ఎటు? అందరి చూపు ఇప్పుడు ఆయన వైపే ఉంది. సినీనటుడిగా తమిళనాడులో విజయ్ కాంత్ ఒక వెలుగు వెలిగారు. రజనీకాంత్, కమల్ హాసన్ వంటి సినీ హీరోలతో సమానంగా ఆయన సినిమాలు తమిళనాట హల్ చల్ చేసేవి. అయితే సినీరంగం తర్వాత ఆయనకు రాజకీయ రంగం నచ్చినట్లుంది. అందుకే 2005లో డీఎండీకే పార్టీని స్థాపించారు.

బలమైన రాజకీయ శక్తిగా….

డీఎండీకే ఒకానొక దశలో రాష్ట్రంలో బలమైన రాజకీయ పార్టీగా మారింది. ఇప్పటి వరకూ ఐదు ఎన్నికల్లో డీఎండీకే పార్టీ పాల్గొనింది. జయలలిత, కరుణానిధి ఉన్న సమయంలోనే కెప్టెన్ తన సత్తా చాటారు. అయితే 2014 లోక్ సభ ఎన్నికల్లోనూ, 2016 అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ కాంత్ పార్టీని ప్రజలు దూరం పెట్టారు. ఒక్క సీటు కూడా రాలేదు. దీనికి కారణాలు లేకపోలేదు. పార్టీలో కుటుంబ సభ్యుల పెత్తనం ఎక్కువ అవ్వడమే కారణమంటారు. దీంతో ఓటు బ్యాంకు కూడా తరిగిపోయిందంటున్నారు.

పీఎంకే తో సమానంగా…..

ఇప్పటికీ డీఎండీకే కు రాష్ట్రంలో పది నుంచి పన్నెండు శాతం ఓటు బ్యాంకు ఉందని అన్ని పార్టీలూ అంగీకరించే విషయం. విజయ్ కాంత్ ఇటీవల అనారోగ్యంతో ఉండి అమెరికా వెళ్లి చికిత్స చేయించుకుని వచ్చారు. డీఎండీకే అన్నాడీఎంకే కూటమిలోనే ఉంటుందని అందరూ భావించారు. అయితే ఊహించని విధంగా డీఎండీకే ఇప్పటి వరకూ తన నిర్ణయాన్ని వెల్లడించలేదు. పైగా పీఎంకేకు ఆరు పార్లమెంటు స్థానాలు, ఒక రాజ్యసభ స్థానాన్ని ఇవ్వడాన్ని కూడా డీఎండీకే నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

త్వరలోనే నిర్ణయం…..

తమకు ఏడు పార్లమెంటు స్థానాలు కేటాయిస్తేనే కూటమిలో చేరేందుకు సిద్ధమని డీఎండీకే నేతలు ప్రకటించారు. అయితే విజయకాంత్ మాత్రం దీనిపై ఇంతవరకూ అధికారికంగా స్పందిచలేదు. ఇప్పటికే రజనీకాంత్ ఇటీవల విజయ్ కాంత్ తో సమావేశమై రాజకీయ అంశాలపై చర్చించారు. అలాగే డీఎంకే అధినేత స్టాలిన్ కూడా విజయ్ కాంత్ ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే డీఎంకే కూటమిలో చేరేందుకు డీఎండీకే నేతలు ఇష్టపడటం లేదు. ఆ కూటమిలో ఎక్కువ పార్టీలు ఉండటంతో అక్కడకు వెళ్లినా అరకొర సీట్లు వస్తాయని వారు వెనకడుగు వేస్తున్నారు. డీఎండీకే అన్నాడీఎంకే కూటమిలో చేరడం ఖాయమని ప్రచారం జరుగుతున్నా అంకెల పట్ల సంతృప్తి చెందితేేనే రెండాకుల కూటమిలో చేరతారన్నది వాస్తవం అని చెబుతున్నారు. మొత్తం మీద విజయ్ కాంత్ ఎటువైపు వెళతారన్న చర్చ జరుగుతుంది.

Tags:    

Similar News