విజయసాయి ఊ… అంటేనే… ?

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి మరో పేరు విశాఖ సాయిరెడ్డి. ఆయన ఆరేళ్ళుగా విశాఖను నోడల్ జిల్లాగా దత్తత తీసుకుని పక్కా లోకల్ అయిపోయారు. ఆయన సొంత ఊరు [more]

Update: 2021-05-24 14:30 GMT

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి మరో పేరు విశాఖ సాయిరెడ్డి. ఆయన ఆరేళ్ళుగా విశాఖను నోడల్ జిల్లాగా దత్తత తీసుకుని పక్కా లోకల్ అయిపోయారు. ఆయన సొంత ఊరు నెల్లూరు అని అతి తక్కువ మందికి మాత్రమే తెలుసు. వారు సైతం ఇపుడు మరచిపోయేలా విశాఖే తన పుట్టినిల్లు అని ఆయన అంటున్నారు. కష్టాల్లోనూ నష్టాల్లోనూ విశాఖ వాసులతో ఆయన కలసి నడుస్తున్నారు. కరోనా వేళ అయినా, ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటనలో అయినా కూడా విజయసాయిరెడ్డి వెన్నంటి ఉండి జనాలకు ఎపుడూ భ‌రోసా ఇస్తున్నారు. రాజకీయ నాయకులు, సాదర జనాలే కాదు అధికారులు సైతం ఆయన్ని ఏ శాఖా లేని విశాఖ మంత్రిగానే గుర్తిస్తారు, గౌరవిస్తారు.

సెట్ అయ్యారుగా…?

ఇక విజయసాయిరెడ్డి ప్రాభవాన్ని జగన్ దగ్గర ఆయన పలుకుబడిని ఎరిగినా కూడా మంత్రి అవంతి శ్రీనివాస్ మొదట్లో ఎందుకో అలిగేవారు, తనకు సరైన ప్రాధాన్యత దక్కలేదని దూరం జరిగేవారు. అయితే ఇపుడు హానీమూన్లు అన్నీ అయిపోయాయి. మరి కొద్ది నెలల్లో మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని అంటున్న నేపధ్యంలో అవంతి రూట్ లోకి వచ్చేసారు. విజయసాయిరెడ్డితో గుడ్ రిలేషన్స్ మెయింటెయిన్ చేస్తున్నారు. అంతే కాదు ఆయన మద్దతు ఉంటే అయిదేళ్ళూ తానే మంత్రిని అని కూడా భావిస్తున్నారు. అయితే విజయసాయిరెడ్డి మదిలో ఏముందో తెలియదు మరి.

ఆయన మెచ్చాలిగా…?

విశాఖ జిల్లాలో వైసీపీకి 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. టీడీపీ నుంచి గెలిచిన వాసుపల్లి గణేష్ కుమార్ కూడా ఆ పార్టీలో చేరారు. అంటే డజన్ మంది అన్న మాట. వీరిలో వాసుపల్లిని మినహాయిస్తే పదకొండు మందిలో ఎవరికి అమాత్య కిరీటం అన్నదే ఇక్కడ ప్రశ్న. విజయసాయిరెడ్డికి టోటల్ గా ఎమ్మెల్యేలు అంతా బద్ధులుగానే ఉంటారు. అయితే ఆ మధ్యన చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ బాహాటంగానే ఒక సమీక్షా సమావేశంలో చిన్నపాటి గొడవకు దిగారు. ఇక అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమరనాధ్ కి విజయసాయిరెడ్డి గురువు లాంటి వారు. ఇలా చాలామంది ఆయన వద్దకు వస్తూ తమ పేరు చెప్పమని కోరే వారే ఉన్నారు. కానీ విజయసాయిరెడ్డి మెచ్చేవారు ఎవరో ఒక్క జగన్ కే చెబుతారు అంటున్నారు.

అదే క్వాలిఫికేషన్..?

విశాఖలో విజయసాయిరెడ్డి హవాకు బ్రేకులు లేకుండా చూసుకుంటారు. జగన్ కూడా ఆ విషయమే ప్రయారిటీగా తీసుకుంటారు. అలా ఉన్న వారికే మంత్రి పదవి దక్కుతుందని అంటున్నారు. మంత్రి అవంతి శ్రీనివాస్ కి అవినీతి మచ్చ లేదు. పైగా నిజాయతీపరుడు, రాజకీయ వ్యూహాలు ఎత్తులు పై ఎత్తులు వేసి గోతులు తవ్వే నైజం లేని వాడు అన్నది హై కమాండ్ కి తెలుసు. ఇక ఆయన నాన్ లోకల్. క్రిష్ణా జిల్లాకు చెందిన వాడు. ఆయన రెండేళ్ళుగా బాగానే ఉంటూ వస్తున్నారు. ఆయన్ని కాదని లోకల్ గా ఎవరికి మంత్రి పదవి ఇచ్చినా కొంత దూకుడు ప్రదర్శించే అవకాశం ఉందనే అంటున్నారు. పైగా ఎమ్మెల్యేలుగానే కొంత మంది మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఆ సంగతి విజయసాయిరెడ్డికీ తెలుసు. ఇక వారిని మంత్రిగా చేస్తే తనను మించుతారు అన్న బెంగా బెరుకూ ఎటూ ఉంటాయి. ఇవన్నీ ఆలోచిస్తే కులాల ఈక్వేషన్లు చూపించి ఏ నెమ్మదస్తుడికైనా ఆ పదవి ఇవ్వాలి, లేకపోతే అవంతినే కంటిన్యూ చేయాలి. మొత్తానికి చూస్తే విశాఖ జిల్లాలో ప్రస్తుతం వినిపిస్తున్న పేర్ల కంటే అనూహ్యమైన వారికే అమాత్య కిరీటం దక్కుతుంది అన్నదే వైసీపీ వర్గాలలో చర్చ.

Tags:    

Similar News