ఆయన చేతులమీదే సమాధి చేసే ప్రయత్నం ?

భారత ఉపరాష్ట్రపతి సీనియర్ పార్లమెంటేరియన్ ఎం వెంకయ్యనాయుడు గతంలో ఎన్నడు లేని అగ్నిపరీక్షను జీవితంలో ఎదుర్కొంటున్నారు. రాజ్యసభలో నలుగురు టిడిపి ఎంపిలను పార్టీ ఫిరాయింపుల అక్రమాన్ని సక్రమంగా [more]

Update: 2019-06-21 08:30 GMT

భారత ఉపరాష్ట్రపతి సీనియర్ పార్లమెంటేరియన్ ఎం వెంకయ్యనాయుడు గతంలో ఎన్నడు లేని అగ్నిపరీక్షను జీవితంలో ఎదుర్కొంటున్నారు. రాజ్యసభలో నలుగురు టిడిపి ఎంపిలను పార్టీ ఫిరాయింపుల అక్రమాన్ని సక్రమంగా మార్చేందుకు వెంకయ్యనాయుడు సిద్ధపడక తప్పని పరిస్థితి విషమ పరీక్షనే ఆయనకు పెట్టింది. ఇప్పటికే ఆయన గొంతు నొక్కి ఇష్టం లేని పదవిలో కుర్చోపెట్టిన మోడీ, షా ద్వయం నాయుడు చేతుల మీదే టిడిపి పతనానికి మమ అనేలా రూపొందించిన వ్యూహం అటు సొంత పార్టీలోనూ తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశం అయ్యింది. వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతి కాకముందు ఆయనపై టిడిపి నీడ అనే ముద్ర బలంగా వుంది. నాయుడు లు ఇద్దరు ఒకే సామాజికవర్గం కావడంతో ఈ ప్రచారం బాగానే ముందుకు పోయింది కూడా. దీనికి తోడు కీలక సమయాల్లో చంద్రబాబు ను వెంకయ్యనాయుడు కాపాడుతూ వచ్చిన సందర్భాలు రాజకీయాలపై ఆసక్తి వున్నవారికి తేటతెల్లం అయ్యేవి.

పార్టీని ఎదగనివ్వని పాపం ఆయనదే అనే భావనలో కమలం శ్రేణులు .

ఏ చేతుల మీద అయితే ఆయన పసుపు పార్టీని కాపాడుతూ వచ్చారో ఆ చేతుల మీదే ఆ పార్టీని సమాధికట్టే ప్రయత్నాలకు మోడీ, షా ద్వయం వ్యూహం రూపొందించారా ? అవుననే చెబుతున్నాయి ఎపి కమలం శ్రేణులు. కాంగ్రెస్ కి ప్రత్యామ్నాయంగా బిజెపి ఎదుగుదలకు అవకాశం వున్నా గతంలో ఎన్టీఆర్ సర్కార్ కి లోపాయికారి సహకారం అందించడంతో పార్టీ అభివృద్ధి ఆగిపోయి ఆయన మాత్రం రాజకీయంగా ఎదుగుతూ సాగారన్నది ఆ పార్టీలో అంతర్గతంగా వున్న వేదన. చివరికి కాంగ్రెస్ నాదెండ్ల భాస్కర రావు రూపంలో టిడిపిని చీల్చిన సమయంలో బిజెపి కి ప్రత్యామ్నాయ శక్తిగా అవతరించే అవకాశాన్ని వదులుకుని ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో ఎన్టీఆర్ తో పోరాటం చేయించడంలో, చంద్రబాబు ను తదుపరి నాయకుడిగా టిడిపి లో చేసేందుకు తనవంతు సలహాలు, సూచనలు చేయడం వంటివి వెంకయ్యనాయుడు చేసాడు అంటున్నారు.

బాబుకు అండగా అధికార మార్పిడికి ….

