ఆయనొక్కరే హైలెట్ అయితే ఎలా ?

పార్టీ అన్నాక అందరూ ఎదగాలి. జనాలకు అందరూ కనిపించాలి. పొట్టో పొడుగో కానీ అందరూ చూసే వారికి ఆనాలి. అపుడే కదా పార్టీ పటిష్టంగా ఉంటుంది. వైసీపీలో [more]

Update: 2021-05-22 02:00 GMT

పార్టీ అన్నాక అందరూ ఎదగాలి. జనాలకు అందరూ కనిపించాలి. పొట్టో పొడుగో కానీ అందరూ చూసే వారికి ఆనాలి. అపుడే కదా పార్టీ పటిష్టంగా ఉంటుంది. వైసీపీలో చూస్తే ఆ తీరే కనిపించడంలేదు. ఏపీలో చూస్తే జగన్ ఒక్కరే కనిపిస్తారు. ఆయన పక్కన మరో నేత కూడా కంటికి ఆనే చాన్సే లేదు. ఇక విశాఖ లాంటి పాలనా రాజధానిలో చూసుకుంటే ఏకైక నేతగా విజయసాయిరెడ్డి మాత్రమే కనిపిస్తున్నారు. ఆయనే అన్నింటా హైలెట్ అవుతున్నారు. ఆయన వినా మరో నేత పేరు గుర్తుకు వచ్చే సీన్ లేకుండా పోతోంది.

ఆయనే ముందు…

విశాఖలో కరోనా వైద్య సేవల మీద విజయసాయిరెడ్డి మాత్రమే సమీక్ష చేస్తారు. విశాఖలో ప్రజా సమస్యల మీద ఆయనే పోరాడుతారు. విశాఖ నుంచి పార్టీ తరఫున వాయిస్ వినిపించాలంటే ఆయన మీడియా ముందుకు వస్తారు. ఇక జీవీఎంసీ ఎన్నికల వేళ విజయసాయిరెడ్డి పేరు తప్ప మరోటి వినిపించలేదు. ఆయనే స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం పాదయాత్ర చేశారు. పార్టీని గెలిపించిన కీర్తిని ఆయనే దక్కించుకున్నారు. ఇపుడు కరోనా ఆసుపత్రులను పీపీఈ కిట్స్ ధరించి ఆయనే సందర్శించి రోగులను పరామర్శిస్తున్నారు. అంటే ఒక విధంగా ఆయనే మంత్రి అనుకోవాలన్న మాట.

భారీ సేవలో…..

ఇక విజయసాయిరెడ్డి గత ఏడాది ప్రగతి చారిటబుల్ ట్రస్ట్ అన్న పేరు మీద ఒక ఒక స్వచ్చంద సంస్థను ఏర్పాటు చేశారు. ఆ ట్రస్ట్ ద్వారా గత ఏడాది సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఇపుడు విశాఖలో రెండు వందల ఆక్సిజన్ పడకలతో కరోనా ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ కరోగా రోగులకు వైద్యం, మందులు భోజనం అన్నీ ఉచితంగా అందిస్తున్నారు. ఇదే తీరున మరి కొన్ని చోట్ల కూడా విశాఖలో ఏర్పాటు చేయాలని విజయసాయిరెడ్డి నిర్ణయించారు. ఇది ఆయన ప్రగతి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పెద్ద ఎత్తున చేస్తున్న సేవగా చెబుతున్నారు. విశాఖలో మంత్రి, ఎమ్మెల్యేలు, ఎంపీ వంటి వారు ఉన్నా కూడా విజయసాయిరెడ్డి మాత్రమే చొరవ చూపించడమే ఇక్కడ విశేషమే.

ఒక్కడు చాలా….?

జగన్ మద్దతు విజయసాయిరెడ్డికే ఉందని ఇప్పటికీ రుజువు అవుతున్న నిజం. ఇక గత ఏడాది కరోనా సమయాన కూడా విజయసాయిరెడ్డి మాత్రమే బాగా ఫోకస్ అయ్యారు. ఆయనే కలెక్టర్ సహా జిల్లా ఉన్నత‌ అధికారులతో వరస సమీక్షలు నిర్వహించారు. నాడు అలిగిన జిల్లా మంత్రి అవంతి శ్రీనివాస్ కొన్నాళ్ళు ఎక్కడా కనిపించలేదు. ఈసారి మాత్రం ఆయనంతట ఆయనే తప్పుకున్నారని అంటున్నారు. మరో ఆరు నెలలలో ఎలాగూ పదవి పోతుంది. ఈ లోగా ఎందుకొచ్చిన గొడవ అని అవంతి ఆలోచనలో ఉన్నట్లుగా చెబుతున్నారు. దీంతో మొత్తం విశాఖ జిల్లాకే కాదు, ఉత్తరాంధ్రాకే విజయసాయిరెడ్డి ఒకే ఒక్కరుగా వైసీపీలో ముందుకు వస్తున్నారు. ఆయనలా కోట్లు ఖర్చు పెట్టి కోవిడ్ ఆసుపత్రులు నడిపే వారు వైసీపీలో లేరు. ఒకవేళ ఉన్నా కూడా వారికి జగన్ ఆశీస్సులు ఎంతవరకూ ఉంటాయో కూడా తెలియదు అంటున్నారు. మొత్తానికి చూస్తే విజయసాయిరెడ్డి కేరాఫ్ వైసీపీ అంటున్నారు అంతా.

Tags:    

Similar News