ఎనీ డౌట్…. నెంబర్ 2 ఈయనే..?

రాజకీయాల్లో ఓర్పు, సహనంతో ఎదురుచూడాలి. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు సంయమనం వహించాలి. అప్పుడే తనదైన రోజున చక్రం తిప్పే అవకాశం వస్తుంది. ఇందుకు తాజా ఉదాహరణ వైసీపీలో [more]

Update: 2021-01-07 15:30 GMT

రాజకీయాల్లో ఓర్పు, సహనంతో ఎదురుచూడాలి. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు సంయమనం వహించాలి. అప్పుడే తనదైన రోజున చక్రం తిప్పే అవకాశం వస్తుంది. ఇందుకు తాజా ఉదాహరణ వైసీపీలో విజయసాయిరెడ్డి. పార్టీ ప్రారంభం నుంచి నంబర్ టు గా ఉంటూ వచ్చిన విజయసాయిరెడ్డి ఏడాదికాలంగా ఒడుదొడుకులు ఎదుర్కొంటూ వస్తున్నారు. పార్టీ తరఫున తొట్టతొలి రాజ్య సభ సభ్యునిగా, పార్లమెంటరీ పార్టీ నేతగా, ప్రదాన కార్యదర్శిగా బహుముఖ మైన పాత్ర అతనిది. అన్నిటికీ మించి జగన్ కు అత్యంత సన్నిహితుడు. సీఎం ముద్దాయిగా ఉన్న దాదాపు కేసులన్నిటిలోనూ తాను సైతం నిందితునిగా ఉన్నాడు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యుత్సాహం, అతి చొరవ చూపడంతో పార్టీలో విజయసాయిరెడ్డికి ప్రతికూల వాతావరణం ఏర్పడింది తప్పనిసరి పరిస్థితుల్లో జగన్ కొంత దూరం పెట్టారు. పార్టీ బాధ్యతలను విభజించి విజయసాయిరెడ్డితో పాటు వై.వి.సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డిలకు అప్పగించారు. ఉత్తరాంధ్రకే విజయసాయిని పరిమితం చేశారు. ఈ పరిణామం పార్టీలో ఆయన ప్రాబల్యాన్ని కుదించి వేసింది. కానీ మళ్లీ గడచిన రెండు నెలలుగా పరిస్థితులు అనుకూలంగా మారాయి. తాజా పరిణామాలల్లో మళ్లీ విజయసాయిరెడ్డి శకం పార్టీలో ప్రారంభమైందని ప్రచారం మొదలైంది.

కమలం కినుకతో కష్టాలు..

వైసీపీలో విజయసాయి రెడ్డి వ్యూహకర్త. సామాజిక మాధ్యమాల్లో ప్రచారాన్ని హోరెత్తించినా, ప్రశాంత్ కిశోర్ తో కలిసి అభ్యర్థుల ఎంపికను వడపోసినా అంతా ఆయన చేతులమీదుగానే జరిగింది. జగన్ కు అత్యంత విశ్వాసపాత్రుడే కాకుండా , మీడియా సామ్రాజ్య నిర్మాణంలో విజయసాయిరెడ్డి పాత్ర తోసిపుచ్చలేనిది. సమీపబంధువుగా వై.వి.సుబ్బారెడ్డి, మీడియా నిర్వహణలో సజ్జల రామకృష్ణారెడ్డి కుడిఎడమ భుజాలుగా జగన్ కు నిలిచారు. అయినప్పటికీ ఆయనకు హార్ట్; ఆత్మ మాత్రం విజయసాయిరెడ్డినే. పార్టీ విజయం సాధించేవరకూ రాజకీయ వ్యవహారాలన్నీ ప్రధాన కార్యదర్శి హోదాలో నేరుగా ఆయన నిర్వహించేవారు. పాదయాత్రలో ఉన్న జగన్ పార్టీ పదవుల నియామక బాధ్యతలు సహా సంపూర్ణ పర్యవేక్షణను విజయసాయికి అప్పగించారు. పార్టీకి తొలి రాజ్యసభ సభ్యునిగా అవకాశం కల్పించారు. అధికారం రాగానే ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధి బాధ్యతలు అప్పగించారు. అంతా బాగానే ఉంది. కానీ తన దూకుడే ఆయనకు బ్రేకులు వేసింది. బీజేపీని రాష్ట్రంలో డ్యామేజీ చేసే ప్రయత్నం చేశారని కమలం పార్టీ పెద్దలు ఆయనపై ఆగ్రహించారు. ప్రధానంగా కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ రా ష్ట్ర శాఖ అధ్యక్షునిగా ఉన్న సమయంలో విజయసాయి చేసిన వ్యాఖ్యలు , తెలుగుదేశం రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరినప్పుడు ఆయన చేసిన ప్రవర్తించిన తీరు బీజేపీకి కొంత ఆగ్రహం కలిగించాయి. దీనిపై బీజేపీ పెద్దలు సున్నితంగా హెచ్చరించడంతో జగన్ అప్రమత్తమయ్యారు. విజయసాయిని ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల కే పరిమితం చేస్తూ కీలకమైన రాయలసీమ, కోస్తా బాధ్యతలను సజ్జల రామకృష్ణారెడ్డి, వై.వి. సుబ్బారెడ్డిలకు అప్పగించారు.

