విజయసాయి అతి చేస్తున్నారా… ?

ఉత్తరాంధ్రాలో అతి పెద్ద రాజకీయ పోరుగా అశోక్ వర్సెస్ విజయసాయిరెడ్డి వివాదం మారుతోంది. విజయసాయిరెడ్డిని ఏ టూ అంటూ అశోక్ రెచ్చగొడితే ఏకంగా రాజా వారినే పెద్ద [more]

Update: 2021-06-20 12:30 GMT

ఉత్తరాంధ్రాలో అతి పెద్ద రాజకీయ పోరుగా అశోక్ వర్సెస్ విజయసాయిరెడ్డి వివాదం మారుతోంది. విజయసాయిరెడ్డిని ఏ టూ అంటూ అశోక్ రెచ్చగొడితే ఏకంగా రాజా వారినే పెద్ద దొంగ అంటూ విజయసాయిరెడ్డి మాటల తూటాలను వదిలారు. దీంతో ఇక్కడ పార్టీల కంటే కూడా ఎక్కువగా రెడ్డి గారు, రాజుగారి మధ్యన యుద్ధం అన్నది మారుతోంది. మాన్సాస్ ట్రస్ట్ సంగతి ఎలా ఉన్నా పూసపాటి రాజుల మీద ఇంత తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన వారు ఇంతవరకూ ఎవరూ లేరు. మూడు తరాలుగా పూసపాటి రాజులు ప్రజాస్వామ్య జీవితంలో ఉన్నారు. వారు ఎన్నికలలో ప్రత్యర్ధులను కూడా చూశారు. కానీ వారి మీద ఇలా దారుణమైన కామెంట్స్ ఎపుడూ ఎవరూ వినలేదు.

అతి చేస్తున్నారా ….?

విజయసాయిరెడ్డికి ఉత్తరాంధ్రా పార్టీ వ్యవహారాలను నిర్వహించడంతో సర్వాధికారాలు జగన్ ఇచ్చి ఉండవచ్చు. అదే విధంగా ప్రభుత్వ కార్యక్రమాలలో కూడా ఆయన పెత్తనం చేయవచ్చు. కానీ కొన్ని ప్రతిష్టాత్మకమైన కుటుంబాలు ఇక్కడ ఉన్నాయి. అలాగే రాజకీయాలతో సంబంధం లేకుండా వారిని తరాలుగా ఆరాధించే జనాలు ఉంటారు. ఎన్నికల్లో ఓట్ల అంకెలు అటూ ఇటూ మారితే పరాజితులు కావచ్చు, అంత మాత్రం చేత పూసపాటి వారి విలువ తక్కువ అయిందని కాదు, ఈ విషయంలో విజయసాయిరెడ్డి అతి చేస్తున్నారు అన్నది సొంత పార్టీలోనూ వినిపిస్తున్న మాట.

తప్పు మీద తప్పులు…?

ఇప్పటికే వైసీపీ మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారాన్ని కెలికి తప్పు చేసింది అన్నది జనాల్లో ఉన్న భావన. ఒకనాడు విశాఖ, విజయనగరం కలుపుకుని పాలించిన పూసపాటి రాజులను దొంగలు అంటూ విజయసాయిరెడ్డి నోరు చేసుకోవడాన్ని జనాలు అసలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ రోజుకూ విజయనగరం నిండా ఎటు చూసిన రాజుల ఆస్తులే జనాలకు పంచిన చరిత్ర కనిపిస్తుంది. అలాగే విశాఖ ఆంధ్రా యూనివర్సిటీకి ఆ రోజుల్లోనే పీవీజీ రాజు ఆరు వందల ఎకరాలను ఇచ్చి నాటి ప్రధాని ఇందిరా గాంధీ మెప్పు పొందారు. ఇలా ఎన్నో విద్యా దానాలు చేసిన గొప్పతనం వారిది. అటువంటి పూసపాటి వంశీకుడు అశోక్ దొంగ అని, ఆయన భూ కబ్జాలు చేస్తాడు అని విజయసాయిరెడ్డి చెప్పడం అంటే నమ్మలేని ఆరోపణలే అంటున్నారు.

తగ్గితేనే మేలు ….

మాన్సాస్ ట్రస్ట్ నిర్వహణలో లోపాలు ఉండి ఉండవచ్చు. అశోక్ కి తెలియకుండా ఎక్కడైనా భూములు కబ్జాకో లేక మరెవరి పరమో అయి ఉండవచ్చు. అంత మాత్రం చేత ఆ భూములను ఆయన అమ్ముకున్నారని చెప్పడమేంటని మేధావులు కూడా అంటున్నారు. విజయసాయిరెడ్డి నెల్లూరు జిల్లా నుంచి వచ్చి ఆరేళ్ళుగా విశాఖలో ఉంటున్నారు. వందల ఏళ్ల నుంచి పూసపాటి వంశీకులు అక్కడే పుట్టి ప్రజలకు సేవ చేస్తున్నారు. మరి అటువంటి రాజ వంశీకుల మీద విమర్శలు చేయడం వల్ల వైసీపీకే చేటు అన్న మాట ఉంది. ఇప్పటికైనా వైసీపీ అధినాయకత్వం విజయసాయిరెడ్డిని ఈ విషయంలో తగ్గమని ఆదేశించకపోతే ఈ ఒక్క అంశం చాలు వైసీపీకి రాజకీయంగా ఇబ్బందులు రావడానికి అంటున్నారు. మాన్సాస్ కి మేలు చేయాలని ప్రభుత్వానికి ఉంటే అశోక్ ని కలుపుకుని ముందుకు పోవాలి తప్ప అనవసర రాజకీయాలు చేయడం వల్ల ప్రజల మొగ్గు పూసపాటి వారి వైపే ఉంటుంది అన్న నిజాన్ని వైసీపీ పెద్దలు ఎరగాలని అంటున్నారు.

Tags:    

Similar News