విజయసాయికి హ్యాండ్ ఇస్తారా..?

గత ఆరేళ్ళుగా విశాఖ జిల్లా సహా ఉత్తరాంధ్రా రాజకీయాల్లో పెద్ద తలకాయగా ఎంపీ విజయసాయిరెడ్డి ఉన్నారు. ఆయన జగన్ కనుసన్నలలో పార్టీ పనులను చక్కబెడుతున్నారు. మంత్రులు ఎంపీలు, [more]

Update: 2021-01-28 06:30 GMT

గత ఆరేళ్ళుగా విశాఖ జిల్లా సహా ఉత్తరాంధ్రా రాజకీయాల్లో పెద్ద తలకాయగా ఎంపీ విజయసాయిరెడ్డి ఉన్నారు. ఆయన జగన్ కనుసన్నలలో పార్టీ పనులను చక్కబెడుతున్నారు. మంత్రులు ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎవరు ఉన్నా కూడా విజయసాయిరెడ్డిదే ఈ మూడు జిల్లాల్లో అగ్ర తాంబూలం. అటువంటి విజయసాయిరెడ్డికి ఇపుడు అసలైన పరీక్ష వచ్చి పడింది. టీడీపీకి కంచుకోటలుగా ఉన్న ఉత్తరాంధ్ర జిల్లాలను 2019 ఎన్నికల్లో వైసీపీ వైపు తిప్పిన విజయసాయిరెడ్డి రాజకీయ చాతుర్యానికి మరోమారు గట్టి పోటీ ఎదురవుతోంది.

జగనే నేరుగా….

రాష్ట్రలో ఎక్కడైనా ఒక ఎత్తు. కానీ ఉత్తరాంధ్ర జిల్లాలు మాత్రం మరో ఎత్తుగా జగన్ చూస్తారు అని అందరికీ తెలిసిందే. రేపటి రోజున పాలనా రాజధానిగా విశాఖను నిలిపి అక్కడ నుంచే రాజ్యం చేయాల‌నుకుంటున్న జగన్ కి ఉత్తరాంధ్ర జిల్లాలు అతి ముఖ్యం. అందుకే తన కుడి భుజం లాంటి విజయసాయిరెడ్డిని అక్కడ ఉంచారు. ఒక విధంగా ఉత్తరాంధ్ర జిల్లాలలో పోటీ అంటే జగన్ తో నేరుగానే ఢీ కొట్టడం అన్నది విపక్షాలకు కూడా తెలుసు. అటువంటి చోట జగన్ కి మారుగా విజయసాయిరెడ్డి చేయాల్సింది చాలానే ఉంది అంటున్నారు.

పీక్స్ లో వర్గపోరు…..

ఇక ఉత్తరాంధ్ర జిల్లాల వైసీపీలో వర్గ పోరు పీక్స్ లో ఉంది. విజయసాయిరెడ్డి పెత్తనం మీద ఆ మధ్యన బాహాటంగానే ఇద్దరు ఎమ్మెల్యేలు వ్యాఖ్యానించిన ఘటనలూ ఉన్నాయి. ఇక విజయసాయిరెడ్డి పొడ గిట్టని ఒక సీనియర్ మంత్రి ఉత్తరాంధ్రాలో ఉంటే. మరో సీనియ‌ర్ నేత, మాజీ మంత్రి ఆయన్ని అసలు పట్టించుకోరు అంటారు. ఇంకో వైపు మంత్రులుగా ఉన్న వారు కూడా ఏదో ఒక సందర్భంలో విజయసాయిరెడ్డి ఆధిపత్యం ముందు తగ్గిన వారే. ఇపుడు వారందరినీ ముందు పెట్టుకుని విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్రాలో ఫ్యాన్ రెక్కలను గిర్రున తిప్పాలి. కానీ వైసీపీలో ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఉన్న పరిస్థితుల్లో 2019 నాటి మ్యాజిక్ ని విజయసాయిరెడ్డి రిపీట్ చేయగలరా అన్నదే పెద్ద డౌట్ గా ఉందిట.

టార్గెట్ ఆయనే ….

ఇక్కడో సున్నితమైన అంశం కూడా ఉంది. అటు జగన్ విజయసాయిరెడ్డి నే టార్గెట్ చేస్తున్నారు. ఉత్తరాంధ్రలో ఎన్నికల ఫలితాలు సానుకూలంగా ఉండాల్సిందే అని డైరెక్ట్ గా అదేశిస్తారు. ఇటు పార్టీ జనం చూపు కూడా ఆయన మీదనే ఉంది. ఈ కీలకమైన సమయంలో పార్టీ నాయ‌కులు కానీ పెద్ద నేతలు కానీ విజయసాయిరెడ్డి కి హ్యాండ్ ఇస్తే మాత్రం జగన్ కి నేరుగా దొరికేసేది ఆయనేనని అంటున్నారు. మరి 2019 ఎన్నికలలో ఉత్తరాంధ్రలో వైసీపీ గెలుపు ఘనతను తన మీద వేసుకున్న విజయసాయిరెడ్డికి ఓటమి బాధను కూడా రుచి చూపించాలని సొంత పార్టీ వారే డిసైడ్ అయితే మాత్రం మూడు జిల్లాల్లో రిజల్ట్స్ వేరేగా ఉంటాయని కూడా అంటున్నారు. మరి విజయసాయిరెడ్డి రాజకీయ చాణక్యంతో విముఖులను కూడా సుముఖులుగా చేసుకుని పార్టీ రధాన్ని విజయపధాన నడిపించాల్సి ఉంది. అది జరిగేనా అన్నదే ఇపుడు చర్చ.

Tags:    

Similar News