కలిసొచ్చిన సంయమనం…

పార్టీలో తన హవా తగ్గిన విషయం గ్రహించిన విజయసాయిరెడ్డి చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ వచ్చారు. తనకు అప్పగించిన బాధ్యతను సమర్థంగా నిర్వహించడంతోపాటు బీజేపీ పెద్దలతోనూ తిరిగి సన్నిహిత సంబంధాలు నెలకొల్పుకున్నారు. సోము వీర్రాజు నూతన అధ్యక్షునిగా రావడంతోనే రాష్ట్ర బీజేపీతో విజయసాయిరెడ్డికి ఉన్న విభేదాలు తొలగిపోయాయి. అందులోనూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున, జగన్ తరఫున కేంద్రంతో మాట్టాడే నైపుణ్యం కేవలం విజయసాయిరెడ్డికి మాత్రమే ఉంది. లోక్ సభా పక్షం నేత మిధున్ రెడ్డి జూనియర్ కావడం కూడా విజయసాయికి కలిసి వచ్చింది. ఉత్తరాంధ్రలో టీడీపీని చెల్లాచెదురు చేయడం, ఎమ్మెల్యేలను, నాయకులను పెద్ద ఎత్తున వైసీపీలో చేర్పించడం వంటి కార్యక్రమాలతో జగన్ ను నిరంతరం కలిసే ఏర్పాట్లు చేసుకున్నారు. ఇటీవల ప్రదానిని, హోంమంత్రిని కలిసిన సందర్బంలోనూ జగన్ తో కేవలం విజయసాయి మాత్రమే ఉండటం గమనార్హం. తాజాగా స్థానిక ఎన్నికలు ఏప్రిల్, మే నెలల్లో ఉండబోతున్నాయనే కీలక ప్రకటనను ఆయనే చేశారు. జులై 8 నుంచి పార్టీ ప్లీనరీ ఉంటుందనీ చెప్పేశారు. పార్టీ విషయాల్లో ఆచితూచి వ్యవహరించే విజయసాయిరెడ్డి వీటన్నిటినీ జగన్ తో సంప్రతించిన తర్వాతనే ప్రకటించి ఉండవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాకుండా పార్టీకి బాధ్యత వహిస్తున్న ముగ్గురు నాయకులు సంయుక్తంగా చేయాల్సిన ప్టీనరీ ప్రకటనను విజయసాయిరెడ్డి తన సొంతం చేసుకోవడమంటే మళ్లీ నంబర్ టు స్థానం తనదేనని చాటిచెప్పడమే.

సజ్జల, వైవీలు స్థానికమే…

నిజానికి విజయసాయిరెడ్డితో పార్టీకి చాలా అవసరాలున్నాయి. కేంద్రంతో సంబంధాలు, ఆర్థిక సర్దుబాట్లు, పారిశ్రామిక, వ్యాపార వర్గాలతో మంతనాలు వంటివన్నీ సమర్థంగా చేయగల నైపుణ్యం పార్టీలో అతనికి మాత్రమే ఉంది. పైపెచ్చు వాణిజ్య మంత్రిత్వ శాఖ స్టాండింగ్ కమిటీకి ఛైర్మన్ గానూ వ్యవహరిస్తున్నారు. మరోవైపు విజయసాయితో సమాన హోదాలో పార్టీకి బాధ్యులుగా నియమితులైన సజ్జల రామకృష్ణరెడ్డి, వై.వి.సుబ్బారెడ్డిలు స్థానికంగానే పరిమితమైపోయారు. టీడీపీకి దీటైన సమాధానం చెప్పడంలోనూ విజయసాయిరెడ్డి కనబరచిన చొరవను ఈ ఇద్దరు నాయకులు చూపలేకపోతున్నారనేది జగన్ సమీకరించుకున్న సమాచారం. వై.వి. సుబ్బారెడ్డి పూర్తిగా ఆధ్యాత్మిక కార్యక్రమాలకు , తన అనుచరులకు సంబంధించిన వ్యవహారాలకే సమయం కేటాయిస్తున్నారనేది ఫిర్యాదు. తనకు అప్పగించిన జిల్లాల విషయంలోనూ సమర్థంగా పాత్ర పోషించలేకపోతున్నారంటున్నారు. గోదావరి జిల్లాల్లో ప్రబలుతున్న అంతర్గత విభేదాలను స్వయంగా జగన్ పరిష్కరించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అదే విధంగా పార్టీ కేంద్ర కార్యాలయ బాధ్యతలను కూడా సజ్జలకు అప్పగించినా సమన్వయం కనిపించడం లేదని పార్టీ నాయకులే పేర్కొంటున్నారు. మొత్తమ్మీద వీరిద్దరి బలహీనతలు విజయసాయికి వరంగా మారాయి. ఆయనకు ముకుతాడు వేయాలని ఒకానొక దశలో జగన్ భావించినప్పటికీ తిరిగి స్వేచ్ఛను, తన తర్వాత అపరిమిత అధికారాలను కల్పించకతప్పని అనివార్యత ఏర్పడింది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News