Vijayasai : సాయిరెడ్డి ఆ నిర్ణయం వెనక?

వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తాను ఉత్తరాంధ్ర పై పట్టుకోల్పోలేదని నిరూపించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ కు అత్యంత ముఖ్యుడిగా ఉన్న విజయసాయరెడ్డిని ఉత్తరాంధ్ర [more]

Update: 2021-10-22 13:30 GMT

వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తాను ఉత్తరాంధ్ర పై పట్టుకోల్పోలేదని నిరూపించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ కు అత్యంత ముఖ్యుడిగా ఉన్న విజయసాయరెడ్డిని ఉత్తరాంధ్ర పార్టీ రాజకీయాలకు దూరంగా ఉంచుతారన్న వార్తలు వచ్చాయి. అయితే వీటిని అధిగమించేందుకు విజయసాయిరెడ్డి ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఇందులో భాగంగా ప్రజా దర్బార్ ను నిత్యం విజయసాయిరెడ్డి నిర్వహిస్తున్నారు.

నేరుగా సమస్యలను…

వారంలో ఐదు రోజుల పాటు ఈ ప్రజా దర్బార్ కొనసాగనుంది. సోమవారం నుంచి శుక్రవారం వరకూ ప్రజాదర్బార్ లో విజయసాయిరెడ్డి ప్రజలను కలుసుకుంటారు. మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకూ ఎటువంటి అపాయింట్ మెంట్ లేకుండా విజయసాయిరెడ్డిని ఎవరైనా కలసి తమ సమస్యలను చెప్పుకునేలా ఈ కార్యక్రమాన్ని ప్లాన్ చేశారు. విశాఖపట్నానికి చెందిన వారే కాకుండా ఉత్తరాంధ్రకు చెందిన వారంతా కలసి తమ సమస్యలను చెప్పుకోవచ్చు. వాటిని పరిష‌్కరించేందుకు కృషి చేస్తారు. ఆయన ప్రజాదర్బార్ కు మూడు జిల్లాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో వస్తున్నారు.

వాళ్లను డమ్మీ చేయడానికా?

అయితే ఈ కార్యక్రమం మంత్రులను డమ్మీ చేయడానికే అన్న విమర్శలు కూడా లేకపోలేదు. ఉత్తరాంధ్ర జిల్లాలో మొత్తం ఐదుగురు మంత్రులు ఉన్నారు. బొత్స సత్యనారాయణతో పాటు పుష‌్ప శ్రీవాణి, ధర్మాన కృష్ణదాస్, అప్పలరాజు, అవంతి శ్రీనివాసరావులు ఉన్నారు. వీరంతా ప్రజలకు అందుబాటులోనే ఉంటారు. కొత్తగా వచ్చే మంత్రులకు ముందుగానే చెక్ పెట్టేందుకు విజయసాయిరెడ్డి ఈ కార్యక్రమం పెట్టారన్న విమర్శలు లేకపోలేదు.

ఆరేళ్లుగా ఈ ప్రాంతాన్ని….

కానీ ఆరేళ్లుగా విజయసాయిరెడ్డి విశాఖపట్నం ప్రాంతంలోనే ఉంటున్నారు. రాజ్యసభ సభ్యుడిగా తన నిధులను అక్కడే ఖర్చు చేస్తున్నారు. విశాఖలోనే ఉండిపోతానని ఆయన ఇటీవల చెప్పారు. పార్టీని బలోపేతం చేయడం కోసమే విజయసాయిరెడ్డి ఇటువంటి చర్యలు తీసుకుంటున్నారని, మంత్రుల వద్దకు వెళ్లే వాళ్లు వెళ్తారని, అవకాశం లేని వాళ్లు విజయసాయి వద్దకు వస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మంచి చేసినా బురద చల్లడం అలవాటుగా మారిందని కూడా వైసీపీ నేతలు అంటున్నారు. మొత్తం మీద ఉత్తరాంధ్రపై మరింత పట్టు సాధించేందుకే ప్రజాదర్బార్ ను విజయసాయిరెడ్డి పెట్టారన్నది మాత్రం వాస్తవం.

Tags:    

Similar News