వైసీపీ త‌ర‌ఫున ఢిల్లీలో చ‌క్రం తిప్పుతోంది సాయిరెడ్డి కాదా…?

ఏపీలోని వైసీపీ ప్రభుత్వం త‌ర‌ఫున ఢిల్లీలో చక్రం తిప్పుతోంది ఎవ‌రు ? ప‌్రభుత్వం మంచి చెడుల‌ను, క‌ష్టన‌ష్టాల‌ను కేంద్రంలోని కీల‌క మంత్రుల‌కు చేర‌వేస్తోంది ఎవ‌రు ? అస‌లు [more]

Update: 2020-07-10 05:00 GMT

ఏపీలోని వైసీపీ ప్రభుత్వం త‌ర‌ఫున ఢిల్లీలో చక్రం తిప్పుతోంది ఎవ‌రు ? ప‌్రభుత్వం మంచి చెడుల‌ను, క‌ష్టన‌ష్టాల‌ను కేంద్రంలోని కీల‌క మంత్రుల‌కు చేర‌వేస్తోంది ఎవ‌రు ? అస‌లు కేంద్రంలోని పెద్దలు కూడా ఏపీ గురించి తెలుసుకోవాలంటే.. ఎవరిని సంప్రదిస్తున్నారు ? అంటే.. స‌హ‌జంగానే ఎవ‌రైనా త‌డుముకోకుండా వెంట‌నే చెప్పేమాట‌.. వైసీపీలోని నెంబ‌రు 2 నాయ‌కుడు, ఆ పార్టీ రాజ్యస‌భ సభ్యుడు విజ‌యసాయిరెడ్డేన‌ని ! ఆయ‌నే అన్నీ చూసుకుంటున్నార‌ని, ఏపీ గురించి ఢిల్లీలో చాటింపు వేసేది ఆయ‌న‌నేన‌ని అంటారు. కానీ, అనూహ్యంగా ఇప్పుడు తెలిసిన స‌మాచారం మేర‌కు విజయసాయిరెడ్డి కాకుండా ఇత‌ర కీల‌క నేత‌లు ఏపీ గురించి కేంద్రానికి చెబుతున్నార‌ని తెలిసింది.

జగన్ ఆరా….

బీజేపీలో చేరిన కొంద‌రు టీడీపీ నేతలు ముఖ్యంగా సుజ‌నా చౌద‌రి వంటి మాజీ కేంద్రమంత్రులు జ‌గ‌న్‌‌ ప్రభుత్వంపై కేంద్రానికి తప్పుడు సమాచారం చేరవేస్తున్నారట‌. ఇటీవ‌ల కేంద్ర మంత్రి నిర్మలా సీతారామ‌న్ వర్చువల్ మీటింగ్ లో రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖ‌రి కార‌ణంగా అంత‌ర్జాతీయంగా ప‌రువు పోతోంద‌ని నిర్మల అనేశారు. దీంతో అస‌లు కేంద్రానికి-ఏపీకి మ‌ధ్య క‌మ్యూనికేష‌న్‌లో ఏం జ‌రుగుతోంది? అనే విష‌యంపై సాక్షాత్తూ.. సీఎం జ‌గ‌న్ ఆరాతీసిన‌ట్టు తెలిసింది. ఈ క్రమంలోనే బీజేపీలో చేరిన కొంద‌రు టీడీపీ నాయ‌కులు .. కేంద్రంలోని పెద్దల‌తో ఉన్న స‌న్నిహిత సంబంధాల కార‌ణంగా ఏపీ స‌ర్కారుపై ఫిర్యాదులు మోసేస్తున్నార‌ని తెలిసింద‌ట.

తమ గుర్తింపు కోసం….

వాస్తవానికి గతంలో బీజేపీపై తీవ్ర విమర్శలు చేసిన ఈ నేత‌లు టీడీపీ ఓడిపోవడంతో బీజేపీ పంచన చేరిన విష‌యం తెలిసిందే. ఏపీలో వీళ్ల వ‌ల్ల బీజేపీకి ఒరిగిందేమి లేదు. అస‌లు కేంద్రంలో కూడా బీజేపీ పెద్దల‌కు వీళ్లను పట్టించుకునే తీరిక కూడా లేదు. ఈ క్రమంలోనే వీళ్లకు ఇప్పుడు ఏదో ఒక ప‌ద‌వి కావాలి… అవి ఇచ్చే వాళ్లు కూడా లేరు. దీంతో ఏదోలా అధిష్టానం దృష్టిలో ప‌డేందుకు వీరు ప‌డరాని పాట్లు ప‌డుతున్నారు. దీంతో వీరు కేంద్రంలోని కొంద‌రు పెద్దల‌ను ఏదో ఒక రూపంలో మ‌చ్చిక చేసుకుని “మీరు ఏ సమాచారం అడిగినా ఇచ్చేందుకు మేం సిద్ధం“ అంటూ.. ఏపీపై ఫిర్యాదుల‌ను మోసేస్తున్నార‌ట‌. రాజ‌ధాని విష‌యంలో అయితే, ఏకంగా ఫొటోల‌ను కూడా చూపించి.. మోడీకే అవ‌మానం జ‌రిగే రీతిలో జ‌గ‌న్ వ్యవ‌హ‌రిస్తున్నార‌ని చెప్పార‌ట‌.

సంబంధాలను దెబ్బతీసేలా….

మొత్తంగా జ‌గ‌న్‌కు కేంద్రానికి మ‌ధ్య ఉన్న సున్నిత‌మైన సంబంధాల‌ను దెబ్బతీసేలా.. వీరు బాగానే చ‌క్రంతిప్పుతున్నార‌ని తెలియ‌డంతో.. జ‌గ‌న్ ఏకంగా విజయసాయిరెడ్డికి క్లాస్ పీకార‌ని తెలిసింది. ఇదే విష‌యం మ‌న‌సులో పెట్టుకున్నారో ఏమో.. ఎంపీ ర‌ఘు విష‌యంలో మీడియాతో మాట్లాడిన సాయిరెడ్డి.. కేంద్రంతో త‌మ‌కు కొన్ని విష‌యాల్లో మాత్రమే స‌త్సంబంధాలు ఉన్నాయ‌ని చెప్పుకొచ్చారు. మొత్తానికి ఢిల్లీలో ఏపీ రాజ‌కీయం బాగానే జ‌రుగుతోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Tags:    

Similar News