వెంకయ్యా..? వినరా? కనరా? మాట్లాడరా?

Update: 2018-07-25 15:30 GMT

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా డిమాండు విషయంలో కర్త,కర్మ,క్రియ అంతా వెంకయ్యనాయుడే. ఏదో ఒక విధంగా రాష్ట్ర విభజనను కానిచ్చేస్తున్న కాంగ్రెసును గట్టిగా నిలదీసింది ఆయనే. కేవలం ఈశాన్యరాష్ట్రాలకు, అత్యంత వెనుకబడిన కొండప్రాంతాలకు పరిమితమైన ప్రత్యేకహోదాను ముందుకు తెచ్చి పెట్టిందీ ఆయనే. బీజేపీ,తెలుగుదేశం పొత్తులోనూ కీలకపాత్రధారి. కేంద్రమంత్రిగా ఏపీకి సాధ్యమైనంత న్యాయం చేసేందుకు ప్రయత్నించారు. పరిస్థితులు తిరగబడ్డాయి. పెద్ద పదవిలో కూర్చోబెట్టేశారు. క్రియాశీలక మంత్రి కీళ్లు విరిచేశారు. నిన్నామొన్నటివరకూ తెలుగు రాష్ట్రాలకు కేంద్రంలో పెద్ద దిక్కుగా ఉన్న వెంకయ్యనాయుడు ఇప్పుడు ప్రేక్షకపాత్రకు మారిపోవాల్సి వచ్చింది. ప్రత్యేకించి రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ కు ఏదో చేయాలనుకున్న ఆయన తపనకు అడ్డుకట్ట పడింది. చేద్దామనుకున్న అనేక పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయి. ఆయన ముందే పంచాయతీ.. అటు సర్కారు వైపు మాట్లాడలేడు. ఇటు దుమ్మెత్తిపోస్తున్న విపక్షాలను ఆపలేడు.

మౌన సాక్షి....

ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు గడచిన నాలుగుదశాబ్దాల ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు ప్రత్యక్ష సాక్షి. భారతీయ జనతాపార్టీ వ్యవస్థాపన నుంచి నేటి అధికారం వరకూ భాగస్వామి. పార్టీ సిద్దాంతాలు, విధానాల రూపకల్పనలోనూ చురుకైన పాత్ర పోషించిన వ్యక్తి. వాజపేయి, అద్వానీ తరానికి నేటి మోడీ, అమిత్ షాల శకానికి వారధి. అనుచరునిగా, నాయకునిగా, అనుసంధాన కర్తగా బీజేపీలో అందరికీ చిరపరిచితుడు. వాగ్ధాటి, సమస్యలపై అవగాహన, పార్లమెంటరీ విధివిధానాలపై క్షుణ్ణమైన అధ్యయనంతో రాజ్యసభలో బీజేపీ తరఫున ఆయన చెలరేగిపోయేవారు. అటువంటి వెంకయ్య నాయుడు సొంత రాష్ట్రానికి సంబంధించిన అతి ప్రధానమైన అంశం చర్చకు వస్తే మౌనసాక్షిగా మిగిలిపోవాల్సి వచ్చింది. అందులోనూ తన పాత్ర ఉన్న అంశం పైనే తాను తటస్థ పాత్ర పోషించాల్సి వచ్చింది. మొత్తం వ్యవహారంలో అప్పటి ప్రధాని నుంచి హామీ రాబట్టిన ఘనత వెంకయ్యదే. దానిని ప్రస్తుత ప్రధాని కాదు కూడదంటూ పక్కన పెట్టేస్తే పన్నెత్తి మాట్లాడలేకపోతున్నారు. అధ్యక్షస్థానంలో అలంకారప్రాయంగా మిగిలిపోయారు. ఆంధ్రప్రదేశ్ విభజన హామీలు,ప్రత్యేకహోదా పై రాజ్యసభలో సాగిన చర్చలో అన్నీ తెలిసి ఒక్క మాట ఎటూ మాట్టాడకుండా మిగిలిపోవాల్సి రావడం వెంకయ్య రాజకీయ జీవితంలోనే అనివార్యమైన బాధాకరమైన ఘట్టం.

పెరుగుట విరుగుట కొరకే...

