వరల్డ్ ఫెమస్ లవర్ మూవీ రివ్యూ

వరల్డ్ ఫెమస్ లవర్ మూవీ రివ్యూ బ్యానర్: క్రియేటివ్ కమర్సిల్స్ కంపెనీ నటీనటులు: విజయ్ దేవరకొండ, రాశి ఖన్నా, కేథరిన్, ఐశ్వర్య రాజేష్, ఇజబెల్లె లెప్ట్, ప్రియదర్శి, [more]

Update: 2020-02-14 09:19 GMT

వరల్డ్ ఫెమస్ లవర్ మూవీ రివ్యూ
బ్యానర్: క్రియేటివ్ కమర్సిల్స్ కంపెనీ
నటీనటులు: విజయ్ దేవరకొండ, రాశి ఖన్నా, కేథరిన్, ఐశ్వర్య రాజేష్, ఇజబెల్లె లెప్ట్, ప్రియదర్శి, జయప్రకాష్ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్: గోపి సుందర్
సినిమాటోగ్రఫీ: జయ కృష్ణ గుమ్మడి
ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వర రావు
నిర్మాత: కె ఎస్ రామారావు
స్క్రీన్ ప్లే, డైరెక్టర్: క్రాంతి మాధవ్

పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం మూడే మూడు సినిమాల్తో రౌడీ స్టార్ అవతారమెత్తాడు విజయ్ దేవరకొండ, విజయ్ దేవరకొండ నటన, స్టయిల్ కి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా కేవలం లక్కు, నటన, క్రేజ్, స్టయిల్ తోనే అభిమానులను సంపాదించుకున్న విజయ్ దేవరకొండ కి కాస్త యాటిట్యూడ్ ఎక్కువే. యాటిట్యూడ్ అనేకన్నా నోటి దూల అనడం బెటర్. అందుకే డియర్ కామ్రేడ్ సినిమా అప్పుడు విజయ్ దేవరకొండ కి యాంటీ ఫ్యాన్స్ తయారయ్యారు. విజయ్ ని తొక్కేందుకు ప్లాన్ వేసి సక్సెస్ అయ్యారు. మరి విజయ్ తనకున్న క్రేజ్ స్టామినా చూసి కాస్త ప్రౌడ్ గా ఫీలవుతుంటారు. అయితే తనకున్న క్రేజ్ తో విజయ్ దేవరకొండ క్రాంతి మాధవ్ దర్శకత్వంలో వరల్డ్ ఫెమస్ లవర్ సినిమాని మొదలు పెట్టాడు. ఆ సినిమాలో నలుగురు హీరోయిన్స్ తో రొమాన్స్ చేసిన విజయ్ దేవరకొండ ఈ సినిమాని ఒంటి చేత్తో ప్రమోట్ చేసాడు. రౌడీ బ్రాండ్ స్టయిల్ తో విజయ్ దేవరకొండ చేసిన ప్రమోషన్స్ తో మొదటినుండి సినిమాపై లేని క్రేజ్ విడుదల సమయానికి బాగానే క్రియేట్ అవడంతో.. సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి కనబడింది. మరి డియర్ కామ్రేడ్ దెబ్బకి కాస్త తడబడిన విజయ్ దేవరకొండ కి డియర్ కామ్రేడ్ హిట్ ఇచ్చిందో… లేదో.. సమీక్షలో తెలుసుకుందాం.

