వాసుపల్లీ.. వాట్ ఈజ్ యూజ్ ?

అధికారం ఒక వ్యామోహం. ప్రతీ వారూ దాని వైపే చూస్తారు. మోజు పడతారు. ఆకర్షితులవుతారు. అలా వైసీపీ ఆకర్ష్ కి విశాఖ లో చిక్కిన టీడీపీ ఎమ్మెల్యే [more]

Update: 2021-04-11 00:30 GMT

అధికారం ఒక వ్యామోహం. ప్రతీ వారూ దాని వైపే చూస్తారు. మోజు పడతారు. ఆకర్షితులవుతారు. అలా వైసీపీ ఆకర్ష్ కి విశాఖ లో చిక్కిన టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ని చూసి పార్టీ పెద్దలు తెగ మురిసిపోయారు. ఆయన వల్ల విశాఖలో పార్టీ ఫుల్ స్ట్రాంగ్ అవుతుందని కూడా గట్టిగా నమ్మారు. ఎందుకంటే సుదీర్ఘ కాలం పాటు ఆయన టీడీపీ నగర అధ్యక్షుడిగా పనిచేశారు. ఇక విశాఖ సౌత్ నుంచి రెండు సార్లు వరసగా గెలిచారు. అంతన్నాడు, ఇంతన్నాడు అన్నట్లుగా చివరికి వాసుపల్లి గణేష్ కుమార్ అసలు బలం ఏంటో వైసీపీ నాయకత్వానికి లోకల్ బాడీ ఎన్నికలతో తెలిసివచ్చింది.

తప్పు పార్టీదే …..

వాసుపల్లి గణేష్ కుమార్ 2019 ఎన్నికల్లో కేవలం నాలుగు వేల కోట్ల తేడాతోనే వైసీపీ మీద గెలిచారు. ఆయన అప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యే. పైగా అయిదేళ్ళు టీడీపీ అధికారంలో ఉంది. సిటీ ప్రెసిడెంట్ కూడా. అటువంటి ఆయన మీద పోటీకి చివరి నిముషం దాకా వైసీపీ క్యాండిడేట్ ని డిసైడ్ చేయకపోవడం ద్వారా పెద్ద తప్పు చేసింది. మరో వైపు ఒక డాక్టర్ కి టికెట్ ఇస్తామని చెప్పి ప్రచారం చేసుకోమంది. చివరి నిముషంలో మాజీ ఎమ్మెల్యే ద్రోణం రాజు శ్రీనివాస్ ని తెచ్చి పోటీకి పెట్టింది. గట్టిగా నెల రోజులు కూడా వ్యవధి లేకపోయినా ద్రోణంరాజు బాగానే లాక్కొచ్చారు. వైసీపీలో గ్రూపులు, వాసుపల్లి గణేష్ కుమార్ రేసులో ముందుండడం వంటి వాటి వల్లనే ద్రోణంరాజు ఓడిపోయారు. లేకపోతే వాసుపల్లి నాడే ఓడేవారు అన్నది విశ్లేషణ.

ఉన్నది పోయిందా ….?

ఇక అప్పట్లో ద్రోణంరాజు వైసీపీలో ఉన్నారు. మత్సకార వర్గంలో బలమైన కోలా గురువులు కూడా ఉన్నారు. మైనారిటీ నేతలు కూడా ఉన్నారు. టీడీపీ నుంచి వచ్చిన మాజీ ఎమ్మెల్యే ఎస్ ఎ రహమాన్ వంటి వారుండగా వాసుపల్లి గణేష్ కుమార్ ని ఏరి కోరి వైసీపీలోకి తెచ్చారు. చివరికి ఆయన రాకతో గ్రూపులు మరింత పెరిగాయి. 13 సీట్లున్న చోట కేవలం అయిందంటే అయిదు వార్డులు కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ గెలుచుకుంది. మెజారిటీ వార్డుల్లో అభ్యర్ధులు దారుణంగా ఓటమి పాలు అయ్యారు. ఇంకో వైపు తన వారికే టికెట్లు ఇచ్చుకుని ద్రోణంరాజు ఇచ్చిన వారిని పక్కకు పెట్టేశారు వాసుపల్లి గణేష్ కుమార్. పైగా రెబెల్స్ ని తెచ్చి వారిని ఓడించారన్న విమర్శలు ఉన్నాయి. మొత్తానికి వాసుపల్లి గణేష్ కుమార్ రాకతో సౌత్ లో మరింత గందరగోళం తప్ప పార్టీకి ఒరిగింది లేదని అంటున్నారు.

కత్తులు నూరుతున్నారుగా ?

ఇక వాసుపల్లి గణేష్ కుమార్ కి వ్యతిరేకంగా బలమైన వర్గం వైసీపీలో కత్తులు నూరుతోంది. వాసుపల్లిని కట్టడి చేయాలని డిమాండ్ చేస్తోంది. దివంగత ద్రోణంరాజు శ్రీనివాస్ కుమారుడు శ్రీవాత్సవ్, మాజీ ఎమ్మెల్యే ఎస్ ఎ రహమాన్, కోలా గురువులు ఒక వర్గంగా ఏర్పడ్డారు. ఎమ్మెల్యే పేరెత్తితేనే వీరంతా గుస్సా అవుతున్నారు. ఇక వైసీపీ అభ్యర్ధులను ఓడించిన రెబెల్స్ ని తిరిగి పార్టీలోకి తీసుకురావడానికి వాసుపల్లి గణేష్ కుమార్ చేస్తున్న ప్రయత్నాలను కూడా అడ్డుకుంటున్నారు. మొత్తానికి చూస్తే వాసుపల్లి బలం కాదు వాపు అని ప్రత్యర్ధి వర్గం అంటోంది. విశాఖ సౌత్ లో 2024 ఎన్నికల్లో వాసుపల్లి గణేష్ కుమార్ కి టికెట్ ఇస్తే ఊరుకోమని కూడా హెచ్చరిస్తున్నారు. మొత్తానికి విశాఖలో అన్ని నియోజకవర్గాలు వైసీపీ రూట్లోకి వచ్చినా కూడా సౌత్ మాత్రం చుక్కలు చూపిస్తోంది. ఇది కోరి వైసీపీ పెద్దలు చేసుకున్నదే అంటున్నారు.

Tags:    

Similar News