ప్రత్తిపాటి ఇలా చేతులెత్తేశారే…!!!

ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హవాకు తెలుగుదేశం పార్టీలో హేమాహేమీలుగా ముద్రపడ్డ నేతలు సైతం చేతులెత్తేశారు. కచ్చితంగా విజయం సాధిస్తారనుకున్న మంత్రులు సైతం దారుణంగా ఓటమి [more]

Update: 2019-06-01 14:30 GMT

ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హవాకు తెలుగుదేశం పార్టీలో హేమాహేమీలుగా ముద్రపడ్డ నేతలు సైతం చేతులెత్తేశారు. కచ్చితంగా విజయం సాధిస్తారనుకున్న మంత్రులు సైతం దారుణంగా ఓటమి పాలయ్యారు. తెలుగుదేశం పార్టీకి పట్టున్న జిల్లాలోనూ ఆ పార్టీ అభ్యర్థులకు పరాభవం తప్పలేదు. గుంటూరు జిల్లా చిలుకలూరిపేట నుంచి రెండుసార్లు గెలిచి చంద్రబాబు నాయుడు క్యాబినెట్ లో మంత్రిగా పనిచేసిన ప్రత్తిపాటి పుల్లారావు విజయంపై పూర్తి ధీమాగా ఉన్నారు. సీనియర్ నేత, అంగ, ఆర్థబలం ఉన్న నాయకులు కావడంతో ఆయన కచ్చితంగా గెలుస్తారని తెలుగుదేశం నేతలు లెక్కలు వేసుకున్నారు. అయితే, ఆయనపై రాజకీయాలకు కొత్త అయిన విడదల రజిని విజయం సాధించి సంచలనం సృష్టించారు. ఎవరూ ఊహించని విధంగా ఆమె ప్రత్తిపాటి పుల్లారావుపై 8,300 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

అనతికాలంలోనే రాజకీయంగా ఎదిగిన రజిని

రాజకీయ కుటుంబానికి చెందిన విడదల రజిని విదేశాల్లో ఉండి వచ్చారు. రాజకీయాలపై ఆసక్తితో తన స్వంత నియోజకవర్గం చిలుకలూరిపేటకు వచ్చిన ఆమె అనతికాలంలోనే బాగా గుర్తింపు తెచ్చి ఇప్పుడు ఏకంగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మొదట ఆమె తెలుగుదేశం పార్టీలో ప్రత్తిపాటి పుల్లారావు సహకారంతోనే చేరారు. ఆమెకు అక్కడ పెద్దగా ప్రాధాన్యత లేకపోవడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపించారు. దీంతో గత ఎన్నికల్లో ఇక్కడ పోటీ చేసి ఓడిన మర్రి రాజశేఖర్ ను తప్పించి మరీ జగన్ ఆమెను పార్టీలో చేర్చుకుని అభ్యర్థిగా ప్రకటించారు. ఏడాది క్రితమే ఆమె అభ్యర్థిత్వం ఖరారైంది. దీంతో అప్పటి నుంచే ఆమె ప్రజల్లోకి చొచ్చుకెళ్లింది. ఆమె కూడా ఆర్థికంగా బలంగా ఉండటం, కొత్త తరహా రాజకీయాలు చేయడంతో తక్కువ కాలంలోనే నియోజకవరంగంలో గుర్తింపు పొందారు. మొదట ఆమె అభ్యర్థి అనగానే తమ నేత విజయం సులువయ్యిందని ప్రత్తిపాటి పుల్లారావు అనుచరులు సంబరపడ్డారు.

ఏకంగా మంత్రినే ఓడించి…

కానీ, ఆమె రోజురోజుకూ మంత్రికి బలమైన ప్రత్యర్థిగా మారారు. అప్పటికే వైసీపీ నేతగా ఉన్న మర్రి రాజశేఖర్ సహకారం కూడా ఆమెకు లభించడంతో నియోజకవర్గంలో సత్తా చాటారు. దీంతో ప్రత్తిపాటి పుల్లారావు ఎన్నికల నాటికి గట్టి పోటీ ఎదురవుతుందని గుర్తించారు. ఇద్దరు అభ్యర్థులూ డబ్బులు కూడా పోటీ పడి మరీ ఖర్చు పెట్టారు. అయితే, స్వల్ప తేడాతో అయినా ఆయన గెలుస్తారనే అంచనాలు ఉండేవి. ఐదేళ్లుగా మంత్రిగా పనిచేసి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం ఆయనకు కలిసి వస్తుందని అంతా అనుకున్నారు. కానీ, బీసీ మహిళ కావడం, మంత్రికి అన్ని రకాలుగా గట్టి పోటీ ఇవ్వడంతో ఆమెను విజయం వరించింది. ముఖ్యంగా వైఎస్ జగన్ హవా ఉండటంతో ఆమె పోటీ చేసిన మొదటిసారే మంత్రిని ఓడించి సంచలన విజయం నమోదు చేశారు.

Tags:    

Similar News