పక్కా లోకల్ పాలిటిక్స్ తో వాసుపల్లి రచ్చ ?

చంద్రబాబునాయుడుకి ఆది నుంచి విశాఖ అంటే ఇష్టం లేదుట. ఆయన విశాఖ రాజధానిని కావాలని తొక్కిపెట్టి తన మనసులో అప్పటికే అనుకున్న అమరావతిని రాజధానిని చేశారట. నిన్నటి [more]

Update: 2020-10-01 08:00 GMT

చంద్రబాబునాయుడుకి ఆది నుంచి విశాఖ అంటే ఇష్టం లేదుట. ఆయన విశాఖ రాజధానిని కావాలని తొక్కిపెట్టి తన మనసులో అప్పటికే అనుకున్న అమరావతిని రాజధానిని చేశారట. నిన్నటి టీడీపీ తమ్ముడు, ఈ రోజు రెబెల్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ బాబు గురించి చెబుతున్న కొత్త ముచ్చట్లు ఇవి. తెలుగుదేశం పార్టీకి పదవుల ఆశలు తప్ప అసలు రాజకీయం తప్ప విధానం అంటూ ఒకటి లేనేలేదని కూడా వాసుపల్లి గణేష్ హాట్ కామెంట్స్ చేశారు. పదమూడేళ్ళ పాటు పార్టీ కోసం ప్రాణం పెట్టి పనిచేసిన తననే హింసించిన పసుపు పార్టీ పెద్దలకు పరాభవం తప్పదని కూడా హెచ్చరిస్తున్నారు.

విశాఖ అలా సైడ్ ……

ఇదిలా ఉంటే వాసుపల్లి గణేష్ కుమార్ విశాఖ రాజధాని 2014లోనే కావాల్సింది ఎందుకు సైడ్ చేశారో ఆ కుట్ర కోణం గుట్టు విప్పారు. చంద్రబాబు ఈ మధ్యదాకా తరచూ చెబుతూ వస్తున్న సర్వే వివరాల అసలు కధనూ ఆయన చెప్పారు. మేము అన్ని ప్రాంతాలలో సర్వే చేస్తే అమరావతికే జనం జై కొట్టారని బాబు అంటూ వస్తున్న సంగతి విదితమే. అయితే ఆ సర్వే తప్పు, బాబు మాటలు ఇంకా తప్పూ అంటున్నారు వాసుపల్లి గణేష్. నాడు టీడీపీ చేసిన సర్వేలో విశాఖకే రాజధాని కావాలని ఎక్కువమంది ఓటు చేశారట. కానీ బాబు మాత్రం తన కుటిల రాజనీతితో గుంటూరు, క్రిష్ణా జిల్లాల ఓట్లను కూడా కలిపేసి విశాఖ కంటే ఎక్కువ చూపించి అమరావతికే మద్దతు ఉందని మభ్యపెట్టారని వాసుపల్లి గణేష్ అంటున్నారు.

వారిపై రుసరుస…..

వాసుపల్లి గణేష్ పక్కా లోకల్. విశాఖ పల్లెకారు గ్రామంగా ఉన్నప్పటి నాటి సంప్రదాయ సామాజికవర్గమైన మత్స్యకార కులానికి చెందిన నేత. ఆయన ఇపుడు బయటకు వస్తూనే టీడీపీలోని వలస నేతలపైన మండిపడుతున్నారు. వారంతా ఎక్కడో పుట్టారు, ఇక్కడకు వచ్చి ఎదిగారు, చివరకు వారు చనిపోతే అంబులెన్స్ వచ్చి వారి సొంత వూళ్ళకు భౌతిక కాయాన్ని తీసుకెళ్తారు. కానీ నేను ఇక్కడే పుట్టా, పెరిగాను, ఇక్కడే చనిపోతానని వాసుపల్లి గణేష్ నేటివిటీ ఫీలింగ్ తో ఎమోషనల్ పాలిటిక్స్ కి తెర తీశారు. టీడీపీలో వెలగపూడి రామక్రిష్ణ బాబు, గంటా శ్రీనివాస్, ఎంవీవీఎస్ మూర్తి మనవడు శ్రీ భరత్ వంటి అనేక మంది వలస‌ నాయకులు ఉన్నారు. మరి వారి మీదనే ఆయన సెటైర్లు వేశారా అన్నది చర్చగా ఉంది.

ఇటూ గుచ్చుకుంటోందిగా….?

సరే నిన్నటిదాకా వాసుపల్లి గణేష్ టీడీపీ నేత, ఇపుడు వైసీపీకి మద్దతుదారుడు. ఆయన ఉన్న కొత్త పార్టీ వైసీపీలో కూడా నెల్లూరు జిల్లా నుంచి విశాఖ వచ్చిన విజయసాయిరెడ్డి రాజకీయాలు చేస్తున్నారు. కృష్ణా జిల్లాకు చెందిన మంత్రి అవంతి శ్రీనివాసరావు వైసీపీలో కీలకంగా ఉన్నారు. అంతే కాదు, పొరుగు జిల్లాకు చెందిన ఎంవీవీ సత్యనారాయణ ఎంపీగా ఉన్నారు. ఇక విశాఖ వైసీపీ ప్రెసిడెంట్ వంశీ క్రిష్ణ శ్రీనివాస్ కూడా వేరే జిల్లాకు చెందిన వారు. ఇలా వైసీపీలో కూడా అనేకమంది వలసనాయకులు రాజకీయాలు చేస్తున్నారు. వలస‌ నాయకులతోనే విశాఖ అభివృధ్ధి సాగడంలేదని వాసుపల్లి గణేష్ చేస్తున్న హాట్ కామెంట్స్ ఇపుడు వైసీపీకి కూడా గట్టిగానే గుచ్చుకోనున్నాయని అంటున్నారు. విశాఖ రాజధానిని వలస నాయకులే కాదంటున్నారని ఆయన కొత్త పాయింట్ లేవనెత్తుతున్నారు. మరి వైసీపీలో దీని మీద కూడా హాట్ హాట్ డిస్కషన్ జరుగుతోంది. వాసుపల్లి పక్కా లోకల్ వాళ్ళే విశాఖ రాజకీయం చేయాలని ని అన‌డంతో వైసీపీలో కూడా కలవరం రేగుతోంది. పార్టీలోకి వస్తూనే కలి పుట్టించేలా మాజీ త‌మ్ముడు రచ్చ చేస్తున్నారని అంటున్నారు. చూడాలి మరి ఇది ఎంతవరకూ పోతుందో. వాసుపల్లి గణేష్ వలస నేతల మీద ఎలా పైచేయి సాధిస్తారో.

Tags:    

Similar News