ఉత్తరాంధ్రకు నయా రాజకీయ‌ గురువు ?

గురువుకు ఎంతో ఉన్నత స్థానం ఉంది. విద్యాబుద్ధులు గరిపినందుకు ఆయన్ని గౌరవించి గుండెల్లో పెట్టుకుని పూజిస్తారు శిష్యులు. అయితే రాజకీయాల్లో మాత్రం గురువుని శిష్యులు మించుతారు. అంతే [more]

Update: 2020-07-11 13:30 GMT

గురువుకు ఎంతో ఉన్నత స్థానం ఉంది. విద్యాబుద్ధులు గరిపినందుకు ఆయన్ని గౌరవించి గుండెల్లో పెట్టుకుని పూజిస్తారు శిష్యులు. అయితే రాజకీయాల్లో మాత్రం గురువుని శిష్యులు మించుతారు. అంతే కాదు వీలుంటే గురువుని దించి మరీ ఆ స్థానానికి తామే ఎగబాకుతారు. అందువల్ల రాజకీయాల్లో గురువు అంటే వెనక్కి తిరిగి చూసుకుంటారు. తన వెనకాల కత్తి పెట్టి శిష్యులు వెన్నుపోటు పొడుస్తారేమోనని. ఇవన్నీ ఇలా ఉన్నా కూడా గురువులు శిష్యులూ ఈ పరంపర రాజకీయాల్లో అలా కొనసాగిపోతూనే ఉంది. ప్రత్యేకించి ఉత్తరాంధ్రా రాజకీయాల్లో తీసుకుంటే ఆధునిక గురువుగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అవతరించారు. ఈ మధ్య జరిగిన ఆయన పుట్టిన రోజు వేడుకలను మూడు జిల్లాల్లో ఘనంగా జరుగుపుకున్నారు.

అపర చాణక్యుడిగా…

అంతే కాదు విజయసాయిరెడ్డిని అపరచాణక్యుడిగా శిష్యులు పొగిడారు. మా గురువు గారు హస్తినలోనూ విశాఖలోనూ జెండా ఎగురవేయగలరు. ఆయన సత్తా అమోఘం అంటూ బ్యానర్లు కట్టి మరీ కితాబులు ఇచ్చారు. జగన్ రాముడైతే విజయసాయిరెడ్డి హనుమంతుడేనని కూడా వినయంగా చెప్పుకున్నారు. రాముడి విజయం వెనక హనుమాన్ పాత్ర ఎంత ఉందో వైసీపీ గెలుపు వెనక విజయసాయిరెడ్డి ఉన్నారని కూడా చెప్పకనే చెప్పారు. విజయసాయిరెడ్డి లాంటి నాయకుడు విశాఖను నోడల్ జిల్లాగా ఎంచుకుని ఇక్కడ అభివృధ్ధి కోసం పాటుపడడం గొప్ప విషయం అని కూడా అంటున్నారు.

నాడు అలా ….

ఇక ఉత్తరాంధ్రా జిల్లాలకు ఒకపుడు రాజకీయ గురువుగా దివంగత నేత ద్రోణంరాజు సత్యనారాయణ‌ ఉండేవారు. ఆయన సాధారణ కరణం నుంచి పార్లమెంట్ మెంబర్ గా ఎదిగారు.కేంద్ర మంత్రి అవాల్సినదే కానీ లక్ కలసిరాక త్రుటిలో తప్పిపోయింది. ఇక రాష్ట్ర మంత్రి అవుదామని 2004 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తే గెలిచిన ఏడాదికే అనారోగ్యంతో కన్నుమూశారు. అయితే ద్రోణం రాజు ఎందరో శిష్యులను మూడు జిల్లాల్లో తయారు చేశారు. ఆయన శిష్యులు రాష్ట్ర మంత్రులు అయ్యారు. పార్లమెంట్ సభ్యులు అయ్యారు. ఉత్తరాంధ్ర టైగర్ గా, ద్రోణాచార్యునిగా వెలుగు వెలిగిన పాతతరం నాయకుడుగా రాజకీయ గురువు అంటే ద్రోణమే
గుర్తుకువస్తారు.

టీఎస్సార్ కూడా ….

ఇక ద్రోణం రాజు గతించాక కొన్నాళ్ల పాటు ఉత్తరాంధ్ర గురువుగా ఆయన స్థానంలో టి సుబ్బరామిరెడ్ది వ్యవహరించారు. ఆయన కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. టీఎస్సార్ కూడా ఎంతో మందికి పదవులు ఇప్పించారు. తన వెంట తిప్పుకున్నారు. ఆయన కూడా నెల్లూరు నుంచి వచ్చి విశాఖ వచ్చారు. విశాఖను దత్తత తీసుకున్నారు. ఇక్కడే రాజకీయ ఓనమాలు దిద్దుకున్నారు. రాజ్యసభ సీటు పొయి రిటైర్ అయ్యాక మాజీ ఎంపీ కావడంతో ఆయన పూర్తిగా హైదరాబాద్ కే పరిమితం అయ్యారు. దాంతో ఇపుడు విజయసాయిరెడ్డి ఆయన స్థానంలో అదే నెల్లూరు నుంచి వచ్చారు. పై ఇద్దరు నేతల మాదిరిగానే విజయసాయిరెడ్డికి కూడా హై కమాండ్ వద్ద బలం ఉంది. దాంతో ఆయన్ని గురువుగా చేసుకుని ఎంతోమంది ఏకలవ్య శిష్యులు తయారు అయ్యారు. వీరిలో ఆయన ప్రియ శిష్యుడెవరో, అర్జునుడు ఎవరో రానున్న రోజుల్లో తేలాల్సి ఉంది. మొత్తానికి ఉత్తరాంధ్రాకు కొత్త రాజకీయ గురువుగా విజయసాయిరెడ్డి అవతరించారని చెప్పాలి.

Tags:    

Similar News