వైసీపీలోకి నో ఎంట్రీ.. ఇక అదే దిక్కా?

కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీర శివారెడ్డి ఇప్పుడు క్రాస్ రోడ్స్ లో ఉన్నారు. ప్రస్తుతం ఆయన ఏ పార్టీలోనూ లేనట్లే అనుకోవాలి. ఆయన టీడీపీలో ఉన్నా లేనట్లే. [more]

Update: 2020-08-21 03:30 GMT

కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీర శివారెడ్డి ఇప్పుడు క్రాస్ రోడ్స్ లో ఉన్నారు. ప్రస్తుతం ఆయన ఏ పార్టీలోనూ లేనట్లే అనుకోవాలి. ఆయన టీడీపీలో ఉన్నా లేనట్లే. ఆయన పార్టీ మారేందుకు సిద్దమవుతున్నారు. తొలుత వైసీపీలో చేరాలనుకున్నారు. కానీ వైసీపీలో కొందరు ముఖ్యనేతలే అడ్డుకోవడంతో ఆయన చేరిక ఆగిపోయిందంటారు. ఇప్పుడు ఆయనకు ఒకే ఆప్షన్ ఉంది. బీజేపీలో చేరడమే. ఇప్పటికే కడప జిల్లాకు చెందిన టీడీపీ నేతలు 90 శాతం మంది బీజేపీలో చేరడం విశేషం. వారి బాటలోనే వీర శివారెడ్డి కూడా పయనిస్తారని తెలిసింది.

గత ఎన్నికల్లో వైసీపీకి…..

తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా వీరశివారెడ్డి కుమారుడు అనిల్ కుమార్ రెడ్డి డీసీసీబీ ఛైర్మన్ గా అవకాశమిచ్చారు. 2019 ఎన్నికల్లో కమలాపురం టిక్కెట్ ను ఆశించిన వీరశివారెడ్డి భంగపడ్డారు. కనీసం ప్రొద్దుటూరు టిక్కెట్ ఇవ్వమని అధిష్టానాన్ని కోరారు. కానీ సాధ్యం కాలేదు. దీంతో వీర శివారెడ్డి వర్గం 2019 ఎన్నికల్లో లోపాయికారీగా వైసీపీకి మద్దతు పలికింది. దీంతో ఆయనంతట ఆయనే టీడీపీకి దూరమయినట్లయింది. అయితే వైసీపీలోనూ వీర శివారెడ్డి రాకను వ్యతిరేకిస్తున్న వాళ్లు ఎక్కువమంది ఉన్నారు. దీంతో కొంతకాలంగా ఆయన స్దబ్దుగా ఉన్నారు.

అడ్డుపడిన నేతలు…..

నిజానికి వీర శివారెడ్డి వైసీపీలో చేరేందుకు రెడీ అయిపోయారు. జగన్ అమెరికా వెళ్లినప్పుడు ఆయన తాను వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. జగన్ అమెరికా నుంచి రాగానే కండువా కప్పుకుంటానని చెప్పారు. జగన్ అమెరికా వెళ్లి వచ్చి పది నెలలు గడుస్తున్నా వీర శివారెడ్డి పార్టీలో చేరలేదు. కమలాపురం కావడం, అక్కడ జగన్ మామ రవీంద్రనాధ్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉండటం కూడా వీర శివారెడ్డికి కలసి వచ్చేలా లేదు.

బీజేపీలోకి వెళ్లేందుకు….

దీంతో టీడీపీకి భవిష్యత్ లేదని భావించిన వీరశివారెడ్డి బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఇప్పటికే కడప జిల్లాకు చెందిన అనేకమంది టీడీపీ నేతలు బీజేపీలోనే చేరారు. రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి తదితరులు కాషాయ కండువా కప్పుకున్నారు. కమలాపురంలో టీడీపీలో ఉన్నప్పుడు వీర శివారెడ్డి, పుత్తా నరసింహారెడ్డి రెండు వర్గాలుగా ఉండేవి. అప్పుడు ఇద్దరి పంచాయతీని సీఎం రమేష్ తీర్చే వారు. ఇప్పుడు కూడా రమేష్ ఉన్న బీజేపీలోకే వెళ్లాలని వీర శివారెడ్డి నిర్ణయించుకున్నారంటున్నారు.

Tags:    

Similar News