ఎన్టీఆర్ కు నాదెండ్ల వెన్నుపోటు పై తనవంతు సహకారాన్ని అందించిన వెంకయ్యనాయుడు అదే 1995 లో చంద్రబాబు వెన్నుపోటు పై మౌనం వహించారు. ఏపీలో బిజెపి అంటే వెంకయ్యనాయుడు … వెంకయ్యనాయుడు అంటే బిజెపి అనే స్థాయిలో దశాబ్దాలుగా పార్టీని నడిపించారు. జాతీయ స్థాయిలో చక్రం తిప్పే ఆయన సొంత రాష్ట్రంలో మాత్రం పార్టీని గ్రామ స్థాయిలో పటిష్టం చేయలేకపోయారని విమర్శలు ఎదుర్కొన్నారు. 96, 98 లలో వాజపేయి గాలిని సైతం వినియోగించుకుని ఆయన పార్టీని ఏపీలో పునాదులు బలంగా వేసే సమయంలోను టిడిపి తో పొత్తు పెట్టుకునేలా చేసి సొంత పార్టీ కి దెబ్బ కొట్టారని కారణం బాబు తో వున్న స్నేహమే అన్నది కమలం లో ఆయన శత్రువుల మాట. ఆ తరువాత 2014 లోను మోడీ హవాలో సొంతంగా బిజెపి మరోసారి ఎదిగే అవకాశాలకు చెక్ పెట్టేలా టిడిపి తో పొత్తు లో ఆయన కీ రోల్ వహించడాన్ని ఇప్పటికి కార్యకర్తలు సహించలేక పోతు వుంటారు. చివరికి బాబు ఓటుకు నోటు కేసులో బుక్ అయితే ఇద్దరు చంద్రుల రాజీ వెనుక ఆయనే మంత్రాంగం నడిపారన్న అపవాదు ఎదుర్కొన్నారు.

ఆయన ఇప్పుడు ఏమి చేస్తారు …?

టిడిపి గాడ్ ఫాథర్ గా ఒకప్పుడు బిజెపి అగ్రనేతగా వున్న వెంకయ్యనాయుడు ఇప్పుడు ఉపరాష్ట్రపతి. ప్రత్యర్థులపై తన మాటల దాడితో సమ్మోహితుల్ని చేసే ఆయనకు మాట్లాడే అవకాశం లేకుండా అందరిచేత మాట్లాడించే ఉద్యోగం ఇచ్చారు మోడీ అమిత్ షా లు. దాంతో ఆయన చేతులు కాళ్ళు కట్టేసినట్లే అయ్యిందన్నది కమలం క్యాడర్ టాక్. వెంకయ్యనాయుడు పై ఎన్ని విమర్శలు వున్నా రాజకీయాల్లో విలువలకు కట్టుబడి ఒకే పార్టీ లో వుంటూ నిబద్ధత కలిగిన నేతగా అందరు అభినందిస్తారు. ఇటీవల ఫిరాయింపుల కు సంబంధించి జెడియు నేత శరత్ యాదవ్ ను ఒక్క వేటు తో అనర్హత విధించారు. తాజాగా టిడిపి రాజ్యసభ సభ్యులు వాస్తవానికి పార్టీని విలీనం చేసెయ్యడం పూర్తి రాజ్యాంగ విరుద్ధం. పదవీ 1985 పార్టీ ఫిరాయింపుల చట్టం స్పష్టంగా చెప్పింది రాజకీయ పార్టీలో చీలిక వస్తే 2/3 వంతు వున్న వారిపై అనర్హత వేటు వెయ్యఖ్ఖర్లేదని స్పష్టంగా పేర్కొంది. దాని ప్రకారం టిడిపిలో ఇప్పుడు పార్టీ చీలిక లేదు. కేవలం రాజ్యసభ పక్షంలో వున్న సభ్యుల్లోనే చీలిక. అది ఎట్టిపరిస్థితుల్లో పార్టీ చీలిక కాదు. ప్రస్తుతం తెలంగాణ స్పీకర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు తమ పార్టీని గులాబీ పార్టీలో విలీనం చేయడానికి అనుసరించిన విధానాన్ని కేంద్ర బిజెపి అనుసరించింది. ఇప్పుడు ఉపరాష్ట్రపతి గా పార్టీలకు అతీతంగా వున్నా రాజ్యసభ ఛైర్మెన్ గా స్వేచ్ఛగా తన నిర్ణయం ప్రకటించే ఛాన్స్ వున్నా, మోడీ, షా లను కాదని ఆయన ఏమి చేయరన్నది విశ్లేషకుల వాదన. అదే జరిగితే వెంకయ్యనాయుడు రాజకీయ జీవితంలో మరో మాయని మచ్చ ఖాయం అంటున్నారు రాజకీయ పండితులు. మరి దీనినుంచి ఆయన బయటపడతారా లేక నమో నమామి అని తాను ఏపీలో పెంచి పోషించిన పార్టీ అంతానికి శంకుస్థాపన చేస్తారా అన్నది చూడాలి.

Tags:    

Similar News