గంటా కంటే ముందుగా ఈయనే వస్తారటగా?

ఆయన ప్రధాన వ్యాపారం పూర్తిగా మూతబడి పోయింది. పార్టీ కూడా అధికారంలో లేదు. మొన్నటి ఎన్నికల్లోనే విపరీతంగా ఖర్చు చేశారు. దీంతో ఆర్థిక ఇబ్బందులు ఆయనను చుట్టుముట్టాయి. [more]

Update: 2020-09-12 08:00 GMT

ఆయన ప్రధాన వ్యాపారం పూర్తిగా మూతబడి పోయింది. పార్టీ కూడా అధికారంలో లేదు. మొన్నటి ఎన్నికల్లోనే విపరీతంగా ఖర్చు చేశారు. దీంతో ఆర్థిక ఇబ్బందులు ఆయనను చుట్టుముట్టాయి. ఇక ఆయనకు వేరే దారి కన్పించడం లేదు. అధికార వైసీపీలో చేరడం మినహా. వైసీపీ అధిష్టానం సయితం ఆయన వస్తానంటే కాదనకూడదని నిర్ణయించుకుంది. ఆయనే విశాఖ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ.

ఆర్థిక ఇబ్బందులతో….

వెలగపూడి రామకృష్ణ ఎన్టీఆర్ కు వీరాభిమాని. అదే ఆయనకు టీడీపీ టిక్కెట్ వచ్చేలా చేసింది. ఇప్పటికి మూడు సార్లు టీడీపీ అభ్యర్థిగా విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. అయితే అప్పటి పరిస్థితులు వేరు. వెలగపూడి రామకృష్ణ ప్రజల్లో బాగా కలసి పోతారని పేరు. సమస్య పై వెంటనే స్పందిస్తారు. ఎవరు వచ్చినా కాదనకుండా ఓపిగ్గా సమాధానమిస్తారు. అదే వెలగపూడి రామకృష్ణను ప్రజలకు చేరువ చేసింది.

వ్యాపారాలు క్లోజ్…..

అయితే వెలగపూడి రామకృష్ణకు ప్రధాన ఆదాయం మద్యం వ్యాపారం నుంచే. ఆయనకు విశాఖలో అనేక మద్యం దుకాణాలున్నాయి. దీంతో అదే ప్రధాన ఆదాయవనరుగా మారింది. అయితే వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహిస్తుండటంతో వెలగపూడి రామకృష్ణ ఆదాయం పూర్తిగా పడిపోయింది. దీంతో ఆయన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారంటున్నారు.

వైసీపీ కండువా కప్పేందుకు…..

ఇదే సమయంలో విశాఖ కార్పొరేషన్ ఎన్నికల్లో పట్టు సాధించేందుకు వైసీపీ ఆపరేషన్ ఆకర్ష్ కు తెరతీస్తుంది. విశాఖలో ఉన్న టీడీపీ నలుగురు ఎమ్మెల్యేలకూ పార్టీ కండువా కప్పేందుకు రెడీగా ఉంది. విశాఖ ను పరిపాలన రాజధానిగా ప్రకటించడంతో వీళ్లు కూడా కొంత సానుకూలంగానే ఉన్నార. గంటా శ్రీనివాసరావు కంటే ముందు బలమైనకమ్మ సామాజికవర్గానికి చెందిన వెలగపూడి రామకృష్ణ బాబును చేర్చుకోవాలన్న ఉద్దేశ్యంలో వైసీపీ ఉంది. ఎన్టీఆర్ వీరాభిమాని అని డౌట్ ఉన్నప్పటికీ కొడాలి నానితో రాయబారం నడుపుతున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద ఆర్థిక ఇబ్బందులు, విశాఖ రాజధాని వంటి అంశాలతో వెలగపూడి రామకృష్ణ బాబు వైసీపీ లో చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న టాక్ విన్పిస్తుంది.

Tags:    

Similar News