విజయసాయికి ఆయనకు మధ్య దూరం పెరిగిందా ?

విజయసాయిరెడ్డి రాంగ్ రూట్లో వెళ్తున్నారా. జగన్ మనసెరిగి పనిచేస్తున్నాను అనుకుంటూనే ముఖ్యమంత్రికే కొత్త తలనొప్పులు తీసుకువస్తున్నారా అంటే సమాధానం అవును అనే వస్తోంది. ప్రతీ రోజూ ట్వీట్లు [more]

Update: 2021-07-01 14:30 GMT

విజయసాయిరెడ్డి రాంగ్ రూట్లో వెళ్తున్నారా. జగన్ మనసెరిగి పనిచేస్తున్నాను అనుకుంటూనే ముఖ్యమంత్రికే కొత్త తలనొప్పులు తీసుకువస్తున్నారా అంటే సమాధానం అవును అనే వస్తోంది. ప్రతీ రోజూ ట్వీట్లు చేస్తూ చంద్రబాబు సహా ప్రత్యర్ధులతో చెడుగుడు ఆడే విజయసాయిరెడ్డి ఏనాడో హద్దులు దాటేశారు అన్న మాట సొంత పార్టీలోనే ఉంది. జగన్ కి ఆయన కుడి భుజం కాబట్టి ఎవరూ పైకి మాత్రం చెప్పలేకపోతున్నారు. ఇక ఉత్తరాంధ్రా మూడు జిల్లాలను చూస్తే బాధ్యతను జగన్ అప్పగిస్తే విజయసాయిరెడ్డి ఏకంగా తానే సామంతరాజు అన్నట్లుగా ఫీల్ అవుతున్నారని కూడా విమర్శలు ఉన్నాయి.

నష్టమే తెచ్చారా….?

విజయసాయిరెడ్డికి జగన్ కి దూరం బాగా పెరిగింది అన్న ప్రచారం అయితే చాలా కాలంగా ఉంది. ముఖ్యంగా విశాఖ కార్పోరేషన్ ఎన్నికల్లో తొంబై సీట్లు తెస్తానని చెప్పి సర్వ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకున్న విజయసాయిరెడ్డి చివరికి అత్తెసేరు సీట్లతో తన పేలవమైన ప్రదర్శనను చాటుకున్నారు. అపుడే జగన్ ఆయన పనితీరు పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు అన్న టాక్ వినిపించింది. ఆ తరువాత కూడా విశాఖలో పార్టీని పక్కన పెట్టి తానే హైలెట్ అవుతూ ఆయన చేస్తున్న రాజకీయ విన్యాసం కూడా హై కమాండ్ దృష్టి దాటిపోలేదు అంటున్నారు. ఇక మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారంలో ఏకంగా పార్టీకి, ప్రభుత్వానికీ కూడా నష్టం కలిగించే విధంగా విజయసాయిరెడ్డి చేశారు అంటున్నారు.

టచ్ చేయడం వల్లనే …?

నిజానికి మాన్సాస్ ట్రస్ట్ ని టచ్ చేయాలన్న ఆలోచన ఎక్కడా జగన్ సర్కార్ కి లేదు అంటారు. విశాఖలో రాజధానికి కావాల్సిన భూములను సేకరించే క్రమంలో సింహాచలం దేవస్థానానికి ఎక్కువగా ఉన్న భూములను విజయసాయిరెడ్డి సహా స్థానిక నేతలు గుర్తించారు. అలా మాన్సాస్ ట్రస్ట్ మీదకు కూడా చూపు మళ్ళిందని అంటారు. అయితే ఈ విషయంలో ఒక స్వామీజీ సలహా సూచనలకు విజయసాయిరెడ్డి తలవొగ్గారని, ఆ విధంగా పార్టీకి ఏ మాత్రం సంబంధం లేని సంచయిత గజపతిరాజుని చైర్ పర్సన్ గా తెచ్చి మాన్సాస్ ట్రస్ట్ ని అతి పెద్ద వివాదంగా మార్చేశారు అంటున్నారు. చివరకు కోర్టు మొట్టి కాయలతో ప్రభుత్వానికి తల బొప్పి కట్టినట్లు అయింది.

పెద్దల సభకు బ్రేక్….?

ఉత్తరాంధ్ర జిల్లాలలో జీవం లేకుండా ఉన్న టీడీపీకి బలమిచ్చేలా విజయసాయిరెడ్డి అనేక నిర్ణయాలు ఉన్నాయని అంటున్నారు. పూసపాటి కుటుంబంలో ఉన్న ఆస్తుల వివాదంలోకి ప్రభుత్వం దూరి అపఖ్యాతి పాలు అయింది అన్న మాట కూడా ఉంది. విజయనగరం జిల్లాలో 2019 ఎన్నికల్లో జీరో తెచ్చుకున్న టీడీపీకి అక్కడే ప్రాణం పోసేలా అశోక్ వ్యవహారం ఉందని అంటున్నారు. అలాగే గోదావరి జిల్లాల్లో రాజులు కూడా వైసీపీకి దూరం అయ్యే సీన్ కనిపిస్తోంది. అశోక్ మీద విజయసాయిరెడ్డి చేసిన తీవ్ర వ్యాఖ్యలను రాజకీయలకు అతీతంగా అంతా తప్పుపడుతున్నారు. చివరకు చంద్రబాబుకు బద్ధ విరోధి అన్న పేరున్న కాపు నేత ముద్రగడ పద్మనాభం కూడా జగన్ ఈ విషయంలో విజయసాయిరెడ్డిని కట్టడి చేయాల్సిందే అంటూ లేఖ రాయడం దుమారం రేపుతోంది. ఈ పరిణామాలతో పాటు మంత్రి పదవులు కోరుకుంటున్న కొందరు విజయసాయిరెడ్డిని ఆశ్రయించడం కూడా హై కమాండ్ దృష్టిలో ఉందిట. ఆయన్ని నమ్ముకుంటే పదవులు కాదు కదా ఏమీ ఇచ్చేది లేదు అన్న సంకేతాలు కూడా పంపించాలని హై కమాండ్ డిసైడ్ అయిందట. అలాగే విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యత్వం వచ్చే ఏడాది ముగుస్తుంది. ఈ లోగా ఆయన తీరు మార్చుకోకపోతే మాత్రం పెద్ద చెక్ పడిపోతుందని కూడా ఊహిస్తున్నారు.

Tags:    

Similar News