దక్షిణ భారత దేశం నుంచి భారతీయ జనతాపార్టీలో అత్యున్నత స్థాయికి ఎదిగిన నేత వెంకయ్యనాయుడు. దేశవ్యాప్తంగా విస్తృతంగా పర్యటించి పార్టీ శ్రేణులు, నాయకులతో మమైకమైన సంబంధాలు కలిగిన వ్యక్తి. వాజపేయి, అద్వానీల తర్వాత శకంలో పార్టీలో అత్యంత కీలకమైన నాయకునిగా 2004 నాటికే గుర్తింపు పొందారు. అయితే పదేళ్లపాటు పార్టీ అధికారంలోకి రాకపోవడంతో పార్టీకే కొంత ఇమేజ్ తగ్గింది. కొత్త రక్తాన్ని ఎక్కించాలనే ఉద్దేశంతో అప్పటికే గుజరాత్ ముఖ్యమంత్రిగా, సమర్థునిగా నిరూపించుకున్న మోడీని ముందుకు తెచ్చిపెట్టాయి సంఘ్ పరివార్ శక్తులు. యూపీఏ వైఫల్యాలు, యువతరం ఆశలు కలగలిసి మోడీకి దేశం బ్రహ్మరథం పట్టింది. సీనియారిటీ, పార్టీపరమైన ప్రాధాన్యం వంటివి పక్కకు పోయాయి. బీజేపీలో మోడీ హవా మొదలైంది. వాజపేయి, అద్వానీల కాలంలో బహుళ నాయకత్వం ఉండేది. ప్రజాస్వామ్యయుతమైన వాతావరణంలో నిర్ణయాలపరమైన చర్చసాగుతుండేది. ఆ విధానాలకు అలవాటు పడిన వ్యక్తి వెంకయ్య నాయుడు. మోడీకి పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ఫ్రాక్సీగా మారిపోవడంతో ఏకవ్యక్తి నిర్ణయమే ఫైనల్ అన్నట్లుగా పార్టీలో పరిస్థితి దిగజారింది. పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరించడంలో వెంకయ్య దిట్ట. మోడీ, అమిత్ షాల నేతృత్వంలోనూ సమన్వయంతోనే పనిచేసుకుంటూ పోయారు. ఉన్నతస్థాయిలో ఉండి మోడీని అత్యధికంగా పొగిడిన వారిలో వెంకయ్య మొదటి స్థానంలో నిలిచారు. అయినా ఎప్పటికైనా ప్రధాని పదవికి భవిష్యత్తులో పోటీ అని భావించిన మోడీ ఉపరాష్ట్రపతి పదవితో వెంకయ్యకు చెక్ పెట్టారనేది పార్టీ వర్గాల భావన.

ఆయనకే కాదు..ఆంద్రాకూ అన్యాయం...

ఆంధ్రప్రదేశ్ కు న్యాయం సంగతి దేవుడెరుగు. అసలు ఏపీ కోసం రాజ్యసభలో గళమెత్తిన ఆయనకే అన్యాయం జరిగింది. రాజకీయంగా దక్షిణభారతంలో బలపడాలని చూస్తున్న బీజేపీకి ఒక ఫోర్సు వెంకయ్య నాయుడు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణల్లో ఆయనకు పరిచయం లేని నాయకులు లేరు. పార్టీలకు అతీతంగా అభిమానులున్నారు. కేంద్రంలో సంకీర్ణం ఏర్పడాల్సిన పరిస్థితి వస్తే దక్షిణాది నుంచి విభిన్న పార్టీల మద్దతును కూడగట్టగల శక్తి ఉంది. ఇవన్నీ ఒక నాయకునిగా ఆయనకున్న ప్లస్ పాయింట్లు. మోడీ, అమిత్ షాల దృష్టిలో అవే మైనస్ పాయింట్లుగా మారిపోయాయి. సందర్భం వస్తే, పరిస్థితులు అనుకూలిస్తే తమ ప్రాబల్యానికి గండి కొట్టగల లౌక్యం, సామర్థ్యం కేవలం వెంకయ్యకే ఉందని వారు గ్రహించారు. పైపెచ్చు దక్షిణాది కార్డు ఉంది. ఆర్ఎస్ఎస్ లోనూ, బీజేపీలోనూ తమ కంటే సీనియర్. ఈ రకమైన పొలిటికల్ ఈక్వేషన్ చూసుకున్న తర్వాత దక్షిణాదికి ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వాలనే సాకు చూపి వెంకయ్యను క్రియాశీల రాజకీయ పాత్ర నుంచి తప్పించేశారు. వెంకయ్య కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు లక్షల సంఖ్యలో ఆంధ్రప్రదేశ్ కు పక్కా ఇళ్లు మంజూరు చేశారు. వివిధ శాఖలతో నిరంతరం సమీక్షలు జరిపి విద్యాసంస్థల ఏర్పాటును ఒక కొలిక్కి తెచ్చారు. పట్టణాభివ్రుద్ధి శాఖ నిధులను వేల కోట్ల రూపాయలు మంజూరు చేశారు. ఆయన తప్పుకున్న తర్వాత కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ అనాథగా మిగిలిపోయింది. గోడు పట్టించుకునేవారు లేకుండా పోయారు. మోడీ, అమిత్ షాల రాజకీయ విన్యాసంలో వెంకయ్య నాయుడితోపాటు ఆంధ్రప్రదేశ్ కూడా బాధితగా మిగిలిపోయింది.

 

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News