వెంకయ్యకు అసలైన అగ్ని పరీక్ష

సాధారణ కార్యకర్త స్థాయి నుంచి దేశానికి రెండవ అత్యున్నత పదవి అయిన ఉపరాష్ట్రపతి దాకా ముప్పవరపు వెంకయ్య నాయుడు ఎదిగారు. వెంకయ్య తన రాజకీయ జీవితంలో ఎన్నో [more]

Update: 2019-06-22 12:30 GMT

సాధారణ కార్యకర్త స్థాయి నుంచి దేశానికి రెండవ అత్యున్నత పదవి అయిన ఉపరాష్ట్రపతి దాకా ముప్పవరపు వెంకయ్య నాయుడు ఎదిగారు. వెంకయ్య తన రాజకీయ జీవితంలో ఎన్నో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నారు. అదే విధంగా ఆయన రాజకీయ జీవితంలోనూ అనేక కష్త నిష్టూరాలు భరించారు. ఇక బీజేపీకి జాతీయ అధ్యక్షుడిగా కూడా ఆయన వెలుగు వెలిగారు. ఇన్ని బాధ్యతలను విజయవంతంగా నిభాయించిన వెంకయ్య నాయుడు కు ఇప్పుడు అసలైన అగ్ని పరీక్ష ఎదురవుతోంది. ఆయన చైర్మన్ గా ఉన్న రాజ్యసభలో టీడీపీకి చెందిన నలుగురు ఎంపీలు ఫిరాయించారు. వారంతా కలసి తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీనే ఏకంగా బీజేపీలో విలీనం చేసేశారు. దీనికి సంబంధించిన లెటర్ ని వెంకయ్య నాయుడు కే ఇచ్చారు. అదే సమయంలో బీజేపే జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా కూడా ఈ విలీనాన్ని ఆమోదిస్తున్నట్లుగా తీర్మానించిన లేఖను వెంకయ్య చేతిలో పెట్టారు. ఓ విధంగా అంతా కూడబలుక్కుని పక్కా ప్లాన్ ప్రకారం తయారు చేసిన రెండు లెటర్లను వెంకయ్యకు ఇచ్చేసి ఫిరాయింపు కంపును ఇంపుగా సొంపుగా తీర్చిదిద్ద‌మన్నారు. మరి ఈ సమయంలో వెంకయ్య నాయుడు ఏం చేస్తారు. ఏం చేయబోతున్నారు.

ఫిరాయింపులపై వెంకయ్య ఘాటు వ్యాఖ్యలు :

ఇదిలా ఉండగా వెంకయ్య నాయుడు ఫిరాయింపులపై ఈ మధ్యనే ఘాటు వ్యాఖ్యలు చేశారు. . నీతి నిజాయతి, రాజకీయాల్లో విలువలు గురించి ఆయన చాలా గొప్పగా చెప్పారు. ఎవరైనా పార్టీ మారితే మూడు నెలల్లోనే సభ్యత్వం కోల్పోయేలా చట్టం చేయాలని పలు చోట్ల మేధావుల సభల్లో వెంకయ్య గట్టిగా నొక్కి వక్కాణించారు. అసలు ఇదంతా కాదు. పార్టీ మారితే తక్షణం ఆ సభ్యుడు తన పదవి కోల్పోయేలా చర్యలు తీసుకోవాలని కూడా సూచించారు. చెప్పేటపుడు అన్నీ బాగానే ఉంటాయి కానీ, ఇపుడు బంతి వచ్చి వెంకయ్య కోర్టులోకి వచ్చి పడింది. వెంకయ్యే చెప్పినట్లుగా ఇపుడు వాళ్ళ పదవులు పోవాలి కదా ? వాళ్ళపై వెంకయ్య ఫిరాయింపుల నిరోధక వేటు వేయాలి కదా ? ఫిరాయించిన వాళ్ళంతా రాజ్యసభ సభ్యులే కాబట్టి రాజ్యసభ ఛైర్మన్ హోదాలో వెంకయ్యే వాళ్ళపై నేరుగా వేటు వేసేయొచ్చు. మరి వెంకయ్య నాయుడు గారు ఇపుడు ఆ పని చేయగలుగుతారా.

కోడెల ఎపిసోడ్ రిపీట్ :

ఏపీలో ఒకానొక స్పీకర్ ఉండేవారు. ఆయన పేరు కోడెల శివప్రసాదరావు అని ఇపుడు చరిత్రలో కధలు చెప్పుకునే పరిస్థితి ఉంది. అత్యున్నతమైన రాజ్యాంగ పదవిని కట్టబెడితే 23 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినా మౌనంగా కూర్చున్న కోడెల ఓ విధంగా అభాసుపాలు అయ్యారు. మరి వెంకయ్య నాయుడు ఏ దారిలో నడుస్తారు. నిజానికి ఎవరెన్ని కబుర్లు చెప్పినా నలుగురు టీడీపీ ఎంపీలు పార్టీ గీత దాటారు. ఫిరాయించేశారు. ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం వారి మీద చర్యలు తీసుకుంటే పదవులు అక్కడికక్కడనే పోవడం ఖాయం. మరి వెంకయ్య నాయుడు తాను చెప్పిన నీతిని కచ్చితంగా అమలు చేయగలరా. నిజానికి ఈ ఫిరాయింపులకు సూత్రధారులు బీజేపీ పెద్దలు. వారిని కాదని వెంకయ్య రాజ్యసభ చైర్మన్ గా తన సత్తా చాటగలరా. ఆలా చేస్తే ఆయన చరిత్రలో గొప్ప నాయకుడుగా మిగిలిపోతారు. మరి వెంకయ్య ఈ అగ్నిపరీక్షను ఎలా ఎదుర్కొంటారో చూడాలి.

Tags:    

Similar News