వెల్లంపల్లిలో ఆ భయం ఉందా?

తొలిసారి మంత్రి పదవి చేపట్టారు వెల్లంపల్లి శ్రీనివాస్. నిజానికి ఆయనకు మంత్రి పదవి అనూహ్యంగానే వచ్చిందని చెప్పాలి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి రెండోసారి గెలిచిన వెల్లంపల్లి [more]

Update: 2020-09-24 11:00 GMT

తొలిసారి మంత్రి పదవి చేపట్టారు వెల్లంపల్లి శ్రీనివాస్. నిజానికి ఆయనకు మంత్రి పదవి అనూహ్యంగానే వచ్చిందని చెప్పాలి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి రెండోసారి గెలిచిన వెల్లంపల్లి శ్రీనివాస్ దాదాపు అన్ని పార్టీలూ మారిపోయారు. ఎన్నికల సమయంలో వైసీపీలో చేరి టిక్కెట్ దక్కించుకుని చివరకు మంత్రి పదవి కూడా దక్కించుకున్నారు. సామాజిక వర్గాల కోణంలోవెల్లంపల్లి శ్రీనివాస్ కు తొలి దశలోనే మంత్రిపదవి వరించింది.

అనూహ్యంగా దక్కిన……

నిజానికి ఈ సామాజికవర్గంలో పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన కోలగట్ల వీరభద్ర స్వామి ఉన్నారు. అయితే విజయనగరం జిల్లా కావడం, అక్కడ ఈక్వేషన్లు సాధ్యం కాకపోవడంతో వెల్లంపల్లి శ్రీనివాస్ కు మంత్రిపదవి దక్కింది. ఆయనకు దేవాదాయ శాఖ మంత్రి బాధ్యతలను చేపట్టారు. అయితే మంత్రిగా బాధ్యతలను చేపట్టిన నాటి నుంచే రాష్ట్రంలో అనేక వివాదాలు చోటు చేసుకోవడం మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కు ఇబ్బందిగా మారింది.

తొలి నుంచీ అంతే…..

నిజానికి వైసీపీ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే టీటీడీ బస్సుల్లో అన్యమత ప్రచారం వెలుగు చూసింది. తర్వాత నెల్లూరు జిల్లాలో రధం దగ్దం అయింది. ఇక తాజాగా అంతర్వేది రధం దగ్దం కావడం ఒక ఎత్తయితే తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న దుర్గగుడి రధంలోని వెండి సింహాలు మాయం కావడం మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రతిష్టను దెబ్బతీసిందనే చెప్పాలి. మంత్రిపదవికి రాజీనామా చేయాలన్న డిమాండ్లు విపక్షాల నుంచి విన్పిస్తున్నాయి.

తాను టార్గెట్ కాకున్నా…..

తెల్లారి లేస్తే ఏం జరుగుతుందోనన్న టెన్షన్ వెల్లంపల్లి శ్రీనివాస్ లో కన్పిస్తుంది. అందుకే ఆయన జరిగిన ప్రతి ఘటనలో ప్రభుత్వం ప్రమేయం లేదని తాను కాణిపాక వినాయకుని ఆలయంలో ప్రమాణం చేస్తానని వెల్లంపల్లి శ్రీనివాస్ శపథం చేస్తున్నారు. ఆయనలో కొంత భయం కన్పిస్తున్నట్లు స్పష్టంగా కన్పిస్తుంది. తనను టార్గెట్ చేస్తూ ఈ సంఘటనలు జరగకపోయినా, భవిష్యత్తులో తన పదవికి ముప్పు పొంచి ఉందన్న ఆందోళన వెల్లంపల్లి శ్రీనివాస్ లో ఉంది. అందుకే ఆయన రోజూ మీడియా ముందుకు వచ్చి తమ ప్రమేయం ఏమీ లేదని వివరణ ఇచ్చుకుంటున్నారు.

Tags:    

Similar News