కథ:
కథలోకి వెళ్లినట్టయితే గౌతమ్(విజయ్ దేవరకొండ) మరియు యామిని(రాశీ ఖన్నా)లు తమ కాలేజ్ డేస్ నుంచి ప్రేమించుకుంటారు. చదువు పూర్తి చేసుకుని ఉద్యోగాలు తెచ్చుకున్న పెళ్లికి చేసుకుని సెటిల్ అవ్వాలని అనుకుంటారు. కానీ దానికి యామిని తండ్రి అడ్డం పడతాడు. దానితో ఇద్దరు పెళ్లి చేసుకోకుండానే కలిసి జీవితం గడపాలనుకుంటారు. గౌతమ్ చేస్తున్న ఉద్యోగం వదిలేస్తాడు. యామిని గౌతం ను వదిలేస్తుంది. దీని తో గౌతమ్ లైఫ్ ని లైట్ తీసుకుంటాడు. మరోపక్క భార్య భర్తలైనటువంటి శీనయ్య(విజయ్) మరియు సువర్ణ(ఐశ్వర్య రాజేష్)లు ఓ సామాన్య మధ్య తరగతి జీవనం గడుపుతుంటారు. అసలు గౌతమ్ – శీనయ్య ఒకరా? ఇద్దరా? యామిని వదిలేసిన గౌతమ్ ఏమవుతాడు? అసలు ఈ కథలో క్యాథెరిన్ (స్మిత) మరియు ఇజబెల్ లేయిట్ కు ఉన్న సంబంధం ఏమిటి? గౌతమ్ శీనయ్య గా ఎందుకు మారాడు? చివరికి గౌతమ్ ని యామిని కలుస్తుందా? అనేది మిగతా కథ.

నటీనటులు:
విజయ్ దేవరకొండ.. సినిమా సినిమాకి నటనలో వేరియేషన్స్ తో దూసుకుపోతున్నాడు. ఈ సినిమాలోనూ విజయ్ నటన అబ్బురపరుస్తుంది. విజయ్ దేవరకొండ లుక్స్ విషయంలోనే కాదు.. నటన పరంగానూ చాల వేరియేషన్ చూపించాడు. పూర్తి స్థాయి తేలంగాణ గ్రామీణ యాసతో సాగే శీనయ్య పాత్రలో విజయ్ చాలా కొత్తగా కనిపిస్తాడు. మిగతా చోట్ల కూడా విజయ్ స్టయిల్ లో, నటనలో ప్రత్యేకతను చాటుకున్నాడు. కాకపోతే కొన్నిచోట్ల విజయ్ ని చూస్తుంటే అర్జున్ రెడ్డి పాత్ర గుర్తుకొస్తుంది. నలుగురు హీరోయిన్లకు నాలుగు వేరియేషన్స్ లో ఓ పక్క తనలోని ప్లే బాయ్ పాత్రను మరోపక్క లవర్ బాయ్ గా. ఇంకా ఓ భర్తగా అద్భుతమైన నటనను విజయ్ చూపించాడు. ఈ సినిమాకు నటన పరంగా మరో మెయిన్ ఎస్సెట్ ఐశ్వర్య రాజేష్ అని చెప్పాలి. ఓ మధ్య తరగతి జీవనం గడిపే భార్యగా మంచి నటన కనబర్చింది. అలాగే కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా తన బెస్ట్ ను అందించింది. ఆమెకు స్క్రీన్ టైం తక్కువే కానీ.. ఆ తక్కువలోనే అద్భుతంగా నటించి మెప్పించింది. యామిని పాత్రలో రాశి ఖన్నా కూడా బాగా పెర్ఫామ్ చేసింది. ఆమె పాత్ర ఆశించిన స్థాయిలో లేకపోయినా. రాశి మాత్రం ఆకట్టుకుంది. కేథరిన్ థ్రెసా ఇజబెల్లా పాత్రలకు తగ్గట్లు నటించారు. మిగతావారు పరిధిమేర ఆకట్టుకున్నారు.

