కెప్టెన్ బరిలోకి దిగేది నిజమేనా?

ఎన్నికల వేళ డీఎండీకే అధ్యక్షుడు విజయ్ కాంత్ అనారోగ్యం బారిన పడటం ఆందోళన కల్గిస్తుంది. గత కొన్నేళ్లుగా అనారోగ్యంతో ఉన్న విజయ్ కాంత్ నాలుగేళ్ల నుంచి కార్యకర్తలకు [more]

Update: 2020-09-30 16:30 GMT

ఎన్నికల వేళ డీఎండీకే అధ్యక్షుడు విజయ్ కాంత్ అనారోగ్యం బారిన పడటం ఆందోళన కల్గిస్తుంది. గత కొన్నేళ్లుగా అనారోగ్యంతో ఉన్న విజయ్ కాంత్ నాలుగేళ్ల నుంచి కార్యకర్తలకు కన్పించడం మానేశారు. విదేశాలకు వెళ్లి వైద్యం చేయించుకుని వచ్చారు. కెప్టెన్ ఆరోగ్యం కుదుటపడిందనుకుంటున్న తరుణంలో కరోనా సోకింది. దీంతో ఎన్నికల సమయంలో విజయకాంత్ ప్రచారం నిర్వహిస్తారా? లేదా? అన్నది సందేహంగానే మారింది.

క్రేజ్ ఉన్నా ఆయన ఒక్కరే…..

విజయకాంత్ సినిమాల్లో కెప్టెన్ గా పేరు తెచ్చుకున్నారు. లక్షలాది మంది అభిమానులు ఆయనకు తమిళనాడు అంతటా ఉన్నారు. సినిమాలో ఉన్న క్రేజ్ తో విజయకాంత్ దాదాపు పదిహేనేళ్ల క్రితం సొంతంగా పార్టీ పెట్టారు. దానికి దేశీయ ముర్పోక్కు ద్రావిడ కళగం అని పేరు పెట్టారు. 2006లో డీఎండీకే పోటీ చేసినా ఆయన ఒక్కరు మాత్రమే గెలిచారు. దీనికి విజయకాంత్ నిరాశ చెందలేదు. అయితే ఆ ఎన్నికల్లో పది శాతం ఓటు బ్యాంకు పార్టీ సొంతం చేసుకోవడం కొంత ఊరటనిచ్చే అంశం.

అన్నాడీఎంకేతో పొత్తుతో…..

ఇక 2011 అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే సరికి అప్పటి అన్నాడీఎంకే అధినేత్రి జయలలితతో చర్చించి ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకోవడంతో 29 స్థానాలను డీఎండీకే సాధించింది. మొత్తం 41 స్థానాల్లో బరిలోకి దిగిన విజయకాంత్ పార్టీ 29 స్థానాల్లో గెలిచి అప్పట్లో అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షంగా మారింది. తర్వాత జయలలితతో విభేదాలు రావడంతో తన పార్టీకి చెందిన 8 మంది శాసనసభ్యులు అధికార పార్టీలోకి వెళ్లినా విజయకాంత్ ఏమాత్రం దిగులుపడలేదు.

ఓటమి తర్వాత…..

2016 ఎన్నికల్లో చిన్నాచితకా పార్టీలతో కలసి కూటమిగా ఏర్పడి పోటీ చేసినా జయలలిత హవాముందు ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి విజయకాంత్ అభిమానులకు కన్పించలేదు. ఆయన అనారోగ్యమే ఇందుకు కారణం అంటున్నారు. పార్టీ వ్యవహారాలను ఆయన సతీమణి ప్రేమలత చూసుకుంటున్నారు. తమిళనాడు ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో విజయకాంత్ కోలుకోకపోవడం, కరోనా బారిన పడటం ఆయన అభిమానుల్లో ఆందోళన కల్గిస్తుంది. కెప్టెన్ కోలుకోవాలంటూ ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.

Tags:    

Similar News