అయ్యో .. వెంక‌య్యా.. న‌లిగిపోతున్నారా…?

రాజ్యస‌భ చైర్మన్‌, ఉప‌రాష్ట్రప‌తి వెంక‌య్య నాయుడు.. ప్రధాని మోడీ తీసుకుంటున్న నిర్ణయాల‌తో ఇరుకున‌ప‌డుతున్నారా ? ద‌క్షిణాదికి చెందిన నాయ‌కుడిగా.. ఉత్తమ పార్లమెంటేరియ‌న్‌గా ఉన్న వెంక‌య్య .. మోడీ [more]

Update: 2020-09-23 16:30 GMT

రాజ్యస‌భ చైర్మన్‌, ఉప‌రాష్ట్రప‌తి వెంక‌య్య నాయుడు.. ప్రధాని మోడీ తీసుకుంటున్న నిర్ణయాల‌తో ఇరుకున‌ప‌డుతున్నారా ? ద‌క్షిణాదికి చెందిన నాయ‌కుడిగా.. ఉత్తమ పార్లమెంటేరియ‌న్‌గా ఉన్న వెంక‌య్య .. మోడీ నిర్ణయాల‌ను కాద‌నలేక‌.. స‌భ‌లో ఎదుర‌వుతున్న వ్యతిరేక‌త‌ను త‌ట్టుకోలేక‌.. వివ‌ర‌ణ ఇచ్చుకోల‌క స‌త‌మ‌తం అవుతున్నారా ? అంటే.. తాజాగా జ‌రుగుతున్న ప‌రిణామాల‌పై జాతీయ మీడియా వెల్లడిస్తున్న స‌మాచారం మేర‌కు ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. తెలుగు వాడైన వెంక‌య్యనాయుడు మృదు స్వభావిగా పేరు తెచ్చుకున్నారు. ఈ క్రమంలో ఆయ‌న ఎవ‌రికీ శ‌త్రువుకాదు.. అయితే, మోడీ విధానాల‌తో ఆయ‌న కాంగ్రెస్ స‌హా అనేక ప‌క్షాల‌కు ఇప్పుడు కొర‌క‌రాని కొయ్యగా మారుతున్నార‌ట‌.

వ్యవసాయ బిల్లుల విషయంపై….

తాజాగా కేంద్ర ప్రభుత్వం వ్యవ‌సాయ బిల్లును తీసుకువ‌చ్చింది. దీనిని ప్రతిప‌క్షాలు తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నాయి. మోడీ అంటే అంతో ఇంతో ప్రేమ ఉన్న టీడీపీ కూడా ఈ బిల్లును వ్యతిరేకించింది. ఇక‌, తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించాల‌ని అసెంబ్లీలోనే తీర్మానం చేశారు. దీనిని తేనెపూసిన క‌త్తిగా ఆయ‌న అభివ‌ర్ణించారు.ఈ క్రమంలో ఈ బిల్లు.. బీజేపీ బ‌లం ఎక్కువ‌గా ఉన్న లోక్‌స‌భ‌లో ఆమోదం పొందినా.. బీజేపీకి బ‌లం లేని రాజ్యస‌భ‌లో మాత్రం ఒకింత ఎదురుగాలిని భ‌రించాల్సి వ‌స్తోంది. దీనిని ఆమోదించే బాధ్యత‌ను ప్రధాని మోడీ స‌హా.. బీజేపీ నేత‌లు వెంక‌య్య నాయుడిపై పెట్టారు. ఇది ఆయ‌న‌కు సుత‌రామూ ఇష్టం లేదు.

పైకి చెప్పుకోలేక…..

ఆది నుంచి కూడా తాను వ్యవ‌సాయ కుటుంబం నుంచి వ‌చ్చాన‌ని, రైతుల ప‌క్షపాతిన‌ని చెప్పుకొనే వెంక‌య్యనాయుడుకు నిజంగానే ఈ బిల్లులోని లోపాలు ఇబ్బందిక‌రంగానే ఉన్నాయి. అలాగ‌ని ఆయ‌న పైకి చెప్పలేరు. ఈ క్రమంలో రాజ్యస‌భ‌లో ర‌గ‌డ చోటు చేసుకుంటుంద‌నే విష‌యం ఆయ‌న‌కు తెలియంది కూడా కాదు. ఈ క్రమంలోనే ఆయ‌న న‌లిగిపోతున్నారు. తాజాగా 8 మంది స‌భ్యుల‌ను ఆయ‌న స‌స్పెండ్ చేశారు. ఇది మ‌రింత‌గా వెంక‌య్యను ఇబ్బందిలోకి నెట్టింది. “మీరు కూడా వ్యవ‌సాయ కుటుంబం నుంచి వ‌చ్చారు. మీరు ఈ బిల్లును స‌మ‌ర్ధిస్తారా? “ అన్న ప్రతిప‌క్ష నేత‌ల‌కు ఆయ‌న స‌మాధానం చెప్పుకోలేక పోయారు. మొత్తంగా.. తెలుగు వాడైన కార‌ణంగా.. ద‌క్షిణాదిలో బీజేపీకి బ‌లం లేద‌న్న కార‌ణంగా.. ఏదైనా వ్యతిరేక‌త వ‌చ్చినా.. దానిని వెంక‌య్యే చూసుకుంటార‌నే కార‌ణంగా మోడీ వ్యవ‌హ‌రిస్తున్న తీరు.. నిజంగానే వెంక‌య్యనాయుడిని ఇబ్బంది పెడుతోంద‌ని అంటున్నారు మేధావులు. ఇదే విష‌యాన్ని జాతీయ మీడియా కూడా స్పష్టం చేసింది. దీంతో అయ్యో వెంక‌య్యా అనేవారు పెరుగుతున్నారు.

Tags:    

Similar News