వెంకయ్యతో దోస్తీకి లింక్ దొరికిందా ?

ముప్పవరపు వెంకయ్యనాయుడు. భారత ఉప రాష్ట్రపతి. దానికి ముందు దేశంలో వివిధ పదవులు నిర్వహించిన ఘనాపాటి. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు సంబంధించినంతవరకూ ఆయన అత్యంత కీలకమైన నేతగా [more]

Update: 2020-05-09 14:30 GMT

ముప్పవరపు వెంకయ్యనాయుడు. భారత ఉప రాష్ట్రపతి. దానికి ముందు దేశంలో వివిధ పదవులు నిర్వహించిన ఘనాపాటి. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు సంబంధించినంతవరకూ ఆయన అత్యంత కీలకమైన నేతగా చెప్పుకోవాలి. ఆయన రాజ్యాంగబధ్ధ పదవిలో ఉన్నా కూడా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వ్యవహారం అయితే చాలా తొందరంగా స్పందిస్తారు, సానుకూలం చేస్తారు. వెంకయ్యనాయుడు అక్కడ ఉంటే చాలు ఏపీకి కొండంత అండ అని అంతా భావిస్తారు. తెలుగుదేశం అయిదేళ్ళ పాలనలో వెంకయ్యనాయుడు కేంద్ర స్థాయిలో గట్టి భరోసా ఇచ్చి మరీ ఎంతో సాయం చేశారు. విభజనతో నాడు పుట్టెడు కష్టాలతో ఉన్న ఏపీని ఒడ్డున పడేయడంతో ఆయన తన వంతు భూమికను బాధ్యతగా నిర్వహించారు.

వైసీపీతో….

ఇక ఏపీలో విపక్ష నేతగా జగన్ ఉన్నపుడు ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో వెంకయ్యనాయుడుకు అనుకూలంగానే తన పార్టీతో ఓటు చేయించారు. ఆనాడు అదొక సానుకూల అంశంగానే అంతా చూశారు. ఆ తరువాత జగన్ ముఖ్యమంత్రి అయిన కొత్తల్లో వెంకయ్యనాయుడుని ఒకసారి మర్యాదపూర్వకంగా కలిశారు. ఇక ఏపీలోని ప్రభుత్వ పాఠశాల్లో ఆంగ్ల బాష మాధ్యమాన్ని ప్రవేశపెడతామని వైసీపీ సర్కార్ నిర్ణయం తీసుకున్నపుడు తెలుగు భాష తప్పనిసరిగా డాలని వెంకయ్య సూచన చేశారు. దాని మీద ముఖ్యమంత్రి స్థాయిలో జగన్ కొంత చికాకు ప్రదర్శించారు. వెంకయ్యకు నేరుగానె రిటార్ట్ ఇచ్చారు. మీ పిల్లలు, మనవళ్లు ఇంగ్లీష్ మీడియంలో చదవడంలేదా అంటూ చురకలు అంటించారు.

జగన్ భేష్ ……

ఇక వెంకయ్యనాయుడు రాజకీయాలకు దూరంగా ఉన్నా కూడా వైసీపీ ఎందుకో ఆయనతో సానుకూల వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోలేకపోయింది. అయితే ఇటీవల కరోనా వైరస్ దేశంలో విలయతాండవం చేస్తున్న సమయంలో ఏపీ ప్రభుత్వం కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యల గురించి వెంకయ్యనాయుడు స్వయంగా మెచ్చుకోవడం అందరి దృష్టిని ఆకట్టుకుంది. సౌత్ కొరియా నుంచి తెప్పించిన రాపిడ్ కిట్స్ మంచి నిర్ణయం, కరోనా కట్టడికి సత్ఫలితాలు ఇస్తుందని వెంకయ్యనాయుడు అనడంతో టీడీపీ, బీజేపీ లాంటి పార్టీలు కొంత తగ్గాల్సివచ్చింది.

భూమనతో బంధం….

ఇదిలా ఉండగా కరోనా వేళ తన మిత్రులు, సీనియర్ నేతలను ప్రతీ రోజూ ఫోన్ ద్వారా పలకరిస్తూ వారి ఆరోగ్యం గురించి వాకబు చేస్తున్న వెంకయ్యనాయుడు చిత్రంగా వైసీపీ ఎమ్మెల్యే, జగన్ కి బంధువు కూడా అయిన భూమన కరుణాకరెడ్డికి తాజాగా ఫోన్ చేశారు. ఈ ఇద్దరూ కొంతసేపు మాట్లాడుకోవడం సంచలనం అయింది. ఈ పరిచయం ఎక్కడిది, ఎలా జరిగింది అన్న చర్చ కూడా వచ్చింది. అయితే భూమన కరుణాకర్ రెడ్డి 1975 టైంలో ఎమర్జెన్సీ సమయంలో పోరాటం చేసి జైలుకు వెళ్లారు. ఆయన, వెంకయ్యనాయుడు అప్పట్లో హైదరాబాద్ లోని జైలులో సహచరులట. ఆ బంధం తరువాత కాలంలో కూడా కొనసాగుతూ వచ్చిందట. అయితే ఇపుడు అది బయటపడింది.

మేలు చేసేనా…?

మొత్తానికి వెంకయ్యనాయుడుతో మంచి సన్నిహిత సంబంధాలు ఉన్న కీలక నేత ఒకరు వైసీపీలో ఉండడం రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీస్తోంది. ఇటు జగన్ కి భూమన సన్నిహితుడు కావడంతో రానున్న రోజులో వైసీపీ వెంకయ్యనాయుడుతో మరింత గట్టి బంధం పెనవేసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. రాష్ట్రంలోని పరిస్థితులూ పట్ల పూర్తి అవగాహన ఉన్న వెంకయ్యనాయుడు ఏపీకి తగినంత సాయం చేయగలరని తద్వారా అది అన్ని వైపులా మంచి మేలు చేస్తుందని అంతా భావిస్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Tags:    

Similar News