ట్రబుల్ షూటర్ ఎస్సెట్ అయ్యారే…!!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో విజయసాయిరెడ్డి యాక్టీవ్ కావడాన్ని ప్రత్యర్థులు విమర్శించారు. ఆయనకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని సొంత పార్టీ వారే లోలోన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయనకు [more]

Update: 2019-02-16 06:30 GMT

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో విజయసాయిరెడ్డి యాక్టీవ్ కావడాన్ని ప్రత్యర్థులు విమర్శించారు. ఆయనకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని సొంత పార్టీ వారే లోలోన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయనకు రాజ్యసభ సీటు ఇచ్చారని కొందరు పార్టీనే విడిచిపెట్టారు. అయితే, వీటిని ఏమీ ఖాతరు చేయని వైఎస్ఆర్ సీపీ అధినేత జగన్… ఆయనకు పార్టీలో ప్రాధాన్యతను పెంచారు కానీ తగ్గించలేదు. ముఖ్యంగా పార్టీ బలహీనంగా ఉన్న ఉత్తరాంధ్ర బాధ్యతలను ఆయనకు అప్పగించారు. మొత్తానికి జగన్ ఆశించింది విజయసాయిరెడ్డి నెరవేరుస్తున్నారు. తనపై అధినేత పెట్టుకున్న నమ్మకాన్ని పూర్తిస్థాయిలో నిలబెట్టుకుంటున్నారు. ప్రత్యర్థులకు అంతుచిక్కని వ్యూహాలతో పార్టీని బలోపేతం చేస్తున్నారు. ఎన్నికల వేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ లో వరుస చేరికల వెనుక విజయసాయిరెడ్డి చాలా రోజులుగా చేసిన ప్రయత్నాలే కారణమంటున్నారు.

విశాఖపట్నంలో సీన్ మార్చడం వెనుక

ఉత్తరాంధ్రలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచీ బలహీనంగా ఉంది. ముఖ్యంగా విశాఖపట్నం జిల్లాలో ఆ పార్టీ చాలా వెనుకబడింది. దీంతో విశాఖ బాధ్యతలు విజయసాయిరెడ్డికి జగన్ అప్పగించారు. అయితే, కొందరు వ్యాపారవేత్తలు, మామూలు నాయకులు తప్ప పేరున్న నేతలు ఇన్నిరోజులుగా వైసీపీలో చేరలేదు. ఓ దశలో పార్లమెంటు స్థానాలతో పాటు చాలా అసెంబ్లీ సీట్లకు బలమైన అభ్యర్థులు కూడా వైసీపీకి దొరకలేదు. దీంతో ఈ ఎన్నికల్లోనూ విశాఖపట్నం జిల్లాలో వైసీపీకి ఎదురుదెబ్బ తగులుతుందని అంతా ఊహించారు. కానీ ఎన్నికల వేళ మొత్తం సీన్ మారిపోతోంది. ఏకంగా ఈ జిల్లాకు చెందిన సిట్టింగ్ ఎంపీ అవంతి శ్రీనివాసరావును పార్టీలోకి తీసుకువచ్చిన టీడీపీకి భారీ షాక్ ఇచ్చారు. అవంతి పదేళ్ల నుంచే ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నా జిల్లాలో బలమైన నాయకుడిగా ఎదిగారు. దీంతో ఆయన ప్రభావం కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ప్లస్ కానుంది. దీనికితోడు మరికొందరు టీడీపీ ఎమ్మెల్యేలుగా కూడా ఈ జిల్లా నుంచి వైసీపీలో చేరేందుకు విజయసాయిరెడ్డి సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. త్వరలో వారు కూడా వైసీపీలో చేరే అవకాశం ఉంది.

ఎక్కడ సమస్య ఉంటే అక్కడ…

కేవలం విశాఖపట్నంలోనే కాకుండా పార్టీకి సమస్య ఎక్కడ ఉంటే అక్కడ విజయసాయిరెడ్డి వాలిపోయి ట్రబుల్ షూటర్ లా పనిచేస్తున్నారు. చీరాల ఎమ్మెల్యేగా, ప్రకాశం జిల్లాలో బలమైన నాయకుల్లో ఒకరిగా ఉన్న ఆమంచి కృష్ణమోహన్ పార్టీలో చేరేందుకు ఆయన సంప్రదింపులు చేశారు. ఇక, నిన్నటి వరకు కీలకమైన విజయవాడ పార్లమెంటు స్థానానికి వైసీపీ అభ్యర్థి ఎవరనేదే పెద్ద ప్రశ్నగా ఉండేది. దీనిని కూడా పరిష్కరించడంలో విజయసాయిరెడ్డి సక్సెస్ అయినట్లు కనిపిస్తోంది. ఎవరూ ఊహించని విధంగా టీడీపీ వ్యవస్థాపక సభ్యుడు, సీనియర్ నేత దాసరి జైరమేష్ ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు కృషి చేశారు. ఆయన వైసీపీకి విజయవాడలో బలమైన అభ్యర్థి కానున్నారు. వీరిద్దరి చేరికలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు పాత్ర ఉన్నా వైసీపీ తరపున చర్చలు జరిపి వారిని పార్టీలో చేర్చడంలో మాత్రం విజయసాయిరెడ్డి పాత్రే కీలకం. మొత్తానికి విజయసాయిరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ కు అదనపు బలంగా మారారు. కేవలం పార్టీని బలోపేతం చేయడంలోనే కాకుండా సూటి విమర్శలతో తెలుగుదేశం పార్టీని ఇరుకున పెట్టడంలోనూ విజయసాయిరెడ్డి ముందుంటున్నారు.

Tags:    

Similar News