సాయిరెడ్డికి పొగ.. ఇక అక్కడికే పరిమితం చేస్తారా?

ఔను… ఇప్పుడు వైసీపీలో ఏ ఒక్కరిని క‌దిలించినా ఇదే విష‌యంపై హాట్ టాపిక్ హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. ఇప్పటి వ‌ర‌కు పార్టీలో నెంబ‌ర్‌-2 నేతగా, రాష్ట్రంలోను, ఢిల్లీలోనూ త‌న‌కు [more]

Update: 2020-12-29 03:30 GMT

ఔను… ఇప్పుడు వైసీపీలో ఏ ఒక్కరిని క‌దిలించినా ఇదే విష‌యంపై హాట్ టాపిక్ హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. ఇప్పటి వ‌ర‌కు పార్టీలో నెంబ‌ర్‌-2 నేతగా, రాష్ట్రంలోను, ఢిల్లీలోనూ త‌న‌కు తిరుగులేద‌ని అనిపించుకున్న వైసీపీ ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి దూకుడుకు బ్రేకులు ప‌డుతున్నాయ‌నే ప్రచారం పార్టీలోని సీనియ‌ర్ల మ‌ధ్య జోరుగా సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రీ ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల ఇంచార్జ్‌గా ఉన్న విజ‌య‌సాయి రెడ్డిని త్వర‌లోనే ప‌క్కకు త‌ప్పిస్తార‌ని సీనియ‌ర్లు గుస‌గుస‌లాడుతున్నారు. ఈ విష‌యం అతిర‌హస్యంగా ఉన్నప్పటికీ.. ప్రధాన మీడియాకు లీకైపోయింది. దీంతో విజ‌య‌సాయి రెడ్డి విష‌యంపై ఆస‌క్తిక‌ర కామెంట్లు వెలువ‌డుతున్నాయి.

అంతా తానే అయి….

విజ‌య‌సాయి రెడ్డి 2014 ఎన్నిక‌ల నుంచి గ‌త ఏడాది ఎన్నిక‌ల వ‌ర‌కు కూడా వైసీపీకి అన్నీ తానై వ్యవ‌హ‌రించారు. పార్టీని ముందుకు న‌డిపించ‌డంలోను, గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో అభ్యర్థుల‌ను ఎంపిక చేయ‌డంలోను, ప్రచారంలో ఎలా వ్యవ‌హ‌రించాలి.. వంటి అనేక విష‌యాల్లో ఆయ‌న త‌న‌దైన బుర్రను బాగానే ప్రయోగించారు. పార్టీ అధికారంలోకి రావ‌డం వెనుక ప్రత్యక్షంగా జ‌గ‌న్ పాద‌యాత్ర ఉన్నట్టే.. ప‌రోక్షంగా విజ‌య‌సాయి రెడ్డి చెమ‌టోడ్చిన సంగ‌తిని వైసీపీ నేత‌లు మ‌రిచిపోలేరు. అయితే ఎంత కృషి చేసినా.. త‌న‌దైన దూకుడు ప్రద‌ర్శించ‌డంతో గ‌డిచిన ఏడాది కాలంగా ఆయ‌న‌పై తీవ్ర విమ‌ర్శలు వ‌స్తున్నాయి.

బహిరంగంగానే అసంతృప్తి…..

త‌న అల్లుడు కోసం విశాఖ‌లో భూక‌బ్జాలు చేస్తున్నార‌నే వాద‌న ప్రతిప‌క్షాల‌ది కాదు.. అధికార ప‌క్షానిదే. ఇక‌, మంత్రి గా ఉండి కూడా తాను డ‌మ్మీ అయిపోయాన‌ని ఆవేద‌న చెందే.. విశాఖ‌కు చెందిన ఒక మంత్రి వ‌ర్యుని బాధ మ‌రింత వ‌ర్ణనాతీతం. అవినీతి మీరు చేస్తూ.. మామీద దుమ్మెత్తి పోస్తారే! అంటూ.. సొంత పార్టీ ఎమ్మెల్యేలు బ‌హిరంగంగా క‌డిగేశారంటే.. విజ‌య‌సాయి రెడ్డి దూకుడు ఎలా ఉందో ఇట్టే అర్ధమ‌వుతుంది. ఇక ఉత్తరాంధ్రలో వైసీపీ ప్రజాప్రతినిధులు అంద‌రూ సాయిరెడ్డి తీరుపై లోలోన ర‌గిలి పోతున్నారు. చోడ‌వ‌రం ఎమ్మెల్యే క‌ర‌ణం ధ‌ర్మశ్రీ లాంటి వారు ఓపెన్‌గానే త‌మ అసంతృప్తిని వ్యక్తం చేసి అధిష్టానం ఆగ్రహానికి గుర‌య్యారు.

ఢిల్లీకే పరిమితం చేస్తారా?

అయితే.. ఇంత జ‌రిగినా.. విజ‌య‌సాయి రెడ్డిపై జ‌గ‌న్ ఎప్పుడూ ప‌న్నెత్తు మాట అన‌లేదు. ఇటీవ‌ల జ‌రిగిన విశాఖ పంచాయి‌తీలోనూ విజ‌య‌సాయి రెడ్డి చెప్పిందే వేదం అన్నట్టుగా జగ‌న్ పార్టీ నాయ‌కుల‌కు హిత‌వు ప‌లికారు. కానీ, ఇంత‌లోనే హ‌ఠాత్తుగా విజ‌య‌సాయి రెడ్డిని ఢిల్లీకే ప‌రిమితం చేస్తున్నార‌నే వార్త సంచ‌ల‌నంగా మారింది. దీనికి రీజ‌నేంటి? అనేది ప్రస్తుతానికి గోప్యంగా ఉన్నా.. ఇక్కడ స‌జ్జల రామ‌కృష్ణారెడ్డి చ‌క్రం తిప్పుతార‌ని అంటున్నారు వైసీపీ సీనియ‌ర్లు. మొత్తానికి ఈ మార్పు ఇప్పుడు వైసీపీ వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Tags:    

Similar News