మంత్రికి వారిపై ఇంత స‌డెన్ ప్రేమ పుట్టుకొచ్చిందే ?

ఆయ‌న దేవ‌దాయ శాఖ మంత్రి వెలంప‌ల్లి శ్రీనివాస‌రావు. కొన్నాళ్ల కింద‌టి వ‌ర‌కు ఆయ‌న దూకుడు అంతా ఇంతా కాదు. ఎవ‌రినీ లెక్కచేయ‌లేద‌నే పేరు వ‌చ్చేసింది. ముఖ్యంగా ఆయ‌న [more]

Update: 2021-02-18 11:00 GMT

ఆయ‌న దేవ‌దాయ శాఖ మంత్రి వెలంప‌ల్లి శ్రీనివాస‌రావు. కొన్నాళ్ల కింద‌టి వ‌ర‌కు ఆయ‌న దూకుడు అంతా ఇంతా కాదు. ఎవ‌రినీ లెక్కచేయ‌లేద‌నే పేరు వ‌చ్చేసింది. ముఖ్యంగా ఆయ‌న సొంత సామాజిక వ‌ర్గం వైశ్యుల్లోనే మంత్రి అంటే వ్యతిరేక‌త వ‌చ్చింది. కొన్నాళ్ల కింద‌ట విజ‌య‌వాడ‌లో వైశ్యులు మీటింగ్ పెట్టుకున్నారు. త‌మ‌కున్న వ్యాపారాలు, వాణిజ్యాల విష‌యంలో జ‌గ‌న్ స‌ర్కారు అవ‌లంబిస్తున్న తీరుపైనా, ప‌న్నుల పెంపు.. అధికారుల దాడులు వంటివిష‌యాల‌పై చ‌ర్చించేందుకు రెడీ అయ్యారు. అయితే అప్పట్లో వీరు.. మంత్రిని క‌లిసి త‌మ స‌మ‌స్యలు చెప్పుకొనేందుకు ప్రయ‌త్నించారు.

అపాయింట్ మెంట్ కూడా….

అయితే అప్పట్లో ఇదే వైశ్య సామాజిక వ‌ర్గాల క‌మిటీల‌కు, నేత‌ల‌కు కూడా మంత్రి వెలంప‌ల్లి శ్రీనివాస‌రావు అప్పాయింట్‌మెంట్ ఇవ్వలేదు. పైగా త‌న‌కు క‌మిటీల‌కు, యూనియ‌న్‌ల‌కు సంబంధం లేద‌ని.. తాను ఏదైనా చెప్పాలంటే ప్రజ‌ల‌కు మాత్రమే స‌మాధానం చెబుతాన‌ని.. త‌న వ‌ల్ల ఏమీ కాద‌ని.. త‌న‌కు ఇచ్చిన శాఖ వ‌ర‌కే ప‌రిమితం అవుతాన‌ని కూడా వెలంప‌ల్లి శ్రీనివాస‌రావు అప్పట్లో కుండ‌బ‌ద్దలు కొట్టారు. దీంతో విజ‌య‌వాడ‌లో భేటీ అయి.. త‌దుప‌రి కార్యాచ‌ర‌ణ చేప‌ట్టేందుకు వైశ్యులు సిద్ధమ‌య్యారు. దీంతో వారిని హోట‌ల్ గ‌దుల్లోనే అరెస్టులు చేయించి.. ఇళ్లకు పంపించేశారు మంత్రి వెలంప‌ల్లి శ్రీనివాస‌రావు.

అందరికి ఫోన్లు చేస్తూ….