విశ్లేషణ:
దర్శకుడు క్రాంతి మాధవ్.. ప్రేమలో త్యాగం ఉంటుంది. ప్రేమలో రాజి తత్వం ఉంటుంది. ప్రేమలో ఒకరిపై మరొకరికి అంతులేని ఆరాధన ఉంటుందనే కాన్సెప్ట్ తో వరల్డ్ ఫెమస్ లవర్ సినిమా తెరకెక్కించాడు. ఈ సినిమా మొదలు కావడమే..విజయ్ దేవరకొండ, రాశీ ఖన్నా బ్రేకప్ ఎపిసోడ్ తో ప్రారంభమౌతుంది. తర్వాత ఇల్లందు నేపథ్యంలో విజయ్ దేవరకొండ – ఐశ్వర్య రాజేష్ మధ్య వచ్చే ఎపిసోడ్ చూడడగానే సినిమాపై పిచ్చ క్యూరియాసిటీ ఏర్పడుతుంది. ఆ ఎపిసోడ్ వినోదాత్మకంగానూ, అదే సమయంలో హృదయానికి హత్తుకునే ఎమోషన్స్ తోనూ దర్శకుడు ఓ మధురమైన ఫీల్ తెప్పించాడు. సినిమా మొత్తం హీరోతో కలిపి మొత్తం ఐదుగురు పాత్రల చుట్టూ తిరుగుతుందన్న సంగతి అందరికీ ముందే అర్ధమైపోతుంది. ఇల్లెందు ఎపిసోడ్ సినిమాకే హైలైట్ గా నిలిచింది. దాని వల్ల ఫస్ట్ హాఫ్ మంచి ఫీలింగే ఇస్తుంది. కానీ ఇదే తరహాలో వచ్చే ప్యారిస్ ఎపిసోడ్ మాత్రం ప్రేక్షకుడి సహనాన్ని పరీక్షిస్తుంది. రాశీ ఖన్నాతో బ్రేకప్ ఎపిసోడ్ లో అతడి గెటప్ అర్జున్ రెడ్డి సినిమాలో గెటప్ ను గుర్తు చేస్తుంది. అంతకుముందు కాలేజ్ ఎపిసోడ్ లో యువకుడిగా విజయ్ మెప్పించాడు. ఏమాత్రం కనెక్ట్ కాలేని కథ వల్ల సెకండ్ హాఫ్ చిరాకుని తెప్పించడమే కాదు…. ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెడుతుంది. ఫస్ట్ హాఫ్ ఒకే ఒకే గా మరియు సెకండాఫ్ భారంగానే అనిపిస్తాయి తప్ప సినిమా చూసే ప్రేక్షకుడికి ఏమంత గొప్పగా అనిపించకపోవచ్చు. ఇక దర్శకుడు కె క్రాంతి మాధవ్ తన సినిమాలో పాత్రలకు ఇచ్చిన ఇంపార్టెన్స్ వారిపై నడిచే కథకు కూడా ఇచ్చి ఉంటే బాగుండేది. ఐతే దర్శకుడు క్రాంతి మాధవ్ కు అన్ని వనరులూ సమకూరినా వాటిని సరిగ్గా ఉపయోగించుకోలేకపోయాడు. విజయ్ లాంటి పెర్ఫామర్ ను అతను సరిగా ఉపయోగించుకోలేదు. అంతేకాకుండా నెమ్మదిగా సాగే కథనం అలాగే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ఎక్కువయ్యిపోవడం,ఎలాంటి ఎంటర్టైన్మెంట్ హంగులు లేకపోవడం వంటివి అన్ని సినిమాకి మెయిన్ మైనస్ లుగా నిలిచాయి.

సాంకేతికంగా..
ఇంతకు ముందు అద్భుతమైన ఆల్బమ్స్ ను ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ గోపీ సుందర్ ఈ సినిమాతో విజువల్ గా ఓకే అనిపిస్తాడు కానీ.. ఒక్కటి గుర్తుండిపోయే సాంగ్ లేదు. నేపథ్య సంగీతం కూడా సోసోగా అనిపిస్తుంది.జయకృష్ణ గుమ్మడి అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది, పాటల చిత్రీకరణలో మరింత బాగుంది. క్రియేటివ్ కమర్షియల్స్ సంస్థ నిర్మాణ విలువల విషయంలో రాజీ పడలేదు.

రేటింగ్: 2.0/5

Tags:    

Similar News