వాసుపల్లికే జై కొడుతున్నారే?

మొత్తానికి విశాఖ దక్షిణం సీటు విషయంలో వైసీపీ ఒక క్లారిటీ ఇచ్చిందా అన్నదే వైసీపీలో హాట్ టాపిక్ గా ఉంది. విశాఖలో ఏ నియోజకవర్గంలోనూ లేనన్ని గ్రూపులు [more]

Update: 2021-09-17 02:00 GMT

మొత్తానికి విశాఖ దక్షిణం సీటు విషయంలో వైసీపీ ఒక క్లారిటీ ఇచ్చిందా అన్నదే వైసీపీలో హాట్ టాపిక్ గా ఉంది. విశాఖలో ఏ నియోజకవర్గంలోనూ లేనన్ని గ్రూపులు సౌత్ వైసీపీలో ఉన్నాయి. ఇక్కడ వైసీపీలో ఫిషరీస్ డెవలప్మెంట్ చైర్మన్ కోలా గురువులుది ఒక గ్రూపు. క్రిస్టియన్ మైనారిటీ వెల్ఫేర్ కార్పోరేషన్ చైర్మన్ జాన్ వెస్లీది మరో గ్రూపు, ద్రోణం రాజు శ్రీనివాస్ వర్గం ఒక వైపు ఉంది. ఇక టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎస్ ఎ రహమాన్ ది ఒక గ్రూప్. ఇవి చాలవన్నట్లుగా ఏకంగా టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ వైసీపీలోకి జంప్ చేసి తన వర్గంతో ఆధిపత్యం చేస్తున్నారని వైసీపీ నేతల ఫిర్యాదు ఒక వైపు ఉంది. ఈ నేపధ్యంలో నిన్నటి దాకా కోలా గురువులు వైసీపీకి సౌత్ ఇంచార్జిగా ఉండేవారు.

అన్నీ వివాదాలతోనే…?

ఇక సిట్టింగ్ ఎమ్మెల్యే ఎక్కడైనా ఉంటే ఆయన నియోజకవర్గానికి ఇంచార్జి అవుతారు. ఎమ్మెల్యేలు లేనిచోటనే పార్టీ ఇంచార్జిలను పెడతారు. విశాఖ సౌత్ లో వైసీపీ ఓడాక సీనియర్ నేత కోలా గురువులుని ఇంచార్జిగా పార్టీ ప్రకటించింది. ఆ తరువాత ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ వైసీపీలోకి వచ్చేశారు. అప్పటి నుంచి ఆయన అన్నీ తన కనుసన్నల‌లోనే జరగాలని పట్టుపడుతున్నారు. తాను ఎమ్మెల్యే కాబట్టి మళ్లీ వేరే పార్టీ ఇంచార్జి ఎందుకు అని కూడా వాసుపల్లి అంటున్నారు. ఇక కోల గురువులు, వాసుపల్లి గణేష్ కుమార్ వర్గాల మధ్య ఈ విషయంలో వివాదాలు ఉన్నాయి. దానికి మించి గొడవలు వచ్చే ఎన్నికల్లో టికెట్ రావాలి అంటే మాత్రం ఇంచార్జిగా మరొకరు ఉండకూడదు పోటీ పడకూడ‌దు అన్నదే వాసుపల్లి ఆలోచన.

క్లారిటీ వచ్చిందా…?

ఈ నేపధ్యంలో తాజాగా విజయసాయిరెడ్డి విశాఖ అభివృద్ధి మీద ఏర్పాటు చేసిన ఒక సమావేశంలో వాసుపల్లి గణేష్ కుమార్ వర్గీయులు సౌత్ ఇంచార్జి ఎవరో చెప్పమంటూ పట్టు పట్టారు. దాంతో విజయసాయిరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న వాసుపల్లే అక్కడ పార్టీ ఇంచార్జి కూడా అంటూ క్లారిటీ ఇచ్చేశారు. దాంతో వాసుపల్లి గణేష్ కుమార్ వర్గీయులల్లో ఆనందానికి అవధులు లేవు. వచ్చే ఎన్నికల్లో తమకే వైసీపీ టికెట్ ఖాయ‌మని వారు అపుడే ప్రకటించేశారు, సంబరాలు కూడా చేసుకుంటున్నారు. ఈ పరిణామాలతో కోలా గురువులు వర్గం అయితే గుస్సా అవుతోంది. పార్టీ కోసం పదేళ్ళుగా పనిచేస్తూ వస్తున్న తమను పక్కన పెట్టడమేంటి అంటున్నారు గురువులు అనుచరులు. దీని మీద తాము కూడా తేల్చుకుంటామని చెబుతున్నారు.

పార్టీ గెలిచేనా..?

విశాఖ సౌత్ విషయంలో మొదటి నుంచి వైసీపీ తప్పు చేస్తోంది అని అంటున్నారు. అన్ని వర్గాలను కలిపి ఒకటిగా చేయకుండా ఏ వర్గానికి ఆ వర్గాన్ని ప్రోత్సహించడం ద్వారానే అక్కడ సీన్ చిరిగి చేట అయింది అంటున్నారు. ఇక టీడీపీ నుంచి వచ్చిన వాసుపల్లి గణేష్ కుమార్ కే టికెట్ ఇస్తే తాము పార్టీకి పనిచేయమని కూడా సీనియర్లు తెగేసి మరీ చెప్పేస్తున్నారు. ఈ పరిణామాలు సహజంగానే టీడీపీకి ఆనందంగా మారుతున్నాయి. తమ నుంచి వెళ్ళిపోయిన వాసుపల్లి వైసీపీలో చిచ్చు రేపారని వారు అంటున్నారు. ఈసారి టికెట్ ఇచ్చినా వాసుపల్లి గెలవరని, వైసీపీ వారే ఓడిస్తారు అన్న అంచనాకు వస్తున్నారు. మొత్తానికి వాసుపల్లి గణేష్ కుమార్ వచ్చే ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు కానీ వైసీపీలోనే ఆయనకు శత్రువులు ఎక్కువ అయిపోయారు.

Tags:    

Similar News