ఆనం అసెంబ్లీలో అడుగుపెడ‌తారా..?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ఓ వర్గాన్ని కలిగిన దివంగత మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి ప్రాతినిథ్యం వహించిన నియోజకవర్గం నెల్లూరు జిల్లా వెంకటగిరి. దక్షిణ [more]

Update: 2019-02-08 01:30 GMT

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ఓ వర్గాన్ని కలిగిన దివంగత మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి ప్రాతినిథ్యం వహించిన నియోజకవర్గం నెల్లూరు జిల్లా వెంకటగిరి. దక్షిణ భారతదేశంలో వెంకటగిరి చీర‌లకు ఉన్న ప్రత్యేకత చెప్పక్కర్లేదు. అలాగే వెంకటగిరి అనగా మనకు గుర్తు వచ్చేది పెంచలకోన నృసింహస్వామి ఆలయంతో పాటు వెంకటగిరి కోట. నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి తర్వాత ఆయన భార్య నేదురుమల్లి రాజ్యలక్ష్మీ సైతం ఇక్కడ నుంచి 1999, 2004 ఎన్నికల్లో వరసగా రెండు సార్లు విజయం సాధించి నాటి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి క్యాబినెట్‌లో విద్యాశాఖ మంత్రిగా కూడా పని చేశారు. 2009లో వెంకటగిరి నుంచి తొలిసారి అసెంబ్లీకి పోటీ చేసిన కురుగొండ్ల రామకృష్ణ ఎంట్రీతో అక్కడ నుంచి ఆయన హవా ప్రారంభం అయ్యింది. గత రెండు ఎన్నికల్లోనూ ఆయన ఇక్కడ వరుస విజయాలు సాధిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో మూడోసారి పోటీకి రెడీ అవుతున్న రామకృష్ణ హ్యాట్రిక్‌ కొడతానన్న ధీమాతో ఉన్నారు. ఒకప్పుడు ఇక్కడ టీడీపీ తరపున పోటీ చేసేందుకు బలమైన అభ్యర్థి లేని టైమ్‌లో ఎంట్రీ ఇచ్చిన రామకృష్ణ రెండుసార్లు వరుస విజయాలతో వెంకటగిరిలో టీడీపీకి ఎదురు లేదని నిరూపించారు.

వైసీపీ నుంచి బరిలో ఆనం…

అదే టైమ్‌లో మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి రాకకు ముందు వరకు వెంకటగిరి వైసీపీ కూడా పడుతూ లేస్తూ వస్తోంది. గత ఎన్నికల్లో ఆత్మకూరుకు చెందిన మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మ‌య్య నాయుడు ఇక్కడ వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆయన తిరిగి టీడీపీలోకి వెళ్లిపోయాక జగన్‌ వెంకటగిరి పార్టీ బాధ్యతలను జడ్పీ చైర్మ‌న్‌ బొమ్మిరెడ్డి రాఘవరెడ్డికి అప్పగించారు. వచ్చే ఎన్నికల్లో ఆయన ఇక్కడ నుంచి పోటీ చేసేందుకు ఏర్పాట్లు సైతం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆనం రామనారాయణరెడ్డి టీడీపీ నుంచి వైసీపీలోకి రావడంతో ఆయనకు వెంకటగిరి పగ్గాలు ఇవ్వడంతో బొమ్మిరెడ్డి టీడీపీలోకి జంప్‌ చేసేశారు. ఆనం వ్యక్తిగా బలమైన నేతే అయినా వెంకటగిరి ఆయనకు కొత్త. గతంలో ఆయన రాపూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు ఉన్న కొన్ని ప్రాంతాలు ఇప్పుడు వెంకటగిరిలో ఉండడం మాత్రం ఆయనకు కలిసివచ్చే అంశమే. ఇక టీడీపీ ఎమ్మెల్యే రామకృష్ణ వరుసగా రెండు సార్లు గెలవడం… గత నాలుగేళ్లలో పార్టీ అధికారంలో ఉండడంతో కొన్ని అభివృద్ధి పనులు చేపట్టినా దూకుడుగా ఉంటారన్న ఆపవాదు ఆయనపై ఉంది.

ద్విముఖ పోరులో గట్టెక్కెదెవరు..?

అదే సమయంలో మున్సిపల్ చైర్మ‌న్‌ దొంతు శారదకు, రామకృష్ణకు అస్సల పొసగ‌ని పరిస్థితి. దీనిపై అధిష్టానం వారిద్దరి మధ్య‌ సద్దుబాటు చేసేందుకు ప్రయత్నాలు చేసినా అవి సక్సెస్‌ అయినట్టు కనిపించడం లేదు. ఈ క్రమంలోనే ఆమె వైసీపీ వైపు చూస్తున్నారన్న ఊహాగానాలు కూడా ఉన్నాయి. నియోజకవర్గంలో అభివృద్ధి, కార్యకర్తలకు అందుబాటులో ఉండడంతో మరోసారి టీడీపీ నుంచి ఆయనకే ఛాన్స్‌ దక్కనుంది. ఇక వైసీపీ నుంచి కొద్ది రోజుల క్రితం ఆ పార్టీలో చేరిన నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి తనయుడు నేదురుమల్లి రాంకుమార్‌రెడ్డి సైతం సీటు ఆశిస్తున్నా ఫైన‌ల్‌గా సీటు ఆనందే. అయితే నెల్లూరు జిల్లాలో ఈ రెండు కుటుంబాల మధ్య‌ ఉన్న వైరం నేపథ్యంలో రాంకుమార్‌ రెడ్డి.. ఆనంకు సపోర్ట్‌ చేస్తారా ? లేదా అన్నది ఎవరికి అంతుపట్టడం లేదు. తన నియోజకవర్గంలో ఆనం పోటీ చేస్తే రాంకుమార్‌ రెడ్డి ఫ్యూచర్‌ ఏంటన్నది సస్పెన్స్‌ గానే ఉంది. ఇక కొత్తగా పోటీ చేస్తున్న జనసేన ప్రభావం ప్రస్తుతానికి అయితే నియోజకవర్గంలో లేదు. రెండు ప్రధాన సామాజికవర్గాలకు చెందిన వారు రెండు ప్రధాన పార్టీల తరపున పోటీ చేస్తున్నా నియోజకవర్గంలో అధిక సంఖ్యలో ఉన్న బీసీ ఓటర్లే ఇక్కడ గెలుపోటములను డిసైడ్‌ చేస్తారు. ఏదేమైనా రెండు పార్టీల్లోనూ ఇద్దరు బలమైన వ్యక్తులు ఇక్కడ రంగంలో ఉండడంతో వెంకటగిరి రాజకీయం ఈసారి చాలా హాట్‌గా ఉండనుంది. ఇక్కడ ఎవరు గెలిచినా మెజారిటీ స్వల్పంగానే ఉంటుందన్నది రాజకీయ వర్గాల అంచనా.

Tags:    

Similar News