Ycp : రజనీని ఆపేవాడెవ్వడూ లేడా?

మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ ద‌శాబ్దాలుగా కాంగ్రెస్‌, వైఎస్సార్‌, ఆ త‌ర్వాత జ‌గ‌న్‌, వైసీపీని న‌మ్ముకుని ఉన్నారు. గుంటూరు జిల్లా చిల‌క‌లూరిపేట రాజ‌కీయాల్లో మ‌ర్రి ఫ్యామిలీకి క్లీన్ ఇమేజ్ ఉంది. [more]

Update: 2021-11-13 14:30 GMT

మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ ద‌శాబ్దాలుగా కాంగ్రెస్‌, వైఎస్సార్‌, ఆ త‌ర్వాత జ‌గ‌న్‌, వైసీపీని న‌మ్ముకుని ఉన్నారు. గుంటూరు జిల్లా చిల‌క‌లూరిపేట రాజ‌కీయాల్లో మ‌ర్రి ఫ్యామిలీకి క్లీన్ ఇమేజ్ ఉంది. ఆయ‌న మామ దివంగ‌త సోమేప‌ల్లి సాంబ‌య్య కాంగ్రెస్ నుంచి అక్క‌డ ప‌లుమార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయ‌న మ‌ర‌ణాంత‌రం ఆయ‌న రాజ‌కీయ వార‌సుడిగా ఎంట్రీ ఇచ్చారు అల్లుడు మ‌ర్రి రాజ‌శేఖ‌ర్‌. 1999లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయ‌న ఆ త‌ర్వాత 2009లో కాంగ్రెస్ నుంచి ఓడిపోయారు. జ‌గ‌న్ పార్టీ పెట్టిన వెంట‌నే ఆయ‌న ఆపార్టీలో చేరిపోగా.. జ‌గ‌న్ ఆయ‌న‌కు జిల్లా పార్టీ ప‌గ్గాలు ఇచ్చారు. 2014లో వైసీపీ నుంచి పోటీ చేసి ప్రత్తిపాటి పుల్లారావు చేతిలో ఓడిపోయారు. అయినా ఐదేళ్ల పాటు చిల‌క‌లూరిపేట నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీని బ‌లోపేతం చేసుకుంటూ వ‌స్తున్నారు.

మంత్రిని చేస్తానని…

మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ కే పేట సీటు అనుకుంటోన్న టైంలో అనూహ్యంగా అప్ప‌టి వ‌ర‌కు టీడీపీలో ఉండి.. ప్ర‌త్తిపాటి పుల్లారావు శిష్యురాలిగా ఉన్న విడ‌ద‌ల ర‌జ‌నీ వైసీపీలోకి రావ‌డం ఆమెకు జ‌గ‌న్ సీటు ఇవ్వడం జ‌రిగిపోయాయి. గ‌త ఎన్నిక‌ల్లో ర‌జ‌నీ పేట ఎమ్మెల్యేగా గెలిచారు. సీటు వ‌ద‌లుకున్నందుకు జ‌గ‌న్ మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ ని ఎమ్మెల్సీని చేసి మంత్రిగా కేబినెట్లో త‌న ప‌క్కన కూర్చోపెట్టుకుంటాన‌ని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు దాటుతోంది. ఈ మ‌ధ్యలో ఎన్నోసార్లు ఎమ్మెల్సీలు భ‌ర్తీ చేశారు. ఊరుపేరు లేని అనామ‌కుల‌కు కూడా జ‌గ‌న్ ఎమ్మెల్సీ ప‌ద‌వులు ఇస్తున్నారు.

మొన్న పార్టీలో చేరిన వారికి…

గ‌త ఎన్నిక‌ల‌కు ముందు పార్టీలో చేరిన వారు.. గ‌త ఎన్నిక‌ల త‌ర్వాత పార్టీలు మారిన వారికి కూడా ఎమ్మెల్సీలు ఇచ్చారు. అయితే మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ కి ప్రతిసారి ఎమ్మెల్సీ వ‌స్తుంద‌న్న ప్రచార‌మే త‌ప్ప ఆయ‌న‌కు ప‌ద‌వి ఇవ్వలేదు. ఇటీవ‌ల జ‌గ‌న్ పింగ‌ళి వెంక‌య్య కుమార్తె ఇంటికి మాచ‌ర్ల వ‌చ్చిన సంద‌ర్భంగా లోక‌ల్ బాడీ కోటాలో అన్నా నీకు ఎమ్మెల్సీ ఇస్తాన‌ని చెప్పారు. మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ కూడా అదే న‌మ్మకంతో ఉన్నారు. అయితే ఈ సారి లిస్ట్‌లో మ‌ర్రి పేరు లేదు.

ఎదురు చూపులే….

మూడేళ్లుగా ఎదురు చూపులు చూస్తోన్న మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ కి మ‌రోసారి నిరాశ త‌ప్పలేదు. విచిత్రం ఏంటంటే కమ్మ వ‌ర్గం నుంచి కృష్ణా జిల్లాలో త‌ల‌శిల ర‌ఘురాం, ప్రకాశం నుంచి తూమాటి మాధ‌వ‌రావుకు ఎమ్మెల్సీ సీటు ఇచ్చారు. వారిద్దరికి మ‌ర్రితో పోలిస్తే ఏ మాత్రం రాజ‌కీయ అనుభ‌వం లేదు. ఇక తూమాటి మాధ‌వ‌రావు గ‌త ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర‌కు కందుకూరు ఇన్‌చార్జ్‌గా ఉన్నారు. ఇక కృష్ణా, ప్రకాశంలో క‌మ్మల‌కు సీట్లు ఇచ్చినందున మ‌ధ్యలో గుంటూరులో కూడా క‌మ్మల‌కు సీటు ఇవ్వడం కుద‌ర‌ద‌ని చెప్పి మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ ని సైడ్ చేసేశారు.

లాబీయింగ్ పనిచేసిందా?

మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ కి ప‌ద‌వి విష‌యంలో ముందు నుంచి ఎమ్మెల్యే విడదల ర‌జ‌నీ అడ్డుత‌గులుతోంద‌న్న టాక్ ఉంది. ఇప్పుడు కూడా ఆమె బ‌ల‌మైన లాబీయింగ్‌తోనే మ‌ర్రిని పక్క‌న పెట్టేశార‌ని అంటున్నారు. ఏదేమైనా జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చాక క‌మ్మల‌కు అన్యాయం జ‌రుగుతుంద‌న్న వాద‌న ఏమోగాని వైసీపీని, జ‌గ‌న్ ను ముందు నుంచి న‌మ్ముకుని ఉన్న మ‌ర్రి రాజ‌శేఖ‌ర్‌కు మాత్రం తీవ్రమైన అన్యాయం జ‌రిగింద‌న్న టాక్ వినిపిస్తోంది.

Tags:    

Similar News