Vijayasanthi : ఇక్కడా ఆ ఆశ నెరవేరదా?

ఫైర్ బ్రాండ్ లీడర్ గా ముద్రపడిన విజయశాంతి బీజేపీలో ఆశిస్తున్నారా? ఉన్నత స్థాయి పదవిని కోరుకుంటున్నారా? అంటే అవుననే అంటున్నారు. తనకు రాజ్యసభ పదవి ఇవ్వాలని బీజేపీలో [more]

Update: 2021-10-03 11:00 GMT

ఫైర్ బ్రాండ్ లీడర్ గా ముద్రపడిన విజయశాంతి బీజేపీలో ఆశిస్తున్నారా? ఉన్నత స్థాయి పదవిని కోరుకుంటున్నారా? అంటే అవుననే అంటున్నారు. తనకు రాజ్యసభ పదవి ఇవ్వాలని బీజేపీలో చేరడానికి ముందే ఆమె కోరినట్లు తెలిసింది. అయితే రాష్ట్ర స్థాయి నేతలు ఎవరూ దీనిపై హామీ ఇవ్వకపోయినా, అప్పట్లో ఒక కేంద్ర మంత్రి మాత్రం విజయశాంతికి హామీ ఇచ్చినట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండటానికే విజయశాంతి నామినేట్ పదవి కోరారన్న ప్రచారం జరుగుతుంది.

అన్ని పార్టీలూ మారి…

తెలంగాణలో విజయశాంతి ఇప్పటికి దాదాపు అన్ని పార్టీలు మారారు. తన సొంత పార్టీని టీఆర్ఎస్ లో విలీనం చేసి కేసీఆర్ కు ఇష్టమైన చెల్లెలుగా మారారు. మెదక్ ఎంపీగా కూడా గెలిచారు. రాష్ట్ర విభజన తర్వాత కేసీఆర్ కు, ఆమెకు మధ్య దూరం పెరిగింది. ఫలితంగా ఢిల్లీ వెళ్లి సోనియా గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ అధికారంలోకి రాలేదు. రెండుసార్లు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ను తిరస్కరించడం, ఆ పార్టీలో తనను పట్టించుకోక పోవడంపై విజయశాంతి ఆగ్రహంతో పార్టీకి గుడ్ బై చెప్పారు.

బీజేపీలో చేరి….

తిరిగి విజయశాంతి బీజేపీలో చేరారు. బీజేపీలో చేరిన నాటి నుంచి ఆమె యాక్టివ్ గానే ఉంటున్నారు. పార్టీ కార్యక్రమాలతో పాటు ఏదైనా సంఘటనలు జరిగితే వెంటనే అక్కడకు చేరుకుంటున్నారు. బీజేపీ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తుందన్న నమ్మకంతో విజయశాంతి యాక్టివ్ గా ఉంటున్నారు. దీంతో పాటు తనకు బీజపీలో రాజ్యసభ పదవి అయినా దక్కుతుందని ఆమె ఆశిస్తున్నారు. ఇటీవల ముఖ్య నేతల వద్ద తన పదవి విషయాన్ని ప్రస్తావించినట్లు తెలిసింది.

మరోసారి పోటీ చేయాల్సిందే….

అయితే మరో రెండేళ్లలో ఎన్నికలు జరుగుతుండటంతో మరోసారి ఎంపీగా పోటీ చేయాలని బీజేపీ అధినాయకత్వం విజయశాంతికి సూచించినట్లు తెలిసింది. మరోసారి కేంద్రంలో అధికారంలోకి రావాలంటే ఎంపీ స్థానాలు ముఖ్యమని, అందుకే పోటీ చేయాల్సి ఉంటుందని విజయశాంతికి సూచించారు. కానీ విజయశాంతి మాత్రం ఈసారి మెదక్ నుంచి కాకుండా మరో ప్రాంతం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. మొత్తం మీద విజయశాంతి అనుకున్నట్లు నామినేట్ పదవి ఇవ్వకుండా ప్రత్యక్ష ఎన్నికల్లోనే పోటీ చేయించాలని పార్టీ నిర్ణయం తీసుకుంది.

Tags:    

Similar News