క‌ట్ చేస్తే.. ఇప్పుడు వెలంప‌ల్లి శ్రీనివాస‌రావు నుంచి స‌ద‌రు వైశ్య సామాజిక వ‌ర్గం క‌మిటీల‌కు, యూనియ‌న్లకు, ప్రముఖ వ్యాపారుల‌కు కూడా ఫోన్లు వెళ్తున్నారు. “మ‌నం మ‌నం ఒక‌టి.. అప్పట్లో ఏదో అయిపోయింది. ఇప్పుడు మీ స‌మ‌స్యలు నా స‌మ‌స్యలు. వాటిని ప‌రిష్కరించేందుకు నేను అవ‌స‌ర‌మైతే.. సీఎం జ‌గ‌న్‌తో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నా.. వ‌చ్చే నెల‌లో ఎన్నిక‌లు అయిపోగానే మ‌నంద‌రం గెట్ టుగెద‌ర్ అవుదాం“ అని ఫోన్లు కొడుతున్నారు. కొంద‌రు వీటిని అర్ధం చేసుకుంటున్నారు. మ‌రికొంద‌రు వద్దులే సార్‌! అని చెప్పేస్తున్నార‌ట‌. దీంతో అస‌లు విష‌యం ఏంట‌నేది చ‌ర్చనీయాంశంగా మారింది.

అందుకేనా బెంగ….

అప్పట్లో వ‌ద్దని.. ఇప్పుడు కావాల‌ని వైశ్య సామాజిక వ‌ర్గానికి మంత్రి వ‌ర్యులు ఎందుకు చేరువ అవుతున్నారు ? అనేది కీల‌కంగా మారింది. దీనిని కొంత త‌ర‌చి చూస్తే.. మంత్రి వ‌ర్యుల‌కు ప‌ద‌విపై బెంగ‌ప‌ట్టుకుంది. వ‌చ్చే ప‌ది మాసాల్లో ఎలాగూ.. మంత్రి వ‌ర్గ ప్రక్షాళ‌న ఉంటుంది. ఈ స‌మ‌యంలో త‌న ను తొల‌గించే అవ‌కాశం ఉండొచ్చన్న బెంగ ఆయ‌న‌కు ఉంద‌ట‌. ముఖ్యంగా పార్టీకి అనుబంధంగా ఉండే వైశ్య సామాజిక వ‌ర్గాల నుంచి త‌న‌పై ఫిర్యాదులు వెళ్లాయ‌ని వెలంప‌ల్లి శ్రీనివాస‌రావుకి గ‌ట్టిగానే స‌మాచారం అందింది. దీంతో ఇప్పుడు త‌న ప‌ద‌విని మ‌ళ్లీ రెన్యువ‌ల్ చేసుకునేందుకు.. వైశ్య సామాజిక వ‌ర్గాల‌ను బుజ్జగించే ప‌నిలో ప‌డ్డార‌ట. అయితే.. ఇది ఎంత వ‌ర‌కు వ‌ర్కవుట్ అవుతుందో చూడాలి.

ఆ ప్రయత్నంలోనే…?

కొస‌మెరుపు ఏంటంటే.. మంత్రి వెలంప‌ల్లి శ్రీనివాస‌రావుపై వ్యతిరేక‌త వెనుక ఓ సామాజిక వ‌ర్గం.. కార్పొరేష‌న్ చైర్మన్ ఉన్నార‌ని, ఆయ‌న మంత్రి రేసులో ముందున్నార‌ని.. వెలంప‌ల్లిని అడ్డు తొల‌గిస్తే.. త‌న‌కు ఈ పీఠం ఖాయ‌మ‌ని న‌మ్ముతున్నార‌ని.. అందుకే వైశ్యుల‌తో క‌థ న‌డిపిస్తున్నార‌ని ప్రచారంలో ఉంది. ఎలాగూ.. వైశ్యుల‌కు వెలంప‌ల్లికి మ‌ధ్య ప‌చ్చగ‌డ్డి వేసినా భ‌గ్గుమ‌నే ప‌రిస్థితి ఉంద‌ని అందుకే ఇలా చేస్తున్నార‌ని ప్రచారం జ‌రుగుతోంది. మ‌రి చివ‌రికి మంత్రి గారి పరిస్థితి ఎటు దారి తీస్తుందో చూడాలి.

Tags:    